
నియోజకవర్గాల పునర్విభజనతోపాటు దేశంలో 33 శాతం మహిళా రిజర్వేషన్లు అమలు కాబోతున్నాయి. ఇప్పటివరకు చట్టసభలను దాటలేకపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు మరికొద్ది రోజుల్లో అమలుకానుంది. దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని రాజకీయాల్లో మహిళా రిజర్వేషన్లు మార్చివేయబోతున్నాయి. ఇప్పటిదాకా వ్యక్తిగత చొరవతోనో, ప్రత్యేకమైన ఆసక్తితోనో… రాజకీయాల్లోకొచ్చి వ్యయప్రయాసలకోర్చి ..మహిళలు మనుగడ సాగించాల్సిందే తప్ప.. వాళ్లకంటూ ప్రత్యేక కోటా ఇవ్వడం..అదీ 33 శాతం ఇవ్వడం కచ్చితంగా చారిత్రక సందర్భమే. లోక్ సభ అభర్థుల నియోజకవర్గాల పునర్విభజనతోపాటు ఇప్పుడు మహిళలకు 33 శాతం నియోజకవర్గాల కేటాయింపుపై కసరత్తు మొదలైంది. ఇదే అంశంపై ఇవాల్టి ఛైర్మన్స్ డెస్క్ చూద్దాం.
దేశంలో మహిళా రిజర్వేషన్ డిమాండ్ వలసరాజ్యాల కాలం నాటిది. 1935లో భారత ప్రభుత్వ చట్టం ప్రావిన్షియల్ లెజిస్లేచర్లలో 41 రిజర్వ్డ్ సీట్లు, సెంట్రల్ లెజిస్లేచర్లలో పరిమిత రిజర్వేషన్లను మహిళలకు అందించింది. ఉమెన్స్ ఇండియా అసోసియేషన్ , ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ , నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఇండియా వంటి ఆ కాలంలోని ప్రధాన మహిళా సంఘాలు భారతీయ మహిళలకు ఓటు హక్కు కోసం మాత్రమే డిమాండ్ చేశాయి. అదే సమయంలో ఆ సంఘాలు ప్రభుత్వంలో మహిళలకు మాత్రమే కొన్ని సీట్లు ఉండాలనే డిమాండ్‌ను డీల్ చేయాల్సి వచ్చింది. అయితే దీనిని ఆ సంఘాలు వ్యతిరేకించాయి కానీ 1935లో బ్రిటన్ మహిళలకు కొన్ని సీట్లు ఇచ్చింది.
రాజ్యాంగాన్ని రూపొందించిన రాజ్యాంగ సభలో కూడా మహిళా రిజర్వేషన్ అంశం చర్చకు వచ్చింది. అయితే, రిజర్వ్‌డ్ సీట్ల అవసరం లేకుండా ప్రభుత్వంలో మహిళలకు ప్రాతినిధ్యం కల్పిస్తామని కొందరు సభ్యులు వాదించడంతో, రిజర్వేషన్ అనవసరంగా భావించారు. మహిళలకు ప్రత్యేక హక్కులు అవసరం లేదని, వారిని పురుషులతో సమానంగా చూడాలని రాజ్యాంగ పరిషత్ సభ్యురాలు రేణుకా రే వాదిస్తూ మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడారు. మహిళలు తమ హక్కుల కోసం శతాబ్దాలుగా పోరాడారని, ఇప్పుడు ప్రభుత్వంలో బాధ్యతాయుతమైన పాత్రలు పోషించేందుకు సిద్ధంగా ఉన్నారని ఆమె వ్యాఖ్యానించారు. ప్రభుత్వంలో మహిళలకు రిజర్వేషన్ సీట్ల ఆలోచనను దేశంలోని మహిళా సంస్థలు కూడా తిరస్కరించాయి. మహిళలకు ప్రత్యేక శ్రద్ధ అవసరమని తాను అనుకోవట్లేదన్నారు ప్రముఖ నాయకురాలు సరోజినీ నాయుడు. మహిళలు దృఢమైన వారని, సమర్ధులని, పురుషుల నుంచి రక్షణ పొందాల్సిన అవసరం లేదని ఆమె అప్పట్లో మాట్లాడారు. రాజకీయాలలో, యుద్ధంలో మహిళలు ఎల్లప్పుడూ పాల్గొంటారని, స్త్రీలు పురుషులతో సమానమని, వారికి రిజర్వేషన్ల అవసరం లేదని సరోజినీ నాయుడు వాదించారు.
