Reading Time: < 1 minute
Manikonda Fire Accident Alakapoor Township Hyderabad News

హైదరాబాద్ నగరంలోని మణికొండ ప్రాంతంలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అల్కాపూర్ టౌన్‌షిప్‌లోని రోడ్ నెంబర్ 25లో ఉన్న ఒక అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంతో అపార్ట్‌మెంట్ వాసులు ప్రాణభయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. ఆదివారం మధ్యాహ్నం సమయంలో అపార్ట్‌మెంట్‌లోని ఒక ఫ్లాట్ నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగలు, మంటలు ఎగిసిపడ్డాయి. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆ చుట్టుపక్కల ఫ్లాట్ల వారు కూడా అప్రమత్తమై వెంటనే భవనాన్ని ఖాళీ చేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.

CM Revanth Reddy : తల్లిదండ్రులను పట్టించుకోని ప్రతి కుమారుడికి బుద్ధి చెప్పాలనే ఈ చట్టం

ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపు చేయడంతో, అగ్నికీలలు ఇతర ఫ్లాట్‌లకు వ్యాపించకుండా నివారించగలిగారు. సుమారు గంటన్నర పాటు శ్రమించి మంటలను పూర్తిస్థాయిలో ఆర్పేశారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, ప్రాణనష్టం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కేవలం ఆస్తి నష్టం మాత్రమే జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ అగ్నిప్రమాదం ఎలా సంభవించిందనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఇంట్లోని విద్యుత్ ఉపకరణాల్లో షార్ట్ సర్క్యూట్ జరగడం వల్లే మంటలు చెలరేగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. క్లూస్ టీమ్ , ఫైర్ అధికారులు నమూనాలను సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. అపార్ట్‌మెంట్ వాసులు , యజమానులు ప్రస్తుతం సురక్షితంగా ఉన్నట్లు పోలీసులు ధృవీకరించారు.

CM Chandrababu : టీడీపీ గెలుపే రాష్ట్రం గెలుపు.. 44వ ఆవిర్భావ వేడుకల్లో సీఎం చంద్రబాబు