Reading Time: 2 minutes

ఇండియాలో ప్రొటీన్ ఫుడ్పై రోజురోజుకు పెరిగిపోతున్న మోజు.. శరీరంలో ప్రొటీన్ ఎక్కువైతే ఏం జరుగుతుందో తెలుసా..?

Caption of Image.

కరోనా తర్వాత మన దేశంలో ఆరోగ్యం విషయంలో జాగ్రత్త పెరిగింది. ప్రొటీన్ ఫుడ్పై భారతీయుల్లో రోజురోజుకూ మక్కువ పెరిగిపోయింది. ఏ సూపర్ మార్కెట్లో చూసినా ప్రొటీన్ ఫుడ్ ను విపరీతంగా అమ్ముతున్నారు. ప్రొటీన్ చిప్స్, ప్రొటీన్ లడ్లు, ప్రొటీన్ ఐస్ క్రీములను కూడా అమ్ముతున్నారు. ఒకప్పుడు ఈ ప్రొటీన్ ఫుడ్ గురించి అథ్లెట్లు, బాడీ బిల్డర్లు మాత్రమే ఆలోచన చేసేవారు. వాళ్లు మాత్రమే ఎక్కువగా తీసుకునేవారు. బరువు తగ్గాలన్నా, బలంగా ఉండాలన్నా.. ఆరోగ్యంగా ఉండాలన్నా ప్రొటీన్ ఫుడ్ తినాలనే ప్రచారం విపరీతంగా జరగడంతో ఇప్పుడు ప్రొటీన్ పౌడర్లు దాదాపు ప్రతీ ఒక్కరీ వంట గదిలో కనిపిస్తున్నాయి.

అయితే.. ఈ ప్రొటీన్ ఎంత తీసుకోవాలనే విషయంలో ఇప్పటికీ చాలా మందికి గందరగోళం నెలకొంది. మనకు ప్రొటీన్ అనేది అవసరమే. మన ఆరోగ్యంలో, రోగ నిరోధక వ్యవస్థలో ప్రొటీన్లు కీలక పాత్ర పోషిస్తాయనడంలో సందేహమే లేదు. కానీ.. లైఫ్ స్టైల్తో సంబంధం లేకుండా మనం తినే ప్రతీ ఫుడ్లో ప్రొటీన్లు తీసుకోవడం కూడా ఆరోగ్యానికి ప్రమాదకరమేనని నిపుణులు చెబుతున్నారు.

అవసరానికి మించి ప్రొటీన్‌‌ తీసుకోవడం కూడా శరీరానికి ప్రమాదకరమే.గ్యాస్‌‌, అజీర్తి లాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ప్రొటీన్ ఎక్కువ తీసుకోకూడదు. రోజుకు మనకు 25 నుంచి 30 గ్రాముల ప్రొటీన్‌‌ సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ అయితే అది సమస్యలు తెస్తుంది. రోజుకి 30 నిమిషాలు వర్కవుట్స్ చేయడం ద్వారా మనం తీసుకునే  ప్రొటీన్‌‌ బాడీకి సరిగ్గా చేరుతుంది. ఎక్కువ ప్రొటీన్‌‌  శరీరంలో యాసిడ్‌‌ను రిలీజ్‌‌ చేస్తుంది. మొలకల్ని బాగా నమిలి తినాలి. అంటే గుప్పెడు మొలకలు తినటానికి కనీసం 20 నిమిషాలు తీసుకోవాలి. అలా తినకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది.

►ALSO READ | Health tips:ఎండకు వెళ్లి వచ్చారా..! అలసటగా ఉందా! డీహైడ్రేషన్ కు గురయ్యారేమో ఇలా తెలుసుకోండి

నాన్ వెజ్ తినడం మంచిదే.  కానీ, రోజూ దానికి తగినంత శారీరక శ్రమ చేస్తున్నామా? లేదా?  చూసుకొని దానికి సరిపడేంత మీట్ మాత్రమే తినాలి. ఆరోగ్యకరమైన శరీరం ప్రోటీన్‌ను సమర్థవంతంగా జీర్ణం చేసుకోగలుగుతుంది. కానీ.. సరిపడినన్ని నీళ్లు తాగకుండా.. ప్రొటీన్ ఫుడ్ను ఎక్కువగా తినడం వల్ల మూత్రపిండాలపై అనవసరమైన ఒత్తిడి పడుతుంది. జీర్ణక్రియకు, మూత్రపిండాలకు ఎక్కువ ప్రొటీన్ హాని కలిగిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారతీయులు తినే భోజనంలో శరీరానికి సరిపడా ప్రొటీన్లు ఉంటాయని.. ప్రత్యేకంగా ప్రొటీన్ ఫుడ్ తిన్నా అందుకు తగిన శారీరక శ్రమ అవసరం అని వైద్యులు సూచిస్తున్నారు.

©️ VIL Media Pvt Ltd.