దేశంలో లింగ విబేధం లేకుండా అందరికి సమాన హక్కులు ఉండాలని.. అన్ని మతాలు, వర్గాలు, సంస్కృతులు సమానంగా ఉండాలన్న ఆంక్షతో స్వాతంత్ర్యం సాధించుకున్నాం. కానీ… పురుషుల ఆధిపత్యం ఎక్కువై.. మహిళల ప్రాధాన్యత తగ్గుతూ ఉండటంతో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ప్రాధాన్యత పెరిగింది. మార్గరెట్ అల్వా నేతృత్వంలోని కమిటీ 1988లో మహిళల హక్కుల కోసం ఒక నివేదికను రూపొందించింది. ఇందులో అందరికీ ఒకే చట్టం, మహిళల ఆస్తులు, సీట్లు, లింగనిర్ధారణ పరీక్షలు, వరకట్న వేధింపులు వంటి 353 సూచనలు ఉన్నాయి. రాజ్యాంగంలోని 73వ, 74వ సవరణ చట్టాలు పంచాయతీ రాజ్ సంస్థలు, మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు వంటి సంస్థల్లో మహిళలకు మూడింట ఒక వంతు సీట్లు కేటాయించాయి. అంటే ఈ సంస్థలలో ఎన్నుకునే సభ్యులలో కనీసం మూడింట ఒకవంతు మంది మహిళలు ఉండాలి.
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హయాంలో తొలిసారిగా మహిళా రిజర్వేషన్ బిల్లు అంశం తెరపైకి వచ్చింది. 1989లో ఈ విషయంపై రాజ్యాంగాన్ని సవరించాలని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు రాజీవ్ గాంధీ. రూరల్, అర్బన్ ఎన్నికల వ్యవస్థల్లో మహిళలకు మూడింట ఒకవంతు రిజర్వేషన్ కల్పించే విధంగా ఈ బిల్లు ఉండాలని పేర్కొన్నారు. ఈ బిల్లు లోక్‌సభలో గట్టెక్కినా.. రాజ్యసభలో మాత్రం ఆమోద ముద్రపడలేదు. 1992, 1993లో నాటి పీవీ నర్సింహ రావు ప్రభుత్వం.. 72-73వ రాజ్యాంగ చట్ట సవరణల బిల్లులను పార్లమెంట్లో తిరిగి ప్రవేశపెట్టింది. పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పించే విధంగా దీనిని అప్పటి ప్రభుత్వం రూపొందించింది. ఉభయసభల్లో ఈ బిల్లు గట్టెక్కి.. చట్టంగా కార్యరూపం దాల్చింది. ఈ చారిత్రాత్మక సవరణ ద్వారా స్థానిక సంస్థల్లో భారత మహిళల ప్రాతినిధ్యం ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది. దేశవ్యాప్తంగా పంచాయతీ రాజ్ సంస్థల్లో సుమారు 14.5 లక్షల మంది ఎన్నికైన మహిళా ప్రతినిధులు ఉన్నారు. ఇది మొత్తం ప్రతినిధుల్లో 46 శాతానికి సమానం. ఇది ప్రపంచంలోనే సాటిలేని రికార్డు. రాజ్యాంగం కనీసం 33 శాతం రిజర్వేషన్లు ఉండాలని చెబుతున్నా, ఇప్పటికే దేశంలోని 21 రాష్ట్రాలు స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నిబంధనలు చేశాయి. ఈ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, తెలంగాణ, త్రిపుర, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి.
