Reading Time: < 1 minute

టీవీకే అభ్యర్థుల జాబితా రిలీజ్: పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నుంచి విజయ్ పోటీ

Caption of Image.

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న టీవీకే అభ్యర్థుల పూర్తి జాబితాను పార్టీ చీఫ్ విజయ్ ప్రకటించాడు. ఆదివారం (మార్చి 29) చెన్నైలో జరిగిన పార్టీ కార్యక్రమంలో టీవీకే అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేశాడు. విజయ్ పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ రెండు స్థానాల నుంచి బరిలోకి దిగుతున్నాడు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ.. తమిళనాడు ఎన్నికలు టీవీకే, డీఎంకేల మధ్య ప్రత్యక్ష పోరుగా అభివర్ణించారు. 

టీవీకేని గెలిపిస్తే ఎన్నడూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయమని, అవినీతికి పాల్పడమని వాగ్దానం చేశాడు. మహిళలకు భద్రత కల్పిస్తామని.. మాదకద్రవ్య రహిత తమిళనాడును సృష్టిస్తామని హామీ ఇచ్చారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. తమిళనాడు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఎన్నటికీ వ్యవహరించబోమని వాగ్ధానం చేశారు. విజల్ గుర్తుకు ఓటేసి టీవీకే పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

మా అభ్యర్థులు బాగా డబ్బున్న, అధికారం ఉన్నవాళ్లు కాదని అంతా సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినవారేనని.. సామాన్యుడి కష్టాలను అర్థం చేసుకునే స్వభావం గలవారేనని అన్నారు. ఎమ్మెల్యే అంటే కేవలం ప్రతినిధిగా మాత్రమే కాకుండా ప్రజల సంరక్షులుగా ప్రజల గొంతుకగా ఉండాలని పేర్కొన్నారు. ప్రతి అభ్యర్థిని క్షుణ్ణంగా పరిశీలించి వ్యక్తిగతంగా ఎంపిక చేశానని తెలిపారు. సినిమా వాళ్లు గెలవరని కొందరు విమర్శిస్తున్నారని.. వాళ్లకు నా విజయంతోనే సమధానం చెబుతానని అన్నారు.

2026, ఏప్రిల్ 23 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఎవరితో పొత్తు లేకుండా ఒంటరిగానే బరిలోకి దిగుతోంది. తమిళనాడులో అధికారమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోన్న బీజేపీ విజయ్‎తో పొత్తు కోసం ప్రయత్నించింది. కానీ ఇందుకు విజయ్ ఒప్పుకోలేదు. ఒంటరిగా పోటీ చేసేందుకే మొగ్గు చూపాడు. దీంతో ఈసారి తమిళనాడులో త్రిముఖ పోరు నెలకొంది. అధికార డీఎంకే, ప్రతిపక్ష ఎన్డీఏ కూటమి, టీవీకే మధ్య ట్రయాంగిల్ ఫైట్ సాగనుంది. 

 

©️ VIL Media Pvt Ltd.