Reading Time: 3 minutes

మన తెలంగాణ/హైదరాబాద్: బిఆర్‌ఎస్ ప్ర భుత్వం ధరణిని అడ్డం పెట్టుకుని తెరలేపిన భూ కుంభ కోణాలపై హౌస్ కమిటీ వేస్తామని, వాటికి ఒప్పుకోవాలని సిఎం రేవంత్‌రెడ్డి అన్నా రు. ఆదివారం శాసన సభలో సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మహబూబ్‌నగర్ జిల్లా బా లానగర్ లో ప్రయివేటు పరిశ్రమ యజమానులను బెదిరించి హరీష్ రావు తమ్ముడు మహేశ్ రావు ధరణి ద్వారా వందల ఎకరాలు భూ బదలాయింపు చేసుకున్నారని ఆరోపించారు. హరీ శ్‌రావు ఒప్పుకుంటే దీనిపై హౌస్ కమిటీ వేయడానికి మేం సిద్ధంగా ఉన్నామని సిఎం స్పష్టం చేశారు. భూ కుంభ కోణంలో సొంత బంధువు ను తప్పించాలని సంబంధిత మంత్రిని హరీశ్ రావు కోరారని,

వాటికి మంత్రి ఒప్పుకోకపోవడంతో ఇలా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పది సంవత్సరాలపై కూడా సిబిసిఐడి విచారణ చేయిస్తామని చెప్పడంతో సభ అయిపోయిన తరువాత హరీ శ్‌రావును ఆ కుంభకోణంలో ఉన్న బంధువులు తిట్టారని, హరీష్ రావు పరిస్థితి కుడితిలోపడ్డ ఎ లుకలా తయారయ్యిందని సిఎం ఎద్దేవా చేశా రు. మంత్రి శ్రీనివాస్ రెడ్డిపై బురద చల్లడానికే బిఆర్‌ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారని, భూ కుం భకోణంపై నిర్ధష్టమయిన ఆరోపణలు చేస్తున్నా ని, దీనిపై హౌస్  కమిటీకి సిద్ధమా అని హరీశ్‌రావుకు సిఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.

అంతకుముందు కామారెడ్డి ఎంఎల్‌ఏ కాటిపల్లి వెంకటరమణా రెడ్డి ప్రభుత్వానికి సూచనలు చేయడం పట్ల సిఎం ఆక్షేపించారు. బిజెపి నేతలకు సూచలు ఇవ్వడం, పారిపోవడం అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. కాళేశ్వరంలో కెసిఆర్ కుటుంబం దోపిడీకి పాల్పడిందని సాక్షాత్తు దేశ ప్రధాని, హోం శాఖ మంత్రి అమిత్ షా అన్న విషయాన్ని సిఎం గుర్తు చేశారు. కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగిస్తే 48 గంటల్లో కెసిఆర్, హరీష్ రావును జైల్లో పెడతామన్న కిషన్ రెడ్డి మాటలు నమ్మి కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగించామని, ఎనిమిది నెలలు గడిచినా ఎటువంటి పురోగతి లేదని విమర్శించారు. కాళేశ్వరంపై సిబిఐ విచారణను ఢిల్లీలో తొక్కిపెట్టి, పార్లమెంట్, మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు, సీట్లు పంచుకున్నారని సిఎం ఆరోపించారు. కాళేశ్వరం కేసులో కెసిఆర్, హరీష్‌రావు ను జైల్లో పెట్టిన తరువాత బిజెపి నేతలు సూచనలు చేస్తే బాగుంటుందని సిఎం స్పష్టం చేశారు. హరీష్ రావు నిజాయితీపరుడని కెటిఆర్, వెంకటరమణా రెడ్డి నమ్మితే హౌస్ కమిటీ వేయడానికి ఒప్పుకోవాలన్నారు.