1996 సెప్టెంబర్ 12న.. దేవె గౌడ నేతృత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం.. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్‌కు సంబంధించి తొలిసారి.. 81వ రాజ్యాంగ చట్ట సవరణ బిల్లును తీసుకొచ్చింది. కానీ ఇది లోక్‌సభలోనే గట్టెక్కలేపోయింది. జాయింట్ పార్లమెంటరీ కమిటీకి దీనిని సిఫార్సు చేశారు. 1996 డిసెంబర్లో.. కమిటీ తన నివేదికను బయటపెట్టింది. కానీ లోక్‌సభ రద్దు అవ్వడంతో బిల్లును ఎవరు పట్టించుకోలేదు. రెండేళ్ల తర్వాత.. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం కూడా మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రస్తావించింది. అప్పుడు కూడా బిల్లుకు మద్దతు లభించలేదు. 1999, 2002, 2003లో వాజ్‌పేయి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు కూడా పార్లమెంట్లో విఫలమయ్యాయి. ఐదేళ్ల తర్వాత.. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఈ బిల్లును ప్రస్తావించింది. 2008 మే 6న ఈ బిల్లును రాజ్యసభలోకి తీసుకొచ్చింది. 1996 కిమిటీ చేసిన 7 సిఫార్సులో ఐదింటిని ఈ బిల్లులో చేర్చినట్టు అప్పటి యూపీఏ ప్రభుత్వం వెల్లడించింది. కొన్ని రోజులకే ఈ బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపించారు. 2009 డిసెంబర్లో స్టాండింగ్ కమిటీ నివేదిక వచ్చింది. 2010 ఫిబ్రవరిలో అప్పటి కేంద్ర కేబినెట్.. ఆమోద ముద్రవేసింది. చివరికి.. 2010 మే9న రాజ్యసభలో ఈ బిల్లు గట్టెక్కింది. ఆ తర్వాతి కాలంలో ఈ బిల్లు లోక్‌సభ ముందుకు రానేలేదు. 2014లో లోక్‌సభ రద్దు అయ్యింది. ఆ తర్వాత 2023లో పార్లమెంట్, అసెంబ్లీలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. దీంతో మహిళా రిజర్వేషన్ చట్టమైంది. ఇప్పుడు రాజ్యాంగ సవరణ చేసి.. 2011 జనాభా లెక్కల ప్రకారం వచ్చే సార్వత్రిక ఎన్నికల నుంచే మహిళా కోటా చట్టం అమలు చేయాలని కేంద్రం కృతనిశ్చయంతో ఉంది.
17వ లోక్‌సభలో ఇప్పటివరకు అత్యధికంగా 82 మంది మహిళా ఎంపీలు ఉన్నారు. ఇది మొత్తం లోక్‌సభ బలంలో దాదాపు 15.21 శాతం. 2022లో ప్రభుత్వ డేటా ప్రకారం రాజ్యసభలో మహిళల ప్రాతినిధ్యం దాదాపు 14 శాతం. 2014లో అంటే 16వ లోక్‌సభలో మొత్తం 11.87 శాతం అంటే 68మంది మహిళా ఎంపీలు ఉన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల ప్రకారం 47.27 కోట్ల మంది పురుషులు, 43.78 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 2019 ఎన్నికలలో, పురుషుల భాగస్వామ్యం కంటే 67.18 శాతం మహిళా ఓటరు భాగస్వామ్యం ఎక్కువగా ఉంది. ప్రస్తుత 18వ లోక్‌సభలో 74 మంది మహిళా ఎంపీలు ఉన్నారు. రాజ్యసభలో 39 మంది మహిళా ఎంపీలు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల అసెంబ్లీల విషయానికొస్తే.. ఏపీ అసెంబ్లీలో 22 మంది మహిళా ఎమ్మెల్యేలు, తెలంగాణలో 10 మంది మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ చట్టం అమలైతే అన్ని సభల్లో మహిళల ప్రాతినిధ్యం గణనీయంగా మెరుగు పడుతుందనడంలో సందేహం లేదు. నియోజకవర్గాలు పెంపుతో లోక్‌సభలో సీట్ల సంఖ్య 816కు పెరుగుతుంది. అప్పుడు కచ్చితంగా 273 మంది మహిళలకు ప్రాతినిధ్యం కల్పించక తప్పదు. అలాగే తెలుగు రాష్ట్రాల అసెంబ్లీల సంగతి చూసుకుంటే.. ఏపీ అసెంబ్లీలో సీట్ల సంఖ్య 263కు పెరుగుతుంది. అప్పుడు ఏకంగా 88 సీట్లలో మహిళల ప్రాతినిధ్యం తప్పదు. అలాగే తెలంగాణ అసెంబ్లీలో సీట్ల సంఖ్య 179కి పెరుగుతుంది. అప్పుడు ఏకంగా 60 సీట్లలో మహిళలకు ప్రాతినిధ్యం దక్కుతుంది. ఇలా ఏ చట్టసభ చూసుకున్నా.. మహిళలకు ప్రాతినిధ్యం అనివార్యంగా పెరిగి.. పాలనలోనూ పెను మార్పులకు అవకాశం ఉంటుంది.
