
ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురి జిల్లాలో ఓ ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. ఒక సామాన్య రైతు భార్య తన బ్యాంక్ అకౌంట్‌లో పొరపాటున పది కోట్ల రూపాయలు పడినా, ఆశపడకుండా నిజాయితీని చాటుకుని అందరి ప్రశంసలు అందుకుంటోంది.
ఎం జరిగిందంటే… దేవ్‌గంజ్ గ్రామానికి చెందిన రీటా అనే మహిళ వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తుంది. నవరాత్రి అష్టమి రోజున డబ్బులు తీసుకోవడానికి లోకల్ బ్యాంకుకు వెళ్ళింది. అయితే సెలవు కారణంగా బ్యాంక్ మూసి ఉండటంతో, దగ్గర్లోని ఏటీఎంకు వెళ్లి అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకుంది. అక్కడ స్క్రీన్ మీద ఉన్న బ్యాలెన్స్ చూసి ఆమెకు మైండ్ బ్లాక్ అయ్యింది.
అకౌంట్లో బ్యాలెన్స్ రూ. 9 కోట్ల 99 లక్షల 49 వేల 588
అవును, ఆమె అకౌంట్‌లో దాదాపు పది కోట్ల రూపాయలు వచ్చి పడ్డాయి. తన కళ్లను తనే నమ్మలేక, మరో ఏటీఎంలో కూడా చెక్ చేసి, బ్యాలెన్స్ చూపించే స్క్రీన్ వీడియో తీసింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
నిజాయితీ అంటే ఆమెదే
అకౌంట్‌లో అంత డబ్బు ఉన్నా రీటా ఒక్క రూపాయి కూడా తీయలేదు. అసలు ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో తెలిసే వరకు ఎవరూ ముట్టుకోవద్దు అని కుటుంబికులకు కూడా తెగేసి చెప్పింది. సాధారణంగా ఇలాంటి సమయాల్లో కొందరు ఆశ పడతారు, కానీ రీటా మాత్రం వెంటనే బ్యాంకు అధికారులకు సమాచారం ఇవ్వాలని నిర్ణయించుకుంది.
బ్యాంక్ అధికారులు ఏమన్నారంటే
బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ రిషికాంత్ పాండే మాట్లాడుతూ.. ఇది సాంకేతిక లోపం వల్ల గానీ లేదా ఎవరైనా పొరపాటున ట్రాన్స్‌ఫర్ చేయడం వల్ల గానీ జరిగి ఉండవచ్చని చెప్పారు. బ్యాంకు తెరిచిన వెంటనే విచారణ జరిపి ఆ డబ్బును వెనక్కి తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆమె పేదరికంలో ఉన్నా, కోట్ల రూపాయలు అకౌంట్లో కనిపించిన… తన నిజాయితీకి ఊరి జనం, నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.