
అయోధ్య: అయోధ్యలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అయోధ్య రామ మందిరానికి సరిగ్గా 800 మీటర్ల దూరంలో యాగం జరిగిన యాగ శాలలో అగ్ని ప్రమాదం జరిగింది. యాగ నిమిత్తం వేసిన పందిరి మొత్తం మంటల్లో తగలబడిపోయింది. దాదాపు ఒక ఎకరంలో ఈ యాగం నిమిత్తం పందిర్లు వేశారు. ఈ యాగ శాల ఉత్తరప్రదేశ్ రవాణా శాఖ మంత్రి దయశంకర్ సింగ్కు చెందినదిగా పోలీసులు తెలిపారు. శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. తొమ్మిది రోజులుగా లక్ష్మీ నారాయణ మహా యజ్ఞం ఈ యాగ శాలలో జరుగుతుంది.
🚨⚡️Breaking: Massive fire breaks out at the 1251 Kundiya Shri Lakshmi Narayan Mahayagya on its final day at Rajghat, Ayodhya. The grand pandal and havan kunds reduced to ashes. No casualties reported. Fire brigade on spot, cause under investigation. #Ayodhya #Mahayagya pic.twitter.com/xoWwn00vox
— News Tiger World News And Entertainment (@NewsTigerWorld) March 28, 2026
యాగం ముగిసే రోజు కావడంతో దాదాపు 50 వేల మంది వరకూ ఈ యాగానికి హాజరయ్యారు. యాగం ముగిసి అందరూ వెళ్లిపోయిన గంటన్నర తర్వాత ఈ అగ్ని ప్రమాదం జరిగింది. యాగ క్రతువులో భాగంగా.. హోమ గుండం దగ్గర కొబ్బరి కాయ కొడుతున్న సమయంలో ఆ కొబ్బరి కాయ పొరపాటున హోమ గుండంలో పడటంతో నిప్పు రవ్వలు పందిరికి అంటుకుని ఈ అగ్ని ప్రమాదం జరిగిందని సమాచారం. పలుచటి వస్త్రాలు కావడంతో మంటలు వేగంగా వ్యాపించాయి.
నిమిషాల్లోనే యాగ శాల మొత్తం కాలి బూడిదైంది. మంటలు పెద్ద ఎత్తున గాల్లోకి లేచాయి. ఆ ప్రాంతమంతా పొగలు వ్యాపించాయి. ఈ అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది స్పాట్ కు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మంటలు ఆరిపోయినప్పటికీ అక్కడ మొత్తం అప్పటికే కాలి బూడిదైన దృశ్యాలు కనిపించాయి.
ఈ అగ్ని ప్రమాదం యాగం ముగిశాక జరగడం.. అక్కడ ఎవరూ లేకపోవడంతో అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. యజ్ఞం కోసం 12 వందల 51 హోమ గుండాలు ఏర్పాటు చేశారు. 5 వేల మందికి పైగా యాగం చేశారు. పది ఫైర్ ఇంజన్లు రెండు గంటల పాటు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.