Reading Time: < 1 minute
Iran Issues Welcome To Hell Warning To Us Over Possible Ground Troop Deployment

పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమైన నెల రోజుల తర్వాత మరింత తీవ్ర రూపం దాల్చింది. ‘తగ్గేదేలే’ అంటూ దూకుడు పెంచింది. గల్ఫ్ దేశాలు, అమెరికా స్థావరాలపై భీకర దాడులు చేస్తోంది. ఇక అమెరికా కూడా భూతల దాడులు చేసేందుకు సిద్ధపడుతోంది. అమెరికా సైన్యం రంగంలోకి దిగుతోంది. ఇలాంటి తరుణంలో ఇరాన్ పత్రిక అమెరికాకు తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. ‘‘నరకానికి స్వాగతం’’ అంటూ టైటిల్ పెట్టింది. ఇరాన్‌పైకి భూతల దళాలు ప్రవేశిస్తే.. అమెరికా సైనికులు ‘శవపేటికల్లోనే తిరిగి వెళ్తారని’ హెచ్చరించింది.

‘‘వెల్‌కమ్ టు హెల్’’ అనే హెడ్‌లైన్‌తో ప్రచురించిన కథనంలో ఇరాన్ భూభాగంలోకి అడుగుపెట్టే అమెరికా సైనికులు “శవపేటికల్లోనే తిరిగి వెళ్తారు” అని ఘాటుగా వ్యాఖ్యానించింది. అమెరికా మరో 10,000 వరకు భూసేనలను మధ్యప్రాచ్యానికి పంపే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు అమెరికా మీడియా కథనాలు వెలువడిన నేపథ్యంలో ఈ హెచ్చరిక రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇది ఇరాన్‌పై భూస్థాయి యుద్ధానికి దారితీయవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాల్ స్ట్రీట్ జర్నల్ (The Wall Street Journal) నివేదిక ప్రకారం… అదనపు అమెరికా సైనికులను ఇరాన్‌కు సమీప ప్రాంతాల్లో మోహరించే అవకాశముందని తెలుస్తోంది. ముఖ్యంగా ఇరాన్‌కు చెందిన కీలక చమురు ఎగుమతి కేంద్రం అయిన ఖార్గ్ దీవి పరిసరాల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారే అవకాశముందని అంచనా వేసింది.

గత నెల 28న ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమయ్యారు. దీంతో ఇరాన్ ప్రతీకార దాడులతో చేలరేగిపోయింది. గల్ఫ్ దేశాలు లక్ష్యంగా దాడులు చేస్తోంది. అంతేకాకుండా హార్ముజ్ జలసంధిని మూసేసింది. దీంతో ప్రపంచ దేశాల్లో చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది. ప్రస్తుతం పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.

ఇది కూడా చదవండి: Trump: ‘నా కాళ్లకు నమస్కరిస్తాడని అనుకోలేదు’.. సౌదీ యువరాజుపై బాంబ్ పేల్చిన ట్రంప్