Reading Time: 2 minutes
Vijaypat Singhania Raymond Former Chairman Death News

Vijaypat Singhania: భారత పారిశ్రామిక రంగంలో ఒక శకాన్ని లిఖించిన రేమండ్ గ్రూప్ మాజీ ఛైర్మన్ విజయపత్ సింఘానియా (87) కన్నుమూశారు. శనివారం సాయంత్రం ముంబైలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు, రేమండ్ ప్రస్తుత ఛైర్మన్ గౌతమ్ సింఘానియా సోషల్ మీడియా వేదికగా ధృవీకరించారు. రూ.12 వేల కోట్ల ఆస్తి నుంచి అద్దె ఇంటి వరకు ఓ సంపన్నుడి కన్నీటి కథ ఎలా సాగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: CM Nitish Kumar: సీఎం నితీష్ కుమార్ రేపు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా..

రేమండ్‌ను ప్రపంచస్థాయి బ్రాండ్‌గా నిలబెట్టిన విజయపత్ సింఘానియా జీవితంలోని 5 ముఖ్యమైన ఘట్టాలు ఇవే..

1. రేమండ్ సామ్రాజ్య నిర్మాత (1980 – 2015)
1938లో జన్మించిన విజయపత్ సింఘానియా, 1980లో రేమండ్ గ్రూప్ పగ్గాలను చేపట్టారు. ఆయన నాయకత్వంలో ఈ సంస్థ కేవలం వస్త్ర వ్యాపారానికే పరిమితం కాకుండా, సుగంధ ద్రవ్యాలు, ఇతర రంగాల్లోకి కంపెనీ విస్తరించింది. 90వ దశకంలోనే రేమండ్ బ్రాండ్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత ఆయనదే.

2. ఆకాశమే హద్దుగా రికార్డులు..
విజయపత్ కేవలం వ్యాపారవేత్త మాత్రమే కాదు, ఆయనో గొప్ప విమానయాన ప్రియుడు కూడా. శిక్షణ పొందిన పైలట్‌గా ఆయన అనేక రికార్డులు సృష్టించారు. 2005లో హాట్ ఎయిర్ బెలూన్‌లో ఏకంగా 21,000 మీటర్ల ఎత్తుకు ఎగిరి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ముంబై షెరీఫ్‌గా కూడా ఆయన బాధ్యతలు నిర్వహించారు.

3. పద్మభూషణ్ పురస్కారం
వ్యాపార, విమానయాన రంగాల్లో ఆయన చేసిన విశేష కృషికి గాను భారత ప్రభుత్వం 2006లో ఆయనను పద్మభూషణ్‌తో సత్కరించింది. 1994లో భారత వైమానిక దళం ఆయనకు ‘గౌరవ ఎయిర్ కమోడోర్’ బిరుదును ప్రదానం చేసింది.

4. రాజభవనం నుంచి అద్దె ఇంటికి..
విజయపత్ జీవితం ఎందరికో ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒకప్పుడు రూ.12,000 కోట్ల నికర ఆస్తితో, దేశంలోని అత్యంత ఖరీదైన ఇళ్లలో ఒకటిగా పేరొందిన ‘జేకే హౌస్’లో విలాసవంతమైన జీవితాన్ని గడిపారు. కానీ 2015 తర్వాత పరిస్థితులు మారిపోయి, దక్షిణ ముంబైలోని ఒక అద్దె ఇంట్లో నివసించవలసి రావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

5. కుమారుడితో ఆస్తి వివాదం.. జీవితంలో చేసిన పెద్ద తప్పు!
2015లో రేమండ్ గ్రూప్ బాధ్యతలను కుమారుడు గౌతమ్ సింఘానియాకు అప్పగించిన తర్వాత, తండ్రీకొడుకుల మధ్య తీవ్రమైన ఆస్తి వివాదాలు తలెత్తాయి. “నా ఆస్తి అంతా కొడుకుకు అప్పగించడమే నా జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు” అని విజయపత్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు. తనను కొడుకు రోడ్డుపైకి తెచ్చాడని ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం సృష్టించాయి.

READ ALSO: Pakistan: పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్‌కు గడ్డుకాలం.. ఏ క్షణమైనా మూతపడే ఛాన్స్! ఎందుకో తెలుసుకోండి..