సభా సాంప్రదాయాలు పట్టించుకోని బిఆర్‌ఎస్ : డిప్యూటీ సిఎం భట్టి

రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, ప్రజల అవసరాలు తీర్చేందుకు తగిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సభలో బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఏలు రాద్ధాంతం చేయడం సరైనది కాదని డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క అన్నారు. సభా సాంప్రదాయాలను గాలికి వదిలేసి బిఆర్‌ఎస్ నేతలు చేస్తున్న చేష్టలు రాష్ట్రం మొత్తం గమనిస్తుందని చెప్పారు. కాంగ్రెస్ ఎంఎల్‌ఏలుగా 2014 నుంచి 2023 వరకు ఈ సభలో ఉన్నామని, బడ్జెట్ సమావేశాల్లో ఎప్పుడూ బడ్జెట్ కాపీలను చింపి చెవిలో పెట్టుకుని వెళ్లడం కానీ, డిమాండ్లపై చర్చ జరిగినప్పుడు అల్లరి చేయడం కానీ జరగలేదని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రుల కోసం ప్రభుత్వం మానవీయ కోణంలో బిల్లు ప్రవేశపెట్టి చర్చకు పెడితే, ఆ చర్చ జరగనీయకుండా, సభా సంప్రదాయాలు, పార్లమెంటరీ భాష, సభ నిబంధనలు తెలిసిన బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఏలు చప్పట్లు కొట్టడం, నినాదాలు చేయడం సరైనది కాదన్నారు. ముందస్తు నోటీసు ఇవ్వకుండా సభలో మంత్రి పేరును వెల్లడించకూడదని తెలిపారు.

బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఏలు మంత్రిపై లేవనెత్తిన అంశాలపై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2014 నుంచి 2026 మార్చి 28 వరకు మైనింగ్ రంగంలో జరిగిన అవకతవకలు, అక్రమాలపై సిబి సిఐడితో విచారణ జరిపిస్తానని ప్రకటించినట్లు డిప్యూటి సిఎం గుర్తు చేశారు. ఈ నిర్ణయాన్ని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఏలు స్వాగతించకుండా, కావాలనే సభను నడవనీయకుండా రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. బిఆర్‌ఎస్ హయాంలో మూడు హౌస్ కమిటీలు ఏర్పాటు చేశారని, వాటి ద్వారా ఏమి సాధించారు? ఆ హౌస్ కమిటీలలో సభ్యుడిగా ఉండి సమావేశాలు నిర్వహించాలని కోరినప్పటికీ ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదని డిప్యూటి సిఎం వివరించారు. హౌస్ కమిటీలను అడ్డంగా పెట్టుకుని ఆరోపణలు ఎదుర్కొన్న ఎంఎల్‌ఏలను బ్లాక్‌మెయిల్ చేసి బిఆర్‌ఎస్‌లోకి చేర్చుకోవడం తప్ప ఒక్క కమిటీ నివేదికను కూడా బయట పెట్టలేదని ఆయన తెలిపారు. బడ్జెట్ సమావేశాలు సజావుగా జరగకుండా కుట్రపూరిత కార్యక్రమాలకు తెరలేపి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం బిఆర్‌ఎస్‌కు తగదని హితవు పలికారు. బిజెపి శాసనసభ్యులు ఈ విషయంలో సలహాలు, సూచనలు ఇస్తామని అంటున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణ జరపాలని కోరుతూ ఎనిమిది నెలలు అవుతున్నప్పటికీ వారు ఏమి చేస్తున్నారని

, బిజపి, బిఆర్‌ఎస్ ఎప్పుడో కలిసిపోయాయని ఆరోపించారు. సభ సజావుగా నడవకూడదు, ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన వెల్ఫేర్ పథకాలపై చర్చ జరగకూడదు, విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన బ్రేక్‌ఫాస్ట్ పథకంపై చర్చ జరగకూడదు, బిఆర్‌ఎస్‌కు తప్ప ఎవరికి మేలు జరగకూడదనే ఆలోచనతోనే బిఆర్‌ఎస్ సభ్యులు సభకు వచ్చినట్టుగా కనిపిస్తోందని భట్టి ధ్వజమెత్తారు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పేదలకు పంచిన భూములను గత ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకువచ్చి పార్ట్- బిలో పెట్టి తమకు అనుకూలమైన వ్యక్తుల పేరిట పట్టాలు ఇచ్చిందనే విషయం వాస్తవం కాదా? అని నిలదీశారు. ధరణి ద్వారా జరిగిన భూ అక్రమాలు, బాలానగర్‌లో అక్రమ పద్ధతిలో జరిగిన భూ బదిలీలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హౌస్ కమిటీ వేయాలని చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నట్లు చెప్పారు

. బిఆర్‌ఎస్ శాసనసభ్యులకు హౌస్ కమిటీపై పూర్తి విశ్వాసం ఉంటే సిఎం ప్రకటించిన హౌస్ కమిటీ కి అంగీకరించాలని సవాల్ చేశారు.