మహిళా రిజర్వేషన్ చట్టాన్ని త్వరగా అమలు చేసేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంపై చర్చించేందుకు ప్రతిపక్షాలు అఖిలపక్ష భేటీకి డిమాండ్ చేస్తున్న తరుణంలో వారితో చర్చించాకే ప్రత్యేక సమావేశాల్లో ఈ చట్టానికి సవరణలు చేయాలని కేంద్రం యోచిస్తోంది. నారీ శక్తి వందన్ అధినియమ్2023 ప్రకారం లోక్‌సభ, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33 శాతం సీట్లను రిజర్వ్ చేయనున్నారు.
మహిళలకు సీట్లు రొటేషనల్ పద్ధతిలో రిజర్వ్ చేస్తారు. వరుసగా ప్రతి మూడు సార్వత్రిక ఎన్నికల్లో ఒకసారి మహిళలకు లాటరీ డ్రా పద్ధతిలో సీట్ రిజర్వ్ చేస్తారు. మహిళా రిజర్వేషన్ సాఫీగా అమలు జరగటానికే 50 శాతం సీట్ల పెంపు ఫార్ములాను తెరపైకి తెచ్చారు. తద్వారా ప్రస్తుత సిట్టింగ్ ఎంపీలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మహిళా కోటాను అమలు చేయవచ్చని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం మహిళా కోటాలో ఓబీసీలకు కూడా ఉప-కోటా ఉండాలని కాంగ్రెస్, ఎస్పీ వంటి పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.
చట్టసభల్లో ఇక 33 శాతం మహిళలు కనిపించబోతున్నారు. ప్రాథమిక స్థాయిలో మహిళా రిజర్వేషన్ కొంత దారితప్పే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే పదవుల్లో ఉన్న వారి కుటంబసభ్యులకే అవకాశాలు ఇప్పించుకోవచ్చు. అలాగే ధనిక, అగ్రవర్ణ మహిళలకు ముందుగా అవకాశం రావొచ్చు. రాజకీయా పార్టీల్లో ప్రాబల్యం ఉన్న కుటుంబాల మహిళే.. మళ్లీ ఈ రిజర్వేషన్ వాడుకుని చక్రం తిప్పే అవకాశం లేకపోలేదు. అయితే ఇదంతా ప్రాథమికంగా కొన్నేళ్ల పాటు జరుగుతుంది. అయితే .. ఆ తర్వాత ఇది అన్ని వర్గాలకు అందుబాటులోకి వస్తుంది. దేశ రాజకీయాల్లో కొత్త మార్పు చూస్తాము.
