Reading Time: < 1 minute

స్త్రీనిధి రుణాలను 2011 నుంచి సుమారు 32 లక్షల సభ్యులకు రూ.23 వేల కోట్లు అందించగా, 2025 మార్చి 31 నాటికి రుణ నిల్వ రూ.5,107 కోట్లుగా ఉందని మంత్రి సీతక్క తెలిపారు. 2025.26లో రూ.2,350 కోట్ల ప్రణాళికలో రూ.2,125 కోట్లు (దాదాపు 90%) అమలు చేసి, ఆ ఏడాది 2026-.27 రూ.2,530 కోట్ల ప్రణాళిక రూపొందించిందని తెలిపారు. అలాగే 2024-.25లో రూ.154 కోట్ల నికర లాభంతో 14 శాతం డివిడెండ్ ప్రకటించడం స్త్రీనిధి విజయాన్ని ప్రతిబింభిస్తుందని తెలిపారు. సెర్ప్, మెప్మా సమన్వయంతో మరిన్ని సేవలు అందించేందుకు స్త్రీనిధి కట్టుబడి ఉంది అని అన్నారు.

మారుమూల గ్రామాల సంఘాలకు మన స్త్రీనిధి యాప్ ద్వారా స్వయంగా రుణాలకు దరఖాస్తు చేసుకునే సౌకర్యం కల్పించి, తక్కువ ఖర్చుతో సరైన సమయంలో రుణాలు పొందే విధంగా స్త్రీనిధి చర్యలు చేపట్టిందని తెలిపారు. మారుమూల గ్రామాల్లో, నెట్వర్క్ లేని ప్రాంతాల్లో పోస్టాఫీసులు ద్వారా నగదు చెల్లింపులకు అవకాశం ఉందని చెప్పారు. స్త్రీనిధిలో సిబ్బంది కొరతను అధిగమించేందుకు 163 మంది నియామకాలకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అదేవిధంగా సెర్ప్, మెప్మా సిబ్బందికి ప్రగతి ఆధారిత ప్రోత్సాహకాలు అందించేందుకు ఈ ఏడాది నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.