నా కుటుంబ సభ్యుల భూములు కెటిఆర్ లాక్కున్నారు: దానం

కెటిఆర్ నా కుటుంభ సభ్యుల భూములు లాక్కున్నారని ఎంఎల్‌ఏ దానం నాగేందర్ ఆరోపించారు. శాసన సభలో మాట్లాడిన దానం నాగేందర్ బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఏ కెటిఆర్‌పై సంచలన ఆరోపణలు చేశారు. బిఆర్‌ఎస్ హాయంలో వేల ఎకరాల భూ కుంభకోణం జరిగిందని దానం ఆరోపించారు. మా సొంత భూమిని సైతం కెటిఆర్ వదల్లేదని ఆయన చేసిన పనికి మా బాధ ఎవరికి చెప్పుకోలేక ఆ రోజు నోరు మూసుకు కూర్చున్నామని తీవ్ర ఆరోపణలు చేశారు. నా తండ్రి కష్టార్జితమయిన మా సొంత భూమిని కెటిఆర్ ఓ ప్రయివేట్ కంపెనికీ అప్పగించారని, హైదరాబాద్‌లో పుట్టి పెరిగి మౌనంగా ఉండిపోవాల్సిన దయనీయమైన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ విషయంలో తన వద్ద ఆధారాలు ఉన్నాయని కావాలంటే రికార్డులు చూపిస్తానన్నారు. ఎంత నష్టపోయామో మా కుటుంబానికి తెలుసని, బాధలు ఎవరికి చెప్పుకోలేకపోయామని వాపోయారు. దొంగతనం చేసిన వారు దొంగ అంటూ అరుస్తున్నారని, తప్పు చేయకపోతే నిజాయతీయిగా హౌస్ కమిటీకి ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు.

గత ప్రభుత్వంలో భూ కబ్జాలు, దోపిడి జరిగింది: కడియం

కడియంపై కౌశిక్ రెడ్డి అసభ్యకర సంజ్ఞలు

మండిపడ్డ సభ్యులు

గత ప్రభుత్వంలో ధరణిని అడ్డం పెట్టుకుని భూ కబ్జాలు, దోపిడిలు జరిగాయని, వాటిపై విచారణ చేయించాలని కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. దొంగతనం చేసిన వ్యక్తులు సిగ్గులేకుండా అరుస్తున్నారని, నిజాయితీ ఉంటే హౌస్ కమిటీకి ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. బిఆర్‌ఎస్ సభ్యులు ప్రవర్తిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని, ఇవి సభా సాంప్రదానికి విరుద్దమని అన్నారు. ఈ దశలో కడియం శ్రీహరిని ఉద్దేశించి ఎంఎల్‌ఏ పాడి కౌషిక్ రెడ్డి చేసిన సంజ్ఞలు తీవ్ర దుమారం రేపాయి. కడియం మాట్లాడుతున్న సమయంలో బిఆర్‌ఎస్ నేతలు చోర్ చోర్ అంటూ నినదించారు. కౌశిక్ రెడ్డితో పాటు పలువురు సభ్యులు ఏ పార్టీ ఎంఎల్‌వి, ఏ పార్టీ నుంచి గెలిచావో చెప్పాలంటే నినాదాలు చేశారు. ఈ దశలో కౌశిక్ రెడ్డి ఆవేశంతో బెదిరించారని, గన్ తో కాల్చిపడేస్తాననే, ఇతర చెప్పడానికి వీలు లేని సైగలు చేశారని కాంగ్రెస్ సభ్యులు కౌశిక్ రెడ్డిపై మండిపడ్డారు. వీడియోలు పరిశీలించి ఆయన సభత్వాన్ని శాశ్వతంగా తొలగించాలని స్పీకర్‌ను కోరారు.