
- బడ్జెట్లో రూ.400 కోట్లు ఎందుకు కోత పెట్టారు? :ఎమ్మెల్యే హరీశ్ రావు
- సర్కారు తీరుకు నిరసనగా అసెంబ్లీ నుంచి వాకౌట్
హైదరాబాద్, వెలుగు: పోలీస్‌శాఖ సీఎం వద్ద ఉన్నా నిర్లక్ష్యం వహిస్తున్నారని, పోలీసులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. ఈ మేరకు ఆయన శనివారం అసెంబ్లీలో మాట్లాడారు. ప్రజలకు భద్రత కల్పించేందుకు పోలీసులు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ పోలీసులను ఎంతో గౌరవించారని, ఈ శాఖలో 50 వేల పోస్టులు భర్తీ చేశారన్నారు. కొత్త కమిషనరేట్ల ఏర్పాటుతోపాటు పోలీసులకు ఆరోగ్య భద్రత పథకాన్ని తీసుకువచ్చారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 7 టీఏలు, 3 సరెండర్ లీవులు, 5 డీఏలు పెండింగ్ పెట్టిందన్నారు. పోలీసుల భద్రత పథకాన్ని రూ.లక్షకు పరిమితం చేశారని, కొత్తగూడెం జిల్లాలో 72 టీఏలు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు.
కొన్ని జిల్లాల్లో ఇచ్చి, కొన్ని జిల్లాల్లో పెండింగ్ పెట్టడం ఏంటని ప్రశ్నించారు. 1.30 లక్షల మంది పోలీసుల తరఫున మాట్లాడుతున్నానని, ఈ డిపార్ట్మెంట్కు బడ్జెట్లో గతేడాది కంటే రూ.400 కోట్లు ఎందుకు తగ్గించారని నిలదీశారు. పోలీసుల టీఏలు, డీఏలు, సరెండర్ లీవులు విడుదల చేయనందుకు, వారి ఆరోగ్య భద్రత పథకంపై భరోసా ఇవ్వనందుకు, పోలీస్‌శాఖలో ఉన్న 17 వేల ఖాళీల భర్తీపై, పోలీసులకు కొత్త వాహనాల విషయంలో సమాధానం చెప్పనందుకు, బీసీల ఆత్మగౌరవ విషయంలో స్పష్టత ఇవ్వనందుకు, బీసీ సబ్ ప్లాన్ నిదుల కేటాయింపుపై వైఖరి చెప్పనందుకు, ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ ఉద్యోగుల అపాయింటెడ్ డేట్ చెప్పనందుకు నిరసనగా వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించి, వెళ్లిపోయారు.