
మన తెలంగాణ/హైదరాబాద్: గత బీర్‌ఎస్ ప్రభుత్వ హయాం నుంచి ఇప్పటి తమ ప్రభుత్వం వరకు జరిగిన మైనింగ్‌పై సిబిసిఐడి విచారణ కు ఆదేశిస్తోన్నట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. సిబిసిఐడి ఇచ్చే నివేదికను వచ్చే శాసనసభ సమావేశాల్లో చర్చకు కూడా పెట్టనున్నట్టు సీఎం స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి ఎక్కడ గండి పడినా, ఖనిజ సంపద దోపిడీకి గురైనా తాము చూస్తూ ఊరుకోబోమని, అక్రమాలకు పాల్పడే వారు ఎంతటి వారైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. రాష్ట్ర ఖజానాకు గం డి కొడుతూ సాగే అక్రమ మైనింగ్‌ల పట్ల తమ ప్రభుత్వం కఠిన వైఖరి అవలంభిస్తోందని సీఎం స్పష్టం చేశారు. శాసనసభలో శనివారం పద్దులపై జరిగిన చర్చ సందర్భంగా ప్రక్షాళన ఇప్పుడు చేసుకోకపోతే భవిష్యత్‌లో తీవ్ర ఇబ్బందులు తప్పవని ఆయన తెలిపారు. నదులు కాలుష్యం కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇక మత సామరస్యానికి మూసీ వేదిక కానుందని, ఉప్పల్-, నాగోల్ ప్రాంతంలో అద్భుతమైన చర్చి, పురానాపూల్‌లో మసీదు నిర్మిస్తామని ఆయన వెల్లడించారు.
అద్భుతమైన పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా మూసీని తీర్చిదిద్దుతామని, గోదావరి జలాలను మూసీకి తరలించి నిత్యం జల ప్రవాహం ఉండేలా చేస్తామని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. శనివారం రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండల పరిధిలోని మంచిరేవులలో ఓంకారేశ్వర ఆలయానికి సిఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అంతకుముందు పక్కనే ఉన్న వీరభద్ర ఆలయంలో కుటుంబంతో సహా ఆయన పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సిఎంతో పాటు డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, వేం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, ఇప్పటికే ఆలయ నిర్మాణానికి మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ డిజైన్ ఖరారు చేసింది. చారిత్రక వీరభద్ర స్వామి ఆలయ సమీపంలో 8 ఎకరాల్లో రూ.700 కోట్ల వ్యయంతో ఓంకారేశ్వర ఆలయాన్ని నిర్మించబోతున్నారు. అందులో వంద అడుగుల గాలిగోపురం, మూసీ నది మధ్యలో దీవిపై వంద అడుగుల శివుడి విగ్రహం ప్రతిష్టించనున్నారు.
మూసీలోకి గోదావరి జలాలను తరలించి
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ఢిల్లీ లాంటి నగరాల్లో కాలుష్యంతో జన జీవనం స్తంభించిన పరిస్థితి ఏర్పడిందని, లాంటి నగరాల నుంచి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉందని సిఎం రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. మూసీలోకి గోదావరి జలాలను తరలించి అవి నిరంతరం నీరు పారేలా చర్యలు తీసుకుంటున్నామని, మూసీ కాలుష్యంతో నల్లగొండ జిల్లా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
హైదరాబాద్ కాలుష్యమంతా మూసీలోనే
మంచిరేవుల వద్ద ఓంకారేశ్వర ఆలయ నిర్మాణం భగవత్ కార్యంగా భావిస్తున్నానని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారని, ఇది దైవేచ్ఛతో జరుగుతున్న కార్యక్రమమని, ముచుకుంద నదికి గొప్ప చరిత్ర ఉందని ఆయన తెలిపారు. 8 ఎకరాల్లో 700 కోట్లతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని, ఈ ప్రాంతానికి 1400 ఏళ్ల చరిత్ర ఉందని, ఈ చరిత్ర కనుమరుగు కాకుండా భవిష్యత్ తరాలకు అందించాలన్నదే తమ ప్రభుత్వ ఆలోచన అని ఆయన అన్నారు. మూసీనది పునరుజ్జీవిం గురించి చాలా మంది ప్రయత్నించారని, కారణాలు ఏవైనా ఆ ప్రయత్నాలు ముందుకు సాగలేదని, ఆ అవకాశం మనకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని ఆయన తెలిపారు. విమర్శలు వచ్చినా, అడ్డంకులు సృష్టించినా దేవుడే వాటిని తొలగిస్తారని, తెలంగాణ పౌరులకు తన విజ్ఞప్తి ఒక్కటేనని, చరిత్రను గమనిస్తే నది పరీవాహకంలోనే నాగరికత అభివృద్ధి చెందిందని, సముద్ర పరీవాహకంలో వ్యాపారం, ఆర్ధిక అభివృద్ధి జరిగిందని సిఎం అన్నారు.