ప్రస్తుతం రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలకు చెందిన మహిళలే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. అరకొర మినహాయింపులున్నా సాధారణంగా కనిపించే రాజకీయ చిత్రమిది. మహిళలకు మూడోవంతు ప్రాతినిధ్యం అమలైతే.. ఈ పరిస్థితి మారే అవకాశాలున్నాయి. అందుబాటులో ఉండే సీట్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. రాజకీయ నేపథ్యం లేని కుటుంబాలకు చెందిన వారు కూడా పోటీకి ముందుకొస్తారు. స్థానిక సంస్థల ఎన్నికలు దీనికి రుజువు. రిజర్వేషన్ కారణంగా పట్టణాలు, గ్రామాల్లో.. ఎంతోమంది సాధారణ నేపథ్యం ఉన్న మహిళలు రాజకీయాల్లోకి ప్రవేశించి తమదైన ముద్ర వేశారు. దేశవ్యాప్తంగా దాదాపు పది లక్షల మంది మహిళలు స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా రాజకీయ రంగప్రవేశం చేసినట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. దీనికిదే ఒక విజయంగా చెప్పవచ్చు.
స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ అమలులోకి వచ్చిన తర్వాత ఇంట్లో స్త్రీల నిర్ణయాధికారం పెరగటంతోపాటు ఉద్యోగాల్లో, స్వయం ఉపాధిలో, మొత్తంగా ప్రజాజీవనంలో వారి ప్రభావం, సంఖ్య పెరిగిందని అనేక అధ్యయనాలు తేల్చి చెప్పాయి. అంతేకాదు, మహిళల పాలనలో ఉన్న గ్రామాలు, పట్టణాల్లో తాగునీరు, పారిశుద్ధ్యం, పాఠశాలలు, ఆస్పత్రి, పౌష్టికాహారం వంటి అంశాలకు అధిక ప్రాధాన్యం లభిస్తోందని, మహిళలపై నేరాలు తగ్గాయని వెల్లడైంది. రాష్ట్రాన్ని, యావత్ దేశాన్ని ప్రభావితం చేసే చట్టసభల్లో అతివల సంఖ్య పెరిగితే.. చట్టాల రూపకల్పనలోనూ ఈ మార్పులు ప్రతిబింబిస్తాయన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక భారీ మార్పు రాబోతోంది. నియోజకవర్గాల పునర్విభజనతో పెరగనున్న సీట్లు , మహిళా రిజర్వేషన్ బిల్లు అమలులోకి రానుండటంతో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ యవనికపై మహిళా నేతల హవా మొదలుకానుంది. ఇప్పటి వరకు పురుషాధిక్య రాజకీయాల్లో అవకాశాల కోసం ఎదురుచూసిన ఎంతో మంది చైతన్యవంతులైన మహిళలకు ఇది నిజంగానే గోల్డెన్ టైమ్ అని చెప్పవచ్చు. ప్రతి ముగ్గురు ఎమ్మెల్యేలలో ఒకరు కచ్చితంగా మహిళా నేతే ఉండబోతుండటంతో, ఇరు రాష్ట్రాల్లోని ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే మహిళా కేడర్‌ను సిద్ధం చేసే పనిలో పడ్డాయి.
ప్రస్తుత అంచనాల ప్రకారం, రెండు రాష్ట్రాల్లో కలిపి సుమారు 140 మందికి పైగా మహిళా ఎమ్మెల్యేలు చట్టసభల్లో అడుగుపెట్టబోతున్నారు. గతంలో కేవలం 10 నుంచి 15 శాతం లోపే ఉన్న మహిళా ప్రాతినిధ్యం, ఇప్పుడు ఏకంగా 33 శాతానికి పెరగడం రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేయనుంది. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లు ఉన్నప్పటికీ, చాలా చోట్ల భర్తలు లేదా కుటుంబ సభ్యులు ప్రాక్సీలుగా పాలన సాగించేవారు. కానీ, అసెంబ్లీ స్థాయికి వచ్చేసరికి పరిస్థితి భిన్నంగా ఉండబోతోంది. ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం, పెరిగిన విద్యావంతుల సంఖ్య, మహిళల్లో వచ్చిన రాజకీయ చైతన్యంతో సొంతంగా ఎదిగే నేతలకే ప్రాధాన్యత పెరగనుంది. పార్టీలు కూడా కేవలం డమ్మీ అభ్యర్థులను కాకుండా, ప్రజల్లో పట్టున్న, సొంతంగా గెలవగల సామర్థ్యం ఉన్న మహిళా నేతలకే టికెట్లు ఇచ్చే అవకాశం ఉంది.
ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పార్టీలైన టీడపీ, వైఎస్సార్‌సీపీ, జనసేన, బీఆర్ఎస్, కాంగ్రెస్ , బీజేపీలలో ద్వితీయ శ్రేణి మహిళా నాయకత్వం బలంగా ఉంది. నియోజకవర్గాల్లో పార్టీ కార్యకలాపాలు నిర్వహించడం, ప్రజా సమస్యలపై గళం విప్పడం వంటి పనుల్లో మహిళలు చురుగ్గా పాల్గొంటున్నారు. రాబోయే ఎన్నికల్లో రిజర్వేషన్లు ఖచ్చితం కావడంతో, ఇప్పటి వరకు తెర వెనుక ఉండి పనిచేసిన మహిళా నేతలు ఇప్పుడు నేరుగా ప్రజల ముందుకు వచ్చి తమ నాయకత్వ లక్షణాలను నిరూపించుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇది రాజకీయాల్లో ఒక రకమైన వడపోత కు దారితీసి, అసలైన సమర్థులైన మహిళా నేతలను బయటకు తీస్తుంది.
మహిళా రిజర్వేషన్ల వల్ల కేవలం లింగపరమైన ప్రాతినిధ్యమే కాకుండా, సామాజిక సమీకరణాలు కూడా మారుతాయి. రిజర్వ్‌డ్ నియోజకవర్గాల్లో మహిళా నేతల ఎంపిక కోసం పార్టీలు కొత్త వ్యూహాలను రచించాల్సి ఉంటుంది. మహిళా ఓటర్లు అత్యధికంగా ఉన్న తెలుగు రాష్ట్రాల్లో, ఒక మహిళా నేత ఎన్నికల బరిలో ఉంటే మహిళా ఓటింగ్ శాతం పెరగడమే కాకుండా, విద్య, ఆరోగ్యం, తాగునీరు వంటి మౌలిక సమస్యలపై చర్చ ఎక్కువగా జరుగుతుంది. ఇది రాజకీయాల్లో క్వాలిటీ ని పెంచుతుందనడంలో సందేహం లేదు.
ఎలా చూసుకున్నా తెలుగు రాష్ట్రాల్లో మహిళా నేతలకు రాబోయే ఐదేళ్లు అత్యంత కీలకం. అవకాశాల కోసం ఎదురుచూసే దశ నుంచి, అవకాశాలను శాసించే దశకు వారు చేరుకోబోతున్నారు. పార్టీలు కూడా తమ గెలుపు గుర్రాలను వెతుక్కునే క్రమంలో మహిళా అనుబంధ విభాగాలను బలోపేతం చేస్తున్నాయి. చట్టసభల్లో మహిళల భాగస్వామ్యం పెరగడం వల్ల పాలనలో మానవత్వం, పారదర్శకత పెరుగుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మార్పు కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా, సమాజంలోని అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు బాటలు వేయనుంది.
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలైతే.. దేశ రాజకీయాల్లో స్త్రీ పురుష సమానత్వం దిశగా మరో కీలక ముందడుగు పడినట్లే. ఇప్పటికే స్థానిక సంస్థల్లో అమలవుతున్న కోటా కారణంగా.. గ్రామాలు, పట్టణాల్లో అతివల ప్రాతినిధ్యం గణనీయంగా పెరిగింది కానీ.. కొన్ని దశాబ్దాలుగా అది అక్కడికే పరిమితమైంది. రాజకీయాధికారానికి అసలు సిసలు కేంద్రబిందువైన అసెంబ్లీలకు, పార్లమెంటుకు విస్తరించలేదు. కానీ ఇప్పుడు కేంద్రం తీసుకురానున్న బిల్లుతో ఈ లక్ష్యం చేరుకోవటానికి మహిళలకు ఇక ఎంతో కాలం పట్టదు. జనాభాలో సగభాగం ఉన్న స్త్రీలు.. దేశాన్ని శాసించే లోక్‌సభలో ఇంత తక్కువ ప్రాతినిధ్యం కలిగి ఉండటం ఎంతమాత్రం సరైనది కాదని పలు సర్వేలు, అధ్యయనాలు హెచ్చరించాయి. ఈ తరుణంలో.. ఆలస్యంగానైనా.. ఈ దిశగా మంచి మార్పు మొదలైందని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహిళా రిజర్వేషన్ చట్టం అమలైతే 33 శాతం తప్పనిసరి ప్రాతినిధ్యానికి తోడుగా.. జనరల్, ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో పురుషులతో తలపడి గెలిచే మహిళలతో ఈ సంఖ్య మరింత పెరుగుతుంది.
