
మన తెలంగాణ / సంగారెడ్డి : ఆ తల్లికి భర్త లేని జీవితం భారంగా కనిపించింది. కన్నపిల్లలకు విషమిచ్చి తాను కూడా తనువు చాలించింది. కంది మండలంలో జరిగిన ఈ హృద య విదారక ఘటన వివరాలిలా ఉన్నాయి. జుల్‌కల్ గ్రామానికి చెందిన మమత (28) శనివారం నాడు తన ఇద్దరు పిల్లలు మణికంఠ (5), ప్రళయ (4)కు విషమిచ్చింది. వారు చని పోయారని నిర్ధారించుకున్న తర్వాత తాను ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గత జనవరి లో మమత భర్త పెంటయ్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో తల్లిదండ్రులు, అత్తమామల సహకారంతో ఆమె పిల్లలను పెంచుతున్నారు.
ఈ క్రమంలో ఆమె తీవ్ర మనోవేదనకు గురయింది. జీవితం భారంగా అనిపించింది. దీంతో అల్లారుముద్దుగా పెంచుకున్న చిన్నారులను చంపి, తాను కూడా చనిపోయింది. ఒక్క సారిగా జుల్‌కల్ గ్రామంలో విషాదం అలముకున్నది. గ్రామస్థులు కన్నీరుమున్నీరు అయ్యారు. ముక్కు పచ్చలారని ఇద్దరు చిన్నారులు, తల్లి బలవన్మరణం ప్రతి ఒక్కరినీ కన్నీరు పెట్టించింది. విషయం తెలియగానే జిల్లా ఎస్‌పి పరితోష్ పంకజ్, డిఎస్‌పి సత్తయ్య,ఇతర పోలీస్ అధికారులు సంఘటనా స్థలానికి వెళ్లారు. దుర్ఘటనపై ఆరా తీశారు. మృతురాలి బంధువులతో మాట్లాడారు. దర్యాప్తు చేస్తున్నారు.