Reading Time: 2 minutes

2025లో మహిళల ఆదాయం పైపైకి: పురుషుల కంటే వేగంగా పెరిగిన జీతాలు !

Caption of Image.

గడిచిన ఏడాది కాలంలో భారతీయ ఉద్యోగ రంగంలో ఆసక్తికరమైన మార్పులు వచ్చాయి. పురుషులతో పోలిస్తే మహిళల జీతాలు వేగంగా పెరిగాయని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. 2024తో పోలిస్తే 2025లో మూడు రకాల పనుల్లోనూ మహిళల ఆదాయం మెరుగ్గా పెరిగింది. 

జీతం వచ్చే ఉద్యోగాలు చేసే మహిళల జీతాలు 7.2% పెరగగా, పురుషులవి 5.8% మాత్రమే పెరిగాయి. సొంత వ్యాపారాలు చేసే మహిళల ఆదాయం 8.8%, పురుషులది 8% పెరిగింది. కూలీ పనులు చేసే మహిళల కూలీ 5.4% పెరిగింది, కానీ పురుషుల కూలీ మాత్రం 0.2% తగ్గడం గమనార్హం.

ఆదాయం పెరిగినప్పటికీ, పురుషులతో పోలిస్తే మహిళల సంపాదన ఇంకా తక్కువగానే ఉంది: సాధారణంగా పురుషులు రూ. 100 సంపాదిస్తే, మహిళలు కేవలం రూ. 76 మాత్రమే సంపాదిస్తున్నారు. .

ఇక సొంత వ్యాపారం చేసే వారి పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. పురుషుల సంపాదనలో మహిళలు కేవలం 36% మాత్రమే సంపాదిస్తున్నారు. కూలీ రంగంలో  కూడా కొంత మార్పు కనిపిస్తోంది. గతంలో పురుషుల ఆదాయంలో 66% పొందిన మహిళలు, ఇప్పుడు 69% పొందుతున్నారు.

మంచి జీతం, ఉద్యోగ భద్రత ఉండే ‘రెగ్యులర్’ ఉద్యోగాల్లో మహిళల సంఖ్య పెరిగింది. 2024లో 16.6% మంది మహిళలు ఇలాంటి ఉద్యోగాల్లో ఉండగా, 2025 నాటికి 18.2%కి చేరింది. దేశవ్యాప్తంగా చూస్తే, ఉద్యోగ నాణ్యత స్వల్పంగా మెరుగుపడింది.

 ఇక నిరుద్యోగ రేటు చూస్తే  గ్రామాల్లో నిరుద్యోగం 2.5% నుండి 2.4%కి తగ్గింది. పట్టణాల్లో 5% నుండి 4.8%కి పడిపోయింది. 15-29 ఏళ్ల యువతలో నిరుద్యోగం 9.9%కి తగ్గింది. అయితే, యువతుల్లో నిరుద్యోగం (11.3%) స్వల్పంగా పెరగడం కొంత ఆందోళన కలిగించే విషయం.

2025 లెక్కల ప్రకారం, భారతదేశంలో మొత్తం 61.6 కోట్ల మంది ఉపాధి పొందుతున్నారు. వీరిలో 41.6 కోట్ల మంది పురుషులు, 20 కోట్ల మంది మహిళలు ఉన్నారు.

 ప్రధాన గణాంకాల పరంగా చూస్తే, వార్షిక PLFS డేటా ప్రకారం భారతదేశ గ్రామీణ నిరుద్యోగ రేటు 2024లో 2.5% నుండి 2025 నాటికి 2.4%కి తగ్గింది,   పట్టణ నిరుద్యోగం 5% నుండి 4.8%కి పడిపోయింది. అయితే, గ్రామీణ కార్మిక శక్తి భాగస్వామ్య రేటు (LFPR)  అంటే పని కోసం వెతుకుతున్న జనాభా శాతం   2025లో స్వల్పంగా తగ్గి 62.8%కి చేరింది.

©️ VIL Media Pvt Ltd.