Reading Time: 1 minute
Revanth Reddy Tholi Mudda Anganwadi Breakfast Scheme

తెలంగాణ రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో చదువుకుంటున్న చిన్నారుల ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. అంగన్‌వాడీ చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించే లక్ష్యంతో “తొలి ముద్ద” అనే బ్రేక్‌ ఫాస్ట్ పథకాన్ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శనివారం శాసనసభ సమావేశ హాలులో లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఇకపై చిన్నారులకు ఉప్మా, కిచిడీ మిక్స్ వంటి ‘రెడీ టూ కుక్’ ఆహారాన్ని అల్పాహారంగా అందించనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్‌వాడీ కేంద్రాలకు విముక్తి కలిగిస్తూ, వచ్చే మూడేళ్లలో అన్ని కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి పక్కా ప్రణాళికలు సిద్ధం చేయాలని, అంగన్‌వాడీలు ఆదర్శవంతమైన వాతావరణంలో కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు.

ఉదయం ఖాళీ కడుపుతో ఇవి తింటే అద్భుత ఫలితాలు మీ సొంతం.!

అంగన్‌వాడీల పనితీరును మెరుగుపరచడానికి , సాంకేతికతను జోడించడానికి అంగన్‌వాడీ టీచర్లకు ముఖ్యమంత్రి మొబైల్ ఫోన్లను పంపిణీ చేశారు. క్షేత్రస్థాయిలో పౌష్టికాహార పంపిణీ , పిల్లల ఆరోగ్య పర్యవేక్షణలో ఈ మొబైల్ ఫోన్లు కీలక పాత్ర పోషిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ అంగన్‌వాడీ కార్యకర్తలపై ప్రభుత్వం గురుతర బాధ్యత పెట్టిందని గుర్తుచేశారు. “ప్రభుత్వం ఎంత మంచి పథకం తెచ్చినా, అది విజయవంతం కావాల్సింది మీ చేతుల్లోనే ఉంది. ఆకలిని ఒక అమ్మగా మీరు అర్థం చేసుకుంటారని, సమస్యల పట్ల మీకు అవగాహన ఉంటుందని ప్రభుత్వం నమ్ముతోంది. ఆరు సంవత్సరాల లోపు దశ పిల్లల ఎదుగుదలకు అత్యంత కీలకమైనది. ఈ సమయంలో వారికి సరైన పోషకాహారం అందకపోతే దేశ భవిష్యత్తుకే నష్టం” అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Electric Vehicles: ఎలక్ట్రిక్ వెహికిల్ కొనేవారికి భారీ శుభవార్త చెప్పిన కేంద్రం..

జబ్బులు వచ్చిన తర్వాత వేల కోట్లు ఖర్చు చేయడం కంటే, చిన్నప్పుడే పౌష్టికాహారం అందించి అనారోగ్యాలను నివారించడం మేలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. అంగన్‌వాడీ సిబ్బందిని ప్రభుత్వం తమ కుటుంబ సభ్యుల్లా భావిస్తోందని, రాష్ట్రానికి ఆర్థిక వెసులుబాటు కలిగిన వెంటనే అంగన్‌వాడీల సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని ఆయన భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు ధనసరి అనసూయ (సీతక్క), కొండా సురేఖ, బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్‌ సీతా దయాకర్ రెడ్డితో పాటు ఉన్నతాధికారులు, అంగన్‌వాడీ టీచర్లు , చిన్నారులు పాల్గొన్నారు.