Reading Time: 2 minutes

మన తెలంగాణ/హైదరాబాద్: ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు నిధులు ఇవ్వ డం లేదని, మంత్రుల నియోజకవర్గాలకు మాత్రమే బిల్లులు వస్తున్నాయని ము నుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం అంటే మంత్రులు మాత్రమే కాదని, ఎమ్మెల్యేలు కూడా భాగమని ఆయన తెలిపారు. తాము నిధుల కోసం మంత్రుల చుట్టూ తిరగాలా? అని ఆయన ఆందోళన వ్య క్తం చేశారు. ఆదివారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో ము గ్గురు మంత్రులు ఉన్నారని, ప్రభుత్వం ఏం చేసినా, నిధులైనా ఖమ్మం జిల్లాకే వెళుతున్నాయని బయట టాక్ నడుస్తోందని అన్నారు. మంత్రులు, సిఎం నియోజకవర్గాల్లోనే పనులు జరుగుతున్నాయని కాంట్రాక్టర్‌లకు డబ్బులు అందుతున్నాయని ఆయన అన్నారు. ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు నిధులు అందడం లేదని ఆయన పేర్కొన్నారు.

రిజర్వాయర్ల కోసం ఎంతోమంది రైతులు భూములిచ్చారని రిజర్వాయర్లు కడితే సరిపోదని కాల్వలు తవ్వించాలని ఆయన డి మాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  కొడంగల్ నియోజక వర్గాన్ని అభివృద్ధి చేసుకుంటున్నట్లు తాము కూడా మా నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకోకూడదా? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మునుగోడును అభివృద్ధి చేసుకుందాం అనుకుంటే ఎవరూ సహకరించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మా ప్రభుత్వం ఉన్నా నా నియోజకవర్గానికి అన్యాయం జరుగుతోందని రాజ్ గోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గానికి న్యాయం జరగనప్పుడు పదవిలోఉండి కూడా వేస్ట్ అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. మునుగోడులో ఉన్న ఫ్లోరైడ్ ప్రపంచంలో ఎక్కడా లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

లిఫ్ట్‌లన్నీ హుజూర్‌నగర్‌కే..

మరోవైపు లిఫ్ట్‌లన్నీ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్‌నగర్‌కు తరలిస్తున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోంది. నిర్ణయాలు, క్రమశిక్షణలో కరెక్ట్‌గా ఉందని ఆయన అన్నారు. అలాగే, నియోజకవర్గాలకు కూడా నిధులు ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వ పెద్దలకు రాజగోపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా మునుగోడు, నకిరేకల్ నియోజకవర్గాల అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు.

కమీషన్ల కోసమే కాళేశ్వరం కట్టారు

కమీషన్ల కోసమే కాళేశ్వరం కట్టారని ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరంతో రాష్ట్రం అప్పుల పాలైందన్నారు. లక్షల కోట్లు ఖర్చు చేస్తే మనకు చుక్క నీరు రాలేదన్నారు. గత ప్రభుత్వం పదేండ్లు ప్రజాధనం వృధా చేసిందన్నారు. కెసిఆర్ ఓ నియంతలా పాలించారని, నార్త్ తెలంగాణ, సౌత్ తెలంగాణ పేరుతో వివక్ష చూపారని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాక ముందు కాంగ్రెస్ పార్టీ ఎంతో ఆలోచన చేసి ఎన్నో ప్రాజెక్టులను రూపకల్పన చేసిందని ఆయన అన్నారు. తుమ్మిడి హట్టి దగ్గర కట్టాల్సిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కేవలం కాంట్రాక్టర్ల కోసం ఇంజనీర్లు చెప్పిన వినకుండా కెసిఆర్ ఇంజనీర్‌గా మారి మేడిగడ్డకు బ్యారేజీను మార్చారన్నారు. ఇది కూలిపోయే స్థితికి వచ్చిందన్నారు.

కాలువలు పూర్తి చేసి పొలాలకు నీరు అందించాలి

వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రూ.714 కోట్లతో లక్ష ఎకరాల నీటిని అందించే విధంగా బ్రాహ్మణ వెల్లెంలా ప్రాజెక్టును మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీసుకొచ్చారని ఆయన తెలిపారు. 2004 నుంచి 2014ల మధ్య 90 శాతం ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయన్నారు. 2014 నుంచి బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్న కాలంలో ఒక పని కూడా చేయలేద న్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మిగతా పనులు పూర్తి చేసి బ్రాహ్మణ వెల్లెంలా రిజర్వాయర్‌లోకి నీటిని నింపామని ఆయన తెలిపారు. అయితే, కాలువలు పూర్తికాకపోవడంతో పొలాలకు నీరు రావడం లేదని, తొందరగా కాలువలు పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రైవేట్ పాఠశాలల్లోని ఎక్కువ మంది విద్యార్థులు

గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో విద్య, వైద్యాన్ని గాలికి వదిలేసిందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. ఈ ప్రభుత్వంలో విద్యావ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతోందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో సరిపడా మౌలిక సదుపాయాలు లేవని, ఒక విద్యార్థి ఉన్నచోట ఎక్కువ మంది టీచర్లు ఉన్నారని, 100 విద్యార్థులు ఉన్నచోట ఒక టీచరే ఉన్నారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేట్ పాఠశాలల్లోని ఎక్కువ మంది విద్యా ర్థులు చదువుతున్నారని, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 40 శాతం మెస్ చార్జీలు పెంచినప్పటికీ ఆహారంలో నాణ్యత లేదని ఆయన తెలిపారు. క్షేత్రస్థాయిలో మానిటరింగ్ చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.