
దేశంలో ప్రస్తుతం ఫుడ్ సెక్యూరిటీ ఉంది కానీ న్యూట్రిషన్ ఫుడ్ అందడం లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. అందుకే బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుంచే తల్లికి పౌష్టిక ఆహారాన్ని తమ ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు. దీనిలో భాగంగానే ఇప్పుడు బ్రేక్ ఫాస్ట్ స్కీంను కూడా ప్రారంభించామని చెప్పారు. అసెంబ్లీ ప్రాంగణంలో అంగన్వాడీ చిన్నారులకు బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ ‘తొలి ముద్ద’ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు సీతక్క, కొండా సురేఖ, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీం, చైల్ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ సీతా దయాకర్ రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. అంగన్వాడీ చిన్నారులకు ఇక నుంచి రెడీ టూ కుక్ ఫుడ్ (ఉప్మా, కిచిడీ మిక్స్)ను బ్రేక్ ఫాస్ట్ గా అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్‌కు మొబైల్ ఫోన్‌లను కూడా పంపిణీ చేశారు. బ్రేక్ ఫాస్ట్ స్కీం ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఎంత మంచి ప్రణాళికలు
చేసినా అమలు చేయాల్సింది అంగన్వాడీ టీచర్లు మాత్రమేనని అన్నారు. అందుకే ప్రభుత్వం మీపై గురుతర బాధ్యత పెట్టిందని పేర్కొన్నారు. అంగన్వాడీ చిన్నారులను సొంత బిడ్డల్లా చూసుకుని వారికి పౌష్టికాహారం అందించాలని సూచించారు. అంగన్వాడీ సిబ్బందిని ప్రభుత్వం కుటుంబ సభ్యుల్లా భావిస్తోందని, మీ సమస్యలపై ఎప్పటికప్పుడు చర్చిస్తున్నామని తెలిపారు. ఏ మాత్రం ఆర్ధిక వెసులుబాటు కలిగినా ముందుగా మీ సమస్యలనే పరిష్కరిస్తామని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో ఉండటానికి వీళ్లేదని, సొంత భవనాలు నిర్మించేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఆరేళ్ల లోపు పిల్లలకు పౌష్టికాహారం అందితేనే వారిలో మానసిక ఎదుగుదల ఉంటుందని అన్నారు.పోష్టికాహారం లేకపోవడం వల్లే ఎక్కువ సమస్యలు వస్తున్నాయని, భవిష్యత్‌లో అవే అనారోగ్య సమస్యలకు దారితీస్తున్నాయని తెలిపారు. అటువంటి పరిస్థితులు రాకుండా ఉండేందుకే ప్రభుత్వం ఇలాంటి పథకాలను ప్రవేశపెట్టిందని తెలిపారు.