పార్లమెంటు, అసెంబ్లీ వంటి అత్యున్నత చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం గణనీయంగా పెరగటం సమాజంలోని బాలికలు, యువతులపై మంచి ప్రభావం చూపుతుంది. వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎంచుకున్న రంగంలో ముందుకు వెళ్లటానికి దోహదపడుతుంది. తాము కూడా రాజకీయ రంగంలోకి వచ్చి ప్రజాసేవ చేయాలని, విధానపరమైన నిర్ణయాల్లో భాగస్వామ్యం తీసుకోవాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకునే అవకాశాలు పెరుగుతాయి. రాజకీయాలు పురుషుల కార్యక్షేత్రం అన్న అభిప్రాయం క్రమేణా తొలగిపోయి, స్త్రీ పురుష సమానత్వం దిశగా బలమైన అడుగులు పడతాయి.
స్థానిక సంస్థల్లో మహిళల ప్రాతినిధ్యం పెరిగినప్పటికీ.. పలు చోట్ల.. వారి తరఫున వారి భర్తలే అజమాయిషీ చేస్తున్నారన్న విమర్శలున్నాయి. దేశవ్యాప్తంగా ఇలాగే లేకపోయినా.. ఇదొక తీవ్రమైన సమస్యగానే కొనసాగుతోంది. చట్టసభల్లో రిజర్వేషన్ అమలైన తర్వాత కూడా ఇదే పరిస్థితి ఉంటుందా అన్న సందేహాలు ఉన్నాయి. అలాగే, దేశ జనాభాలో మెజారిటీగా ఉన్న బీసీలకు మహిళా కోటాలో ఉప కోటా కేటాయించకుండా మహిళా రిజర్వేషన్లు కల్పిస్తే.. ఇప్పటికే ఉన్న అగ్రకుల రాజకీయాల్ని మరింత సుస్థిరం చేసినట్లవుతుందన్న విమర్శలున్నాయి. మహిళలకు కేటాయించిన సీట్లలో ధనబలం అధికంగా ఉన్న అగ్రకులాలకు చెందిన మహిళలే ఎన్నికవుతారని, వారితో బీసీ మహిళలు తలపడలేరన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫలితంగా, చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ లింగ సమానత్వం వంటి సానుకూల మార్పులకు నాంది పలికినా.. సామాజిక న్యాయం ఎండమావే అవుతుందన్న అంచనాలున్నాయి. కానీ ఇవన్నీ అపోహలేనని, అంతిమంగా మహిళా రిజర్వేషన్లు.. ఆరోగ్యకరమైన సమాజానికి బాటలు వేస్తాయని స్థానిక సంస్థల అనుభవాలు చెబుతున్నాయనడంలో సందేహం లేదు.
