Reading Time: 2 minutes

నతున్నీసా సాజిదా బానోగా రాయచూరులో పుట్టిన జీనత్ సాజిదా ఉస్మానియా యూనివర్సిటీలో ఉర్దూలో డాక్టరేట్ పొంది అక్కడే మూడు దశాబ్దాలు పాఠాలు చెప్పారు. తెలుగు సాహిత్య చరిత్ర గురించి ఉర్దూలో సంపుటి ప్రచురించారు. రంగనాయకమ్మ ‘పేక మేడలు’ ని ఉర్దూలోకి అనువదించారు. హాస్యం, వ్యంగ్యం, సునిశితమైన పరిశీలనా కలిసి వుండే తన కొన్ని కథలు, వ్యాసాల తోనే ఉర్దూ సాహిత్యంపై తనదయిన ముద్ర వేశారు. ఉర్దూ పర్షియన్ ప్రక్రియ ఖాకిలో గాలిబ్, రాజ్ బహదూర్ గౌర్, మఖ్దూమ్ వంటి ప్రముఖుల గురించిన వ్యగ్యం, హాస్యం కలిపిన – కలం చిత్రాలు రాశారు. ‘అసూయతో నిండిన గొంతుక’తో రాసినట్లుండే ఈ వ్యాసం హైద్రాబాదు నగరానికి, మఖ్దూమ్‌కి గల అవినాభావ సంబంధం గురించి మనం ఊహించని రీతిలో చిత్రీకరిస్తుంది.

ఈ మఖ్దూమ్ ఉత్సవంలో ప్రతి ఒక్కరూ అయన గురించి పెద్ద స్తోత్రాలు వల్లిస్తుంటే చూసి అసూయతో నా గుండె రగిలి కబాబ్ అయిపో యింది. అవ్వదా మరి? మామూలు రోజుల్లోనే ఆయనంటే సహజంగానే అసూయ కలుగుతుంది. ముఘల్ పురాలోని నవాబుల నుండి, చిక్కడపల్లిలోని కూలీల వరకూ అందరూ ఆయనతో ప్రేమలో పడేవాళ్ళే. సంవత్సరం మొత్తంలో, ఒక్క నజమ్ లేక ఒక్క ఘజల్ రాసినా సరే, నగరమంతా దాన్ని కంఠస్థం చేసేస్తుందయ్యే. అసలు హైదరాబాదీలందరికీ ఆయన ఒక పెద్ద బలహీనత. గంజాయికి లాగా ఒక వ్యసనమయ్యి కూర్చున్నాడు. ఇప్పుడిప్పుడే ఆంధ్రా నుండి దిగిన వాళ్ళు కూడా మేం కూడా ఉర్దూ నేర్చుకున్నాం అని గొప్ప లుపోతూ (మున్షి అమీరుల్లా తస్లీమ్ రాసిన) ఘజల్ కూని రాగాలు తీసుకుంటూ తిరుగుతున్నారు. మఖ్దూమ్‌కి ఇదంతా తలకెక్కి, ఇంకా చెడిపోయాడు. కవి ననే బడాయి, పైగా ఈ పొగడ్తలు ఆయన్ని ఇంకా చెడ గొట్టాయి. అసలే ఆయన ఒక చేదు మాత్ర లాంటి వాడు. ఇప్పుడు అది పరాకాష్ట కెళ్ళి ఒక పెద్ద వేప చెట్టు చిటారు కొమ్మ మీద కూర్చున్నాడు. దీనికి మంచి విరుగుడు ఆయన్ని అపహాస్యం చెయ్యటం. అందరిళ్ళల్లో లాగే మా ఇంట్లో కూడా అయనకి ఫాన్స్ ఉండబట్టి నాకు ఇంట్లో కూడా ఆయన్ని వ్యతిరేకించటం కష్టసాధ్యం అయిపొయింది. కానీ ఈ స్టేజీ మీద అనేక మంది ముఖ్య అతిథులు ఉన్నారు గనుక, నేను ఆయన్ని గేలి చేసినా, నా జీవితానికి, ఆస్తికి భరోసా వుంది.

