Reading Time: 2 minutes
Karimnagar Rbl Bank 138 Crore Cyber Fraud Busted

కరీంనగర్ కేంద్రంగా సాగుతున్న ఒక భారీ అంతర్జాతీయ సైబర్ నేరాల నెట్‌వర్క్‌ను కరీంనగర్ పోలీసులు చేధించారు. స్థానిక ఆర్‌బిఎల్ (RBL) బ్యాంకును వేదికగా చేసుకుని సుమారు 139 కోట్ల రూపాయల మేర అక్రమ లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ‘ఆపరేషన్ క్రాక్ డౌన్’లో భాగంగా సాగించిన ఈ విచారణలో మ్యూల్ అకౌంట్ల (Mule Accounts) ద్వారా సాగుతున్న ఈ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఇప్పటివరకు బ్యాంకు సిబ్బందితో సహా మొత్తం 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ మోసంలో విస్తుపోయే నిజం ఏమిటంటే, సాక్షాత్తు బ్యాంకు మేనేజర్ , క్యాషియర్ నేరగాళ్లతో చేతులు కలిపారు. సైబర్ నేరగాళ్లు వివిధ ప్రాంతాల్లో బాధితుల నుండి కొట్టేసిన సొమ్మును ఈ బ్యాంకులోని కరెంట్ అకౌంట్లలోకి మళ్లించేవారు. నిందితులకు సహకరించినందుకు గాను బ్యాంకు సిబ్బంది భారీగా లబ్ధి పొందినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. నిందితులు సుమారు 2,000 మందితో ఒక పెద్ద నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసి, కమిషన్ల ఆశ చూపి సామాన్య ప్రజల పేరుతో ఖాతాలను తెరిపించారు. ప్రతి లక్ష రూపాయల లావాదేవీకి అకౌంట్ హోల్డర్‌కు రూ. 2,000 (2%) కమిషన్ ఇస్తూ, వారి ఖాతాలను కేవలం ఒక ముసుగులా వాడుకున్నారు.

Ayodhya: అయోధ్య యజ్ఞశాలలో భారీ అగ్నిప్రమాదం.. ఎకరం విస్తీర్ణం దగ్ధం

బ్యాంకులోని కరెంట్ అకౌంట్ల ద్వారా జరిగిన ఈ వందల కోట్ల లావాదేవీలు పోలీసులకు అనుమానం కలిగించాయి. ఖాతాల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించగా, దేశవ్యాప్తంగా జరిగిన సైబర్ నేరాల సొమ్ము ఇక్కడికే చేరుతున్నట్లు నిర్ధారణ అయింది. ఈ అక్రమ సొమ్ము కేవలం దేశానికే పరిమితం కాకుండా చైనా , దుబాయ్ వంటి దేశాలకు కూడా మళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆర్‌బిఎల్ బ్యాంకుతో పాటు నగరంలోని మరో రెండు మూడు ప్రైవేట్ బ్యాంకుల్లో కూడా ఇదే తరహా అక్రమాలు జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.

New Hyundai Venue: పెరిగిన హ్యుందాయ్ వెన్యూ ధరలు, వేరియంట్ల వారిగా ధరలు ఇవే..

ప్రస్తుతం అరెస్ట్ అయిన 13 మంది నిందితులను విచారిస్తున్న పోలీసులు, ఈ చైన్ నెట్‌వర్క్‌లో ఉన్న మరికొంత మంది కీలక వ్యక్తుల కోసం గాలిస్తున్నారు. ప్రజలు తమ బ్యాంకు ఖాతాలను ఇతరులకు వాడటానికి ఇచ్చి అనవసరమైన చిక్కుల్లో పడకూడదని, తక్కువ శ్రమతో వచ్చే అదనపు ఆదాయం వెనుక పెద్ద మోసాలు ఉండవచ్చని కరీంనగర్ పోలీస్ యంత్రాంగం హెచ్చరిస్తోంది. ‘ఆపరేషన్ క్రాక్ డౌన్’ ద్వారా ఈ నెట్‌వర్క్ మూలాలను పూర్తిగా చేధిస్తామని కమిషనర్ స్పష్టం చేశారు.