మహిళా రిజర్వేషన్ కు మద్దతుపలికే వారితో పాటు వ్యతిరేకించే వారు కూడా ఉన్నారు. విధానాల రూపకల్పనలో మహిళల పాత్ర ఉండాలని, లింగ సమనత్వం సాధించాలంటే కోటా అవసరమేననేది మద్దతుదారులు వాదన. అదే సమయంలో.. ఒక కులానికి ఇచ్చే రిజర్వేషన్లతో ఈ మహిళా రిజర్వేషన్లను పోల్చకూడదని ఇంకొందరు అంటున్నారు. మహిళా కోటాతో రాజ్యాంగంలో ఉన్న సమానత్వ భావాలకు గండిపడుతుందనే ఆరోపణలు లేకపోలేదు. రిజర్వేషన్ వస్తే.. మెరిట్ ఆధారంగా వచ్చే స్థానాలు పోతాయనే అభిప్రాయాలు కూడా వస్తున్నాయి. పైగా రాజ్యసభలో ఉన్న ఎన్నికల ప్రక్రియ కూడా ఈ రిజర్వేషన్‌కు సహకరించదంని కొందరు అంటున్నారు. కానీ ఇవన్నీ బాలారిష్టాలేనని, కాలక్రమంలో అన్నీ సర్దుకుంటాయనే ధీమా మద్దతుదారుల్లో కనిపిస్తోంది.
కొన్ని అభివృద్ధి చెందిన దేశాలూ, మనకన్నా వెనకబడివున్న దేశాలూ కూడా మహిళలకు దశాబ్దాల క్రితమే చట్టసభల్లో కోటా ఇచ్చి గౌరవించాయి. రువాండాలో రాజ్యాంగం ప్రకారం 30 శాతం కాగా, ఆచరణలో దాదాపు 64 శాతం మంది మహిళలున్నారు. క్యూబాలో 55.7 శాతం, ఫ్రాన్స్, అర్జెంటీనా, దక్షిణాఫ్రికా, బొలివియా, మెక్సికోల్లో 50 శాతంవరకూ రిజర్వేషన్‌లున్నాయి. నేపాల్‌లో 33 శాతం కోటా అమలవుతోంది. మన ఎంపీల్లో మహిళలు 14 శాతం మించిలేరు. ఈ గణాంకాలు గమనిస్తే మనం ఎంత వెనకబడి ఉన్నామో అర్థమవుతుంది.
చరిత్రలో ఎందరో మహిళలు జనరంజకంగా పాలన చేసి.. సమర్థులైన నాయకురాళ్లుగా పేరు తెచ్చుకున్నారు. స్వాతంత్ర్యం తర్వాత కూడా మహిళా కోటా లేకుండానే ఇందిర, మమత, జయలలిత, మాయావతి, సుష్మా స్వరాజ్ వంటి మహిళా నేతలు దిగ్గజాలుగా రాజకీయాల్లో చక్రాలు తిప్పారు. ఆ రకంగా చూసుకుంటే మనకు మహిళల నాయకత్వం కొత్తేం కాదు. కాకపోతే మహిళా కోటా చట్టంగా అమలైతే.. కనిపించని వివక్ష కూడా తగ్గుముఖం పట్టి.. మహిళలకు మరిన్ని అవకాశాలు దక్కుతాయనేదే కేంద్రం భావన. అలాగే మహిళల రిజర్వేషన్లకు గతంతో పోలిస్తే ప్రస్తుతం అంత వ్యతిరేకత లేదు. ఎందుకంటే నేతల్లో కూడా కాలానుగుణంగా మార్పు వచ్చింది. పైగా మెజార్టీ పార్టీలు మహిళా ఓటర్ల అండతోనే అధికారం దక్కించుకుంటున్న సమయంలో.. మహిళలతో పెట్టుకునే సాహసం చేయటానికి ఎవరూ ముందుకు రారనడంలో సందేహమే లేదు. అల్టిమేట్‌గా మహిళలకు కాలం, చట్టం, పరిస్థితులు అన్నీ ఎట్టకేలకు అనుకూలిస్తున్నాయి. దశాబ్దాల పోరాటాలు, ఆకాంక్షల తర్వాత పార్లమెంట్ నుంచి పంచాయతీ దాకా మహిళా కోటా కల సాకారం కాబోతోంది. ఇదీ ఈ వారం ఛైర్మన్స్ డెస్క్. మరో అంశంపై విశ్లేషణతో మళ్లీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.