Reading Time: 2 minutes
Virat Kohli Reveals Secret Behind Playing One Format Shines In Ipl 2026 Opener Rcb Vs Srh

Virat Kohli on Only Playing ODI Format: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఒకే ఫార్మాట్ ఆడుతున్న విషయం తెలిసిందే. టీ20 ప్రపంచ కప్ 2024 విజయం అనంతరం టీ20 ఫార్మాట్‌కు బై చెప్పిన కింగ్.. ఆపై కొద్ది నెలలకే టెస్టులకు సైతం వీడ్కోలు చెప్పాడు. భారత్ తరఫున ఇప్పుడు కేవలం వన్డే ఫార్మాట్ ఆడుతున్న విరాట్.. వన్డే ప్రపంచ కప్ 2027 వరకు కొనసాగనున్నాడు. తాను ఒకే ఫార్మాట్ ఎందుకు ఆడుతున్నానో అని తాజాగా కోహ్లీ తెలిపాడు. ఓకే ఫార్మాట్ ఆడటంతో తనకు మంచి విరామం లభిస్తుందని, తన ఆట కూడా బాగా మెరుగవుతుందని అసలు రహస్యాన్ని వెల్లడించాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌ అనంతరం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ కోహ్లీ మాట్లాడాడు.

ఐపీఎల్ 2026 సీజన్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుతంగా ఆరంభించింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన క్లాస్‌ను మరోసారి చాటుకున్నాడు. రెండు నెలల విరామం తర్వాత మైదానంలోకి దిగిన కోహ్లీ.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై జరిగిన ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్‌లో అజేయంగా 69 పరుగులు చేసి జట్టును సునయన విజయాన్ని అందించాడు. 38 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సులతో 181.58 స్ట్రైక్ రేట్‌తో చెలరేగిన కోహ్లీ.. తన ‘చేజ్ మాస్టర్’ ట్యాగ్‌ను మరోసారి నిరూపించుకున్నాడు. 202 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆర్‌సీబీ 4.2 ఓవర్లు మిగిలి ఉండగానే చేజ్ చేయడం విశేషం. మ్యాచ్ అనంతరం కోహ్లీ తన ఫామ్ రహస్యాన్ని వెల్లడించాడు. ‘చివరిసారి నేను టీ20 మ్యాచ్ గత ఏడాది ఫైనల్‌లో ఆడాను. అయితే ఇటీవల వన్డేల్లో నేను ఆడిన విధానం రిథమ్‌ను కొనసాగించడానికి సహాయపడింది. నేను సాధారణ షాట్లు ఆడాను. రిథమ్‌లో ఉన్నంతవరకు, ఫిట్‌నెస్‌పై కష్టపడినంతవరకు ఫలితం తప్పక వస్తుంది’ అని తెలిపాడు.

తన కెరీర్‌లో ఫిట్‌నెస్, మెంటల్ ఫ్రెష్‌నెస్ ఎంత ముఖ్యమో కూడా విరాట్ కోహ్లీ వివరించాడు. ‘గత 15 ఏళ్లలో నేను ఆడిన మ్యాచ్‌ల సంఖ్య చాలా ఎక్కువ. అందుకే బర్న్ అవుట్ అయ్యే (బాగా అలసిపోవడం) అవకాశం ఉంటుంది. బ్రేక్‌లు మానసికంగా చాలా ఉపయోగపడతాయి. ఇప్పుడు నేను ఒకే ఫార్మాట్ ఆడుతుండటంతో సరైన విశ్రాంతి దక్కుతుంది. అందుకే నేను చాలా తాజాగా, ఉత్సాహంగా ఉంటున్నా. మైదానంలోకి నేను 120 శాతం కష్టపడుతా. సన్నద్దత లేకుండా నేను బరిలోకి దిగను. ఫిట్‌గా, మెంటల్‌గా ఫ్రెష్‌గా ఉంటే జట్టుకు మంచి కాంట్రిబ్యూషన్ ఇవ్వగలుగుతాం’ అని చెప్పాడు.

Also Read: Virat Kohli-SRH: ఎస్‌ఆర్‌హెచ్‌ అంటేనే ఊగిపోతున్న విరాట్ కోహ్లీ.. చివరి 5 ఇన్నింగ్స్‌లలో పరుగుల వరదే!

‘దేవదత్ పడిక్కల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ముందు నుంచే పవర్‌ప్లేలో అగ్రెసివ్‌గా ఆడాలని అనుకున్నాను. కానీ పడిక్కల్ ఆడుతున్న తీరు చూసి.. అతనికి స్ట్రైక్ ఇస్తూ, మధ్య మధ్యలో బౌండరీలు కొట్టాలని నిర్ణయించుకున్నా. అతడు పూర్తిగా మ్యాచ్‌ను ప్రత్యర్థుల చేతుల్లో నుంచి లాగేశాడు. ఒక స్లో బంతిని మిడ్ ఆన్ మీదుగా సిక్స్ కొట్టాడు. అప్పుడు పడిక్కల్ దగ్గరికి వెళ్లి ‘ఇలానే ని ఆట కొనసాగించు, నువ్వు అద్భుతంగా ఆడుతున్నావు’ అన్నాను. 25-26 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్ ముగిస్తే నెట్ రన్ రేట్‌కు కూడా ఉపయోగపడుతుంది. అతని టైమింగ్, హెడ్ పొజిషన్, బ్యాలెన్స్ అద్భుతం. అతనికి కాన్ఫిడెన్స్ ఉంటే బ్యాట్‌తో ఎలా రాణిస్తాడో నాకు తెలుసు. పడిక్కల్ టాలెంట్‌కు ఇది ఒక గొప్ప ఉదాహరణ’ అని కోహ్లీ ప్రశంసలు కురిపించాడు. కోహ్లీ మళ్లీ తన పీక్ ఫామ్‌ను కొనసాగిస్తూ ఐపీఎల్ 2026ను ఘనంగా ప్రారంభించాడు. ఇక ఈ సీజన్‌లో కోహ్లీ ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.