Reading Time: 2 minutes
PSL 2026 : అడ్డంగా దొరికిపోయిన పాకిస్థాన్ స్టార్ ప్లేయర్లు.. ఐసీసీ రంగంలోకి దిగితే కెరీర్ క్లోజ్ అవ్వాల్సిందే

PSL 2026 : ప్రస్తుతం ఒకవైపు భారత్‌లో ఐపీఎల్ 2026 హంగామా నడుస్తుంటే, మరోవైపు పొరుగు దేశం పాకిస్థాన్‌లో పీఎస్ఎల్ (PSL) సాగుతోంది. అయితే అక్కడ క్రికెట్ కంటే వివాదాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. తాజాగా లాహోర్ ఖలందర్స్, కరాచీ కింగ్స్ మధ్య జరిగిన ఆరో మ్యాచ్‌లో ఒక షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. గెలుపు అంచున ఉన్న లాహోర్ జట్టు, తమ ఆటగాళ్ల అతి తెలివి వల్ల చేజేతులా మ్యాచ్‌ను చేజార్చుకుంది. బాల్ టాంపరింగ్‌కు పాల్పడటంతో అంపైర్లు ఆ జట్టుపై పెనాల్టీ విధించడమే కాకుండా, ప్రత్యర్థి జట్టుకు పరుగులు కూడా కలిపారు.

అసలేం జరిగింది?

కరాచీ కింగ్స్ విజయానికి కేవలం 129 పరుగుల స్వల్ప లక్ష్యం మాత్రమే ఉంది. అయితే లాహోర్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి కరాచీని ఇబ్బంది పెట్టారు. మ్యాచ్ చివరి ఓవర్ వరకు వెళ్ళింది. కరాచీ గెలవాలంటే చివరి 6 బంతుల్లో 14 పరుగులు చేయాలి. ఈ ఉత్కంఠ భరిత సమయంలో లాహోర్ కెప్టెన్ షాహీన్ అఫ్రిది, హరీస్ రౌఫ్ మరియు ఫఖర్ జమాన్ కలిసి బంతి గురించి ఏదో చర్చించుకున్నారు. ఆ సమయంలో ఫఖర్ జమాన్ తన గోళ్లతో బంతిని గీకుతూ, దాని ఆకారాన్ని మార్చే ప్రయత్నం చేశాడు. ఇదంతా గమనించిన అంపైర్లు వెంటనే మ్యాచ్ ఆపి బంతిని పరిశీలించారు.

అంపైర్ల సీరియస్ నిర్ణయం

బంతి స్థితిని మార్చినట్లు నిర్ధారించుకున్న అంపైర్లు, లాహోర్ ఖలందర్స్ జట్టుపై 5 పరుగుల పెనాల్టీ విధించారు. అంటే కరాచీ విజయానికి కావాల్సిన 14 పరుగులు కాస్తా, కేవలం 9 పరుగులకు తగ్గిపోయాయి. అంతేకాకుండా పాడైపోయిన బంతిని మార్చి కొత్త బంతిని ఇచ్చారు. దీనివల్ల లాహోర్ బౌలర్ హరీస్ రౌఫ్‌కు రివర్స్ స్వింగ్ చేసే అవకాశం చేజారిపోయింది. ఈ అనూహ్య నిర్ణయంతో షాహీన్ అఫ్రిది అంపైర్లతో వాగ్వాదానికి దిగినప్పటికీ ఫలితం లేకపోయింది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.

చేజారిన విజయం.. కెప్టెన్ షాక్

పెనాల్టీ పడటంతో కరాచీ పని సులువైపోయింది. రౌఫ్ వేసిన చివరి ఓవర్ మొదటి బంతికే వికెట్ పడినప్పటికీ, క్రీజులోకి వచ్చిన కొత్త బ్యాటర్ వరుసగా ఫోర్, సిక్సర్ బాది కరాచీకి అద్భుత విజయాన్ని అందించాడు. మ్యాచ్ అనంతరం షాహీన్ అఫ్రిది మాట్లాడుతూ.. తనకు బాల్ టాంపరింగ్ గురించి ఏమీ తెలియదని, డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్ళాక తన టీమ్ మేట్స్‌తో మాట్లాడతానని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. గతంలో కూడా పాకిస్థాన్ క్రికెటర్లు ఇలాంటి వివాదాల్లో ఇరుక్కున్న దాఖలాలు ఉండటంతో, తాజా ఘటనపై క్రికెట్ ప్రపంచంలో చర్చ మొదలైంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..