Reading Time: 2 minutes
ఎండాకాలంలో సోంపు తింటే ఏమవుతుంది..? మీరు అస్సలు ఊహించలేరు..

భానుడి భగభగలు మొదలయ్యాయి. వేసవి కాలం ప్రారంభంతో పాటే అనేక ఆరోగ్య సమస్యలు కూడా చుట్టుముడుతున్నాయి. ముఖ్యంగా ఎండల తీవ్రత వల్ల కడుపులో వేడి, గ్యాస్, ఉబ్బరం, అజీర్ణం వంటి జీర్ణ సంబంధిత సమస్యలు సామాన్యులను వేధిస్తున్నాయి. అయితే ప్రతి చిన్న సమస్యకు మందుల మీద ఆధారపడకుండా మన వంటగదిలోని సోంపు గింజలతో వీటికి సులభంగా పరిష్కారం చూపవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

ఆయుర్వేదంలో సోంపు ప్రాముఖ్యత

ఆయుర్వేద శాస్త్రం ప్రకారం.. సోంపు శరీరంలోని పైత్య దోషాన్ని సమతుల్యం చేస్తుంది. ఇది చలువ చేసే గుణం కలిగి ఉండటం వల్ల వేసవి ఉష్ణోగ్రతల నుండి శరీరాన్ని కాపాడుతుంది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద నివేదికల ప్రకారం.. సోంపులో యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, సహజ సిద్ధమైన నొప్పి నివారణ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రతిరోజూ ఒక టీస్పూన్ సోంపు తీసుకోవడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే..
సోంపుతో కలిగే 5 ప్రధాన ప్రయోజనాలు

జీర్ణక్రియ మెరుగుదల

భోజనం తర్వాత ఒక చెంచా సోంపు నమలడం వల్ల లాలాజలం ఉత్పత్తి పెరిగి జీర్ణక్రియ వేగవంతం అవుతుంది. భారీగా తిన్నప్పుడు కలిగే అజీర్ణం, కడుపు భారంగా అనిపించే సమస్య నుండి ఇది తక్షణ ఉపశమనం ఇస్తుంది.

గ్యాస్ – ఉబ్బరం నుండి విముక్తి: కడుపులో గ్యాస్ నిండి ఉబ్బరంగా అనిపించినప్పుడు సోంపు నీరు తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇది ప్రేగుల పనితీరును క్రమబద్ధీకరించి, మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తుంది.

కడుపు నొప్పి నివారణ: సోంపులోని యాంటీ బాక్టీరియల్ గుణాలు సాధారణ కడుపు నొప్పిని తగ్గించడమే కాకుండా నెలసరి సమయంలో వచ్చే తీవ్రమైన కడుపు నొప్పి, అసౌకర్యం నుండి కూడా ఉపశమనం కలిగిస్తాయి.

అలసటను తరిమికొట్టే సోంపు టీ: వేసవిలో వచ్చే నీరసం, ఆఫీసు పని వల్ల కలిగే అలసటను తగ్గించడానికి సోంపు టీ అద్భుతంగా పనిచేస్తుంది. ఇది మనస్సును, శరీరాన్ని ప్రశాంతంగా ఉంచి రీఫ్రెష్ చేస్తుంది.

దీర్ఘకాలిక సమస్యలకు చెక్: ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ వంటి దీర్ఘకాలిక జీర్ణ సమస్యలతో బాధపడేవారికి సోంపు ఒక సహజ సిద్ధమైన ఔషధంగా పనిచేస్తుంది.

సోంపు టీ.. తయారు చేయడం ఎలా?

  • వంటగదిలో చాలా సులభంగా సోంపు టీని తయారు చేసుకోవచ్చు..
  • ఒక కప్పు నీటిలో ఒక టీస్పూన్ సోంపు గింజలను వేసి 5-10 నిమిషాలు మరిగించాలి.
  • ఆ నీటిని వడకట్టి, అవసరమైతే కొద్దిగా తేనె కలుపుకుని వేడిగా తాగాలి.
  • భోజనం చేసిన తర్వాత ఈ టీ తాగడం వల్ల జీర్ణక్రియ బాగుంటుంది.

జాగ్రత్తలు

సోంపు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినప్పటికీ, దీనిని అతిగా తీసుకోకూడదు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు వైద్యుడిని సంప్రదించిన తర్వాతే దీనిని వాడటం ఉత్తమం.