Reading Time: < 1 minute

రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ వ్యవహారంపై అసెంబ్లీలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం జరిగింది. అనంతరం బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. రాఘవ కన్స్ట్రక్షన్ విషయంలో తప్పు జరిగిందని సిఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఒప్పుకున్నారని అన్నారు. అసెంబ్లీలో ప్రభుత్వం అడ్డంగ దొరికిపోయిందని.. ఒక తప్పును కప్పిపుచ్చుకునేందుకు రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం పది తప్పులు చేస్తోందని విమర్శించారు.  రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ ఇసుక దోపిడీ, అక్రమాలు చేస్తుందని ప్రతిపక్షం కాదు ప్రభుత్వమే కనుక్కుందని అందుకే వారికి నోటీసులు ఇచ్చామని సిఎం రేవంత్ చెప్పారని.. డైవర్షన్‌ కోసమే రేవంత్‌ రెడ్డి ఎదురుదాడికి దిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పొంగులేటి కంపెనీ అవినీతికి పాల్పడిందని ప్రజలకు అర్థమైందన్నారు. మంత్రి అవినీతికి పాల్పడితే.. సీబీసీఐడీ విచారణ సరిపోతుందా? అని హరీష్ రావు ప్రశ్నించారు.

కాగా.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాఘవ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ చేస్తున్న అక్రమ మైనింగ్ పట్ల చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రెండు రోజులపాటు అసెంబ్లీ నుండి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సస్పెండ్ చేశారు.