దేశంలో సముద్రపు ఒడ్డు లేని రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని, మూసా, ఈసా నదులు ఉన్నా సరైన విధంగా ఉపయోగించుకోలేదని, మానవ తప్పిదాలతోనే మూసీ కాలుష్య కారకంగా మారింది గొప్ప చరిత్ర కలిగిన హైదరాబాద్ చరిత్ర కనుమరుగయ్యే పరిస్థితి దాపురించిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. గతంలో గోదావరి, కృష్ణా జలాలను సద్వినియోగం చేసుకోలేకపోయామని, ఇప్పుడు ఆ జలాలను ఉపయోగించుకుంటున్నామని సిఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మత సామరస్యానికి మూసీ వేదిక ప్రతీకగా నిలుస్తుందని ఆయన అన్నారు. హైదరాబాద్ కాలుష్యమంతా మూసీలో కలుస్తోందని, దీనివల్ల ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు ఫ్లోరైడ్‌తో అల్లాడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడి ప్రజలు రోగాల బారిన పడుతున్నారని, అందుకే మూసీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టామని ఆయన అన్నారు. కానీ, కొందరు రాజకీయ కారణాలతో పనులను అడ్డుకునేందుకు కోర్టుల్లో కేసులు వేస్తున్నారని, గ్రీన్ ట్రిబ్యునల్‌కు వెళ్లి అడ్డుకోవాలని చూస్తున్నారని సిఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.
అభివృద్ధిని అడ్డుకునే వారికి ప్రజా ప్రతినిధిగా ఉండే అర్హత ఉందా..?
ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకునే వారికి ప్రజా ప్రతినిధిగా ఉండే అర్హత ఉందా అని సిఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో వేసిన కేసును వెనక్కి తీసుకోవాలని లేకపోతే ప్రజలే మిమ్మల్ని సామాజిక బహిష్కరణ చేస్తారని ఆయన అన్నారు. మీ వెనుక ముసుగు తొడుక్కున్న వారికి కూడా చెబుతున్నానని, ఇలాగే వ్యవహారిస్తే ఇప్పుడున్న స్థానం కూడా వారికి ఉండదన్నారు. ఆరు నూరైనా అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిచినా ఈ ప్రాజెక్టు ఆగదని, ఇది శివదీక్ష అని, రామప్ప శివుడి సాక్షిగా మూసీ ప్రక్షాళన చేసి ఈ ప్రాంతాన్ని దక్షిణ కాశీగా తీర్చిదిద్దుతామన్నారు. ఇది ఓట్ల కోసం, నోట్ల కోసం చేస్తున్న పని కాదని, ఇది చరిత్రలో దేవుడి ఇచ్చిన గొప్ప అవకాశం అని, ప్రజల పట్ల తమ కున్న చిత్తశుద్ధిని నిరూపిస్తుందని, ప్రజలే తమకు దేవుళ్లు అని, అంతిమంగా వారి ఆకాంక్షల మేరకే ముందుకు వెళతామని ఆయన తెలిపారు.
ఆధునిక గోశాల నిర్మాణానికి
ముఖ్యమంత్రి శంకుస్థాపన
ఆధునిక గోశాల నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం యెంకపల్లి గ్రామంలో ప్రతిపాదిత ఆధునిక గోశాల నిర్మాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం శంకుస్థాపన నిర్వహించారు. పశుసంరక్షణ, పశుసంక్షేమం, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఆధునిక గోశాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సంప్ర దాయ విలువలను ఆధునిక శాస్త్రీయ విధానాలతో సమన్వయం చేస్తూ పశువుల ఆరోగ్యం, పర్యావరణ స్థిరత్వం, ప్రజల్లో గోసేవపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు అమలు బాధ్యతను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండిఏ)కు అప్పగించారు. మొయినాబాద్ మండలం యెంకపల్లి గ్రామంలోని సర్వే నం.180లో ఉన్న సుమారు 99 ఎకరాలు 14 గుంటల ప్రభుత్వ భూమిని దీనికోసం కేటాయించారు.