Reading Time: 2 minutes
Premikula Roju: ‘ప్రేమికుల రోజు’ హీరో కునాల్ గుర్తున్నాడా? పాపం 31 ఏళ్ల వయసులోనే ఎలా చనిపోయాడో తెలుసా?

సినిమాల్లో నటించాలని, మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఎంతో మంది కలలు కంటారు. కానీ కొద్ది మందికి మాత్రమే ఆ కల నెరవేరుతుంది. సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వడం ఎంత ముఖ్యమో.. దానిని నిలబెట్టుకోవడం కూడా అంతే ముఖ్యం. లేకపోతే ఎంత ఎత్తుకు ఎదిగినా కిందికి పడిపోవడం ఖాయం. అలా ఉవ్వెత్తున ఎగిసి తమ అనాలోచిత నిర్ణయాలతో అథఃపాతాళానికి పడిపోయిన హీరోలు చాలా మందే ఉన్నారు. అందులో ప్రేమికుల రోజు సినిమా హీరో కునాల్ సింగ్ ఒకడు. 1999లో వచ్చిన ఈ ప్రేమ కథా చిత్రం ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా యూత్ అయితే ఈ సినిమాను ఎగబడి చూశారు. ఇందులోని పాటలు అయితే ఎవర్ గ్రీన్. ఇప్పుడు కూడా ఎక్కడో ఒక చోట ఈ సినిమా పాటలు వినిపిస్తూనే ఉంటాయి. కదీర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కునాల్ సింగ్ కు జోడీగా సోనాలి బింద్రే నటించింది. ఈ సినిమా తర్వాత హీరో, హీరోయిన్ల పేరు మార్మోగిపోయాయి. సోనాలి బింద్రే స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. కానీ హీరో కునాల్ కెరీర్ మాత్రం ముందుకు కదల్లేదు. ప్రేమికుల రోజు తర్వాత కునాల్ ఎంచుకున్న సినిమాలు సరిగ్గా ఆడలేదు. దీంతో ఏం చేయాలో తెలియక అసిస్టెంట్ ఎడిటర్ గా మారిపోయాడు.

కునాల్ కి భార్య అనురాధ సింగ్ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కాగా కొన్ని సినిమాలకు ప్రొడ్యూసర్ గా కూడా చేశాడు కునాల్ సింగ్. కానీ అన్నీ ప్రయత్నాలు బెడిసికొట్టాయి. దీనికి తోడు బాగా అప్పుల్లో కూరుకుపోయాడీ హీరో. దీంతో ఏం చేయాలో తెలియక రెండు మూడు సార్లు సూసైడ్ చేసుకోవడానికి తన మణికట్టు నరాలు కోసుకోవడానికి ప్రయత్నించాడు. ఇదే క్రమంలో కునాల్ కు సహ నటి లావీణ భాటియాతో వివాహేతర సంబంధం ఉందని ఆరోపణలు వచ్చాయి. ఈ కారణంగానే కునాల్ కు, అతని భార్య మధ్య తరచూ గొడవలు జరిగేవట. చివరకు భార్య కోపంతో ఇల్లు వదిలి వెళ్లిపోయిందట.

సినిమా కెరీర్‌ దెబ్బతినడం, కుటుంబం చెదిరిపోవడం, అప్పులు పెరిగిపోవడంతో కునాల్ మానసికంగా బాగా కుంగిపోయాడట. చివరకు అతను 2008 ఫిబ్రవరి 7న తన ముంబై అపార్ట్‌మెంట్‌లో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా ఈ సంఘటన సమయంలో నటి పంకజ్ తో పాటు చాలా మంది ఇంట్లోనే ఉన్నారట. దీంతో కునాల్ ఆత్మహత్య వెనుక పంకజ్‌ ఉందని, ఆమెతో వాగ్వాదం జరిగిందని ప్రచారం జరిగింది. కానీ పోలీసులు కునాల్ ది ఆత్మహత్యగానే ప్రకటించారు. కాగా చనిపోయే నాటికి కునాల్ కు కేవలం 31 ఏళ్లు మాత్రమే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.