గత కొన్ని రోజులుగా గుడ్ల గురించి సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. కొన్ని బ్రాండ్ల గుడ్లలో నైట్రోఫ్యూరాన్ అనే నిషేధిత యాంటీబయాటిక్ ఆనవాళ్లు కనుగొనబడ్డాయని, ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని కలిగిస్తాయని ఈ వార్త సారాంశం.
FSSAI ప్రకారం పౌల్ట్రీ,గుడ్ల ఉత్పత్తిలో నైట్రోఫ్యూరాన్ వాడకం పూర్తిగా నిషేధించబడింది. ఎక్కడైనా దాని ఆనవాళ్లు కనబడితే అది కేవలం పరిమితం మోతాదులో మాత్రమే ఉంటుంది. శాస్త్రీయ ఆధారాల ప్రకారం ఇంత తక్కువ స్థాయిలు ఉంటే క్యాన్సర్ లేదా మరే ఇతర ఆరోగ్య సమస్యలను కలిగించవు.
గుడ్లు ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలకు నిధి వంటివి. వాటిలో విటమిన్ ఎ, బి12, డి, ఇ, ఐరన్, జింక్, కోలిన్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. అవి కండరాలను బలపరిచి, కంటి చూపును మెరుగుపరిచి, ఎముకలను దృఢపరిచి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అందుకే రోజుకు ఒకటి నుంచి రెండు గుడ్లు తినడం ప్రయోజనకరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తు్ంటారు.
ఢిల్లీలోని అపోలో హాస్పిటల్స్ సీనియర్ డైటీషియన్ డాక్టర్ రమేష్ కుమార్ మాట్లాడుతూ.. గుడ్లు సంపూర్ణ ప్రోటీన్కు మూలం. ఇవి కండరాల నిర్మాణానికి, మెదడు ఆరోగ్యానికి, కళ్ళకు మంచివి. FSSAI నివేదిక ప్రకారం గుడ్డు వల్ల క్యాన్సర్ వస్తుందనేది పూర్తిగా తప్పు. ప్రతిరోజూ గుడ్లు తినడం వల్ల ఎలాంటి క్యాన్సర్ రాదు. గుడ్లలో కోలిన్ ఉంటుంది. ఇది మెదడు, కాలేయానికి చాలా అవసరం. ఇది మహిళలకు, పిల్లలకు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. క్యాన్సర్ వదంతులు నమ్మవద్దు.
గుడ్లను ఉడకబెట్టి లేదా పోచ్ చేసి తినడమే ఉత్తమం. వేయించిన గుడ్లను పరిమితంగా తినాలి. వీటిని కూరగాయలతో కలిపి తినండి. అలాగే మంచి బ్రాండ్ల గుడ్లను, ఫామ్ ఫ్రెష్ గుడ్లను ఎంచుకోవాలి. FSSAI హామీ ఇచ్చినట్లుగా మార్కెట్లో లభించే గుడ్లు సురక్షితమైనవి, పోషకమైనవి. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దు. సమతుల్య ఆహారంలో గుడ్లను చేర్చుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.