మఖ్దూమ్ ఒక దుర్మార్గుడు. ఎన్నో రోజుల నుండి

నా కోసం ఒక ఘజల్ రాయమని ఆయన్ని అడుగుతున్నాను. ఒక ముషాయిరాలో దాన్ని చదివి దానికి స్పందనగా కరతాళ ధ్వనులు వినాలనుకున్నాను. కవులకి ‘వాహ్‌వా’లు, ‘సుభాన్ అల్లా’లు, ‘ఇర్షా ద్, ఇర్షాద్’లు, ఇంకా చప్పట్లు, ప్రశంసలు ధారాళంగా దొరుకుతాయి. సహజంగానే నా చిన్ని గుండెక్కూడా అవి కావాలనే ఆశ కలిగింది. తాను రాయబోయే కొత్త కవిత నాకు ఇవ్వటానికి మఖ్దూమ్ కూడా వెంటనే ఒప్పుకున్నాడు. విషయం ఏమిటంటే, కవిత రాస్తున్న క్రమంలో ఆయన ఎవరో ఒకరికి దాన్ని వల్లిస్తాడు. వాక్యంలో పావు భాగం, అర భాగం, ముప్పావు వంతు, చివరికి మొత్తం కవిత ఎవరో ఒకరికి వినిపిస్తాడు. చుట్టు పక్కల ఎవరూ లేకపోతే, ఫోన్ చేసి మరీ వినిపిస్తాడు. ఫోన్‌లో ఎవరూ దొరక్కపోతే, వాళ్ళ ఇళ్లకెళ్లి మరీ వినిపిస్తాడు. శ్రోతలు దొరక్కపోతే, రిక్షా ఎక్కి వెళ్ళటానికని వేరే వాళ్ళ దగ్గర డబ్బు అప్పు తీసుకుని మరీ వాళ్ళని దొరక బట్టుకుంటాడు.

ఆ డబ్బుని స్వాహా చేసేసి, ఆ కవితని వల్లిస్తాడు. మంచి శ్రోత దొరక్కపోతే, రోడ్డు మీద వెళ్లే వాళ్ళని ఆపి వాళ్లకి వినిపిస్తాడు. మఖ్దూమ్ ని చూసి, దారినపొయ్యేవాళ్ళు కూడా ఆగి వింటారులెండి. తన కవితని రిక్షావాళ్లకి, హోటళ్లలో సర్వర్లకి, చిన్నపిల్లలకి అందరికీ వినిపిస్తాడు. ఆ నజమ్ లేదా ఘజల్ రాయటం పూర్తయ్యేటప్పటికీ, వందలాది మందికి దాన్ని పదేపదే వినిపించేస్తాడు. ఆయన కవిత్వం ఒక అంటువ్యాధి లాంటిది. విన్న శ్రోతలు వెంటనే దాన్ని వేరే వాళ్ళకి వినిపిస్తారు. ఇలా హైదరాబాదీ పబ్లిక్ అంతా చిలకల్లాగా అయన కవిత్వాన్ని కంఠతా పట్టేస్తుంది. నా దగ్గరికొచ్చేసరికి ప్రతి ఒక్కరికీ ఆ కవిత కంఠస్థం అయిపోయి ఉంటుంది. మరి ఆయన్ని దుష్టుడు అనకుండా ఏమనాలి చెప్పండి? మీర్ (ప్రముఖ కవి) కవితలు దొంగిలించటం తేలిక.

అందరికీ ఆ కవితలు తెలియవు కాబట్టి ఎవరూ పట్టుకోలేరు. కానీ మఖ్దూమ్ కవితలో చిన్న భాగాన్ని ఎవరికయినా వినిపిస్తే, వాళ్ళు మిగతా భాగం మనకి వినిపించేసి, ‘మఖ్దూమ్ కవిత్వం ఎంత అద్భుతంగా ఉంటుందో కదా’ అంటారు. ఆల్ ఇండియా రేడియో ఆయన కవిత్వాన్ని పక్కన పెట్టి ఏం సాధించింది? ఆయనకి దానితో ఏ నష్టం కలగలేదు. పనికిమాలిన చేష్టలతో వాళ్ళే ఎక్కడా మొహం చూపించుకోలేకుండా ఉన్నారు. ఆయనే స్వభావ రీత్యా ఒక రేడియో స్టేషన్. తన ప్రోగ్రాములని ఎన్ని సార్లు ప్రసారం చేస్తాడంటే, దగ్గరున్న వాళ్ళూ, దూరంగా ఉండేవాళ్ళూ ఆయన కవిత్వాన్ని కంఠస్థం చెయ్యటం తప్పనిసరి అవుతుంది. కవి సమ్మేళనాలలో కవిత్వాన్ని చదవమంటే మాత్రం, నానా వేషాలు వేసి, తన కవితల్ని తానే మర్చిపోయినట్లు నటిస్తాడు. జనాలు తప్పకుండా చదవాలని పట్టుబడితే తడబడినట్లు నాటకాలేస్తాడు. చివరికి వాళ్ళే ముక్త కంఠంతో అయన కవిత్వం వల్లె వేస్తే, జాతి పుంజు లాగా ఛాతీ ఎగేసి, గర్వంగా చుట్టూ చూస్తుంటాడు.

– సునీత