Reading Time: 2 minutes

ఇప్పుడు సాగుతున్న యుద్ధాలకు ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ యుద్ధాలు శాశ్వతం కావడం ప్రపంచ దేశాలు ఎంత సంక్షోభంతో అల్లాడుతున్నాయో మనం చూస్తున్నాం. ఇరాన్, లెబనాన్, పశ్చిమాసియాలోని డజను అరబ్ దేశాల్లో క్షిపణులు, డ్రోన్లతో బాంబుల దాడులు ఏమాత్రం తగ్గడం లేదు. ఏప్రిల్ 6 వరకు ఇరాన్ అణుశక్తి ప్లాంట్లపై దాడులు జరపబోమని అమెరికా తాత్కాలిక విరామం ప్రకటించింది. గాజాలో శిధిలమైన జీవితాలను నిలబెట్టుకోడానికి అక్కడి జనం పోరాడుతుంటే, ఉక్రెయిన్‌లో భౌగోళిక రాజకీయ ఆధిపత్యం కోసం సైన్యాలు యుద్ధం సాగిస్తున్నాయి. గాజా విధ్వంసం ‘ప్రపంచం మరిచిపోతున్న యుద్ధం’గా మారుతుండగా, ఉక్రెయిన్ యుద్ధం నిరంతర మారణహోమంగా కొనసాగుతోంది. ఇరాన్ సార్వభౌమత్వాన్ని ఇజ్రాయెల్ అమెరికా తిరస్కరించడం వల్ల ఇరాన్ యుద్ధానికి దారి తీసి చమురు, గ్యాస్ రవాణా స్తంభించింది.

దీనికి ప్రపంచమంతా మూల్యం చెల్లించుకోవలసి వస్తోంది. ఈ పరిణామాలే కనుక లేకుంటే సోమాలియాలో జరిగిన సైనిక చర్యలు వంటివి కేవలం శత్రుత్వంతో జరిగిన దురదృష్టకర సంఘటనలుగా మాత్రమే పరిగణించబడేవి. ఇరాన్ తన అద్భుతమైన యుద్ధ సామర్ధంతో అరబ్ దేశాలపై దాడి చేస్తూ హోర్ముజ్ జలసంధి ద్వారా చమురు, గ్యాస్ రవాణాను అడ్డుకుంటోంది. ఇరాన్ అణుసామర్ధాన్ని అడ్డుకునే నెపంతో అమెరికాఇజ్రాయెల్ దేశాలు ఈ యుద్ధాన్ని మొదలు పెట్టినప్పటికీ ఇప్పుడు అది కేవలం చమురు రవాణా మార్గాలను తెరచి ఉంచడానికి జరిగే పోరాటంగా మారిపోయింది. ఈ యుద్ధం నుండి బయటపడడానికి అమెరికా ప్రయత్నిస్తున్నా ఇజ్రాయెల్‌ను ఒప్పించలేకపోతోంది. శాంతి ప్రయత్నాల పేరుతో అమెరికా 15 డిమాండ్లను ఇరాన్ ముందుకు తెచ్చింది. ఒప్పందం కుదురుతుందని అందరూ భావించారు. కానీ అది ఇరాన్‌కు లొంగిపోయే డాక్యుమెంట్‌గా చిత్రీకరించబడ్డది. అరబ్ దేశాలను ఇరాన్ తీవ్రంగా దెబ్బతీయడమే కాక, హోర్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేయకుండా ఏ నౌకలు ఈ మార్గం ద్వారా వెళ్లాలో, ఏ నౌకలు వెళ్లకూడదో నిర్ణయిస్తూ టోల్‌బూత్ విధానాన్ని అమలు చేస్తోంది.

అమెరికా, ఇజ్రాయెల్ వారి మిత్ర దేశాల నౌకలను అడ్డుకుంటోంది. చైనా, భారత్ వంటి దేశాల నౌకలకే అనుమతిస్తోంది. దీనివల్ల తూర్పు దేశాలకు ముఖ్యంగా ఆసియా దేశాలకు ముడి చమురు, సహజవాయువు (ఎల్‌ఎన్‌జి) సరఫరా సాగడం లేదు. ఈ పరిస్థితి 1970నాటి ఇంధన సంక్షోభాన్ని గుర్తు చేస్తోంది. హోర్ముజ్ జలసంధిపై తమకే సార్వభౌమత్వాన్ని కల్పించాలని ఇరాన్ డిమాండ్ చేసింది. ఈ డిమాండ్‌తోపాటు ఐదు ప్రతీకార డిమాండ్లను ఇరాన్ ప్రతిపాదించిందంటే ఇక ఒప్పందం అన్న మాటకు అవకాశమే లేదని అర్ధం చేసుకోవాలి. యుద్ధం ఎటు వెళ్తోందో తెలియని స్థితిలో అమెరికా ఉంది. తన మిత్రదేశం ఇజ్రాయెల్‌కు ఒకవైపు మద్దతు ఇస్తూనే, మరోవైపు యుద్ధం వల్ల కలుగుతున్న నష్టాన్ని తగ్గించుకోవడానికి అమెరికా ప్రయత్నిస్తోంది. ఈ యుద్ధం మొదట్లో ఇరాన్ అణుబాంబు టార్గెట్‌లను అణచివేయడం, ఇరాన్ పాలనలో మార్పు తీసుకురావడం, తదితర లక్షాలతో ప్రారంభమైంది. కానీ ఇప్పుడు ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి దిగ్బంధాన్ని తొలగించడమే ప్రధాన లక్షంగా మారింది.

యుద్ధానికి ముందు ఈ మార్గం నిరంతరం తెరిచే ఉండేది. ఇదెంత హాస్యాస్పదమో అన్న విమర్శలు అందరి నోటా వినిపిస్తున్నాయి. కానీ ట్రంప్ కుటుంబ సభ్యుల సంప్రదింపుల బృందానికి, స్నేహితులకు కేబినెట్ సహచరులకు మాత్రం ఇదేమీ అనిపించడం లేదు. ఇరాన్‌పై ఇజ్రాయెల్ అమెరికా వైమానిక దాడులు జరగడానికి 48 గంటల ముందే ఇరాన్ తన అణు కార్యకలాపాలపై చర్చకు సిద్ధమని, 60 శాతం వరకు సుసంపన్నం చేసిన 440 కిలోల యురేనియంను వదులుకోడానికి సిద్ధంగా ఉన్నామని ఇరాన్ సంకేతాలిచ్చినా ఇజ్రాయెల్ అమెరికా పట్టించుకోకుండా దుస్సాహసంతో దాడులు ప్రారంభించారని అమెరికా దౌత్యవేత్తలు కొందరు ఆరోపణాస్త్రాలు సంధిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ యుద్ధం ఇరాన్, రష్యా దేశాలకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించే వాణిజ్యంగా సాగుతోంది. చమురు విక్రయాలపై ఆంక్షలు సడలించడంతో రోజుకు 140 మిలియన్ డాలర్లను సంపాదించగలుగుతున్నామని ఇరాన్ చెబుతోంది. రష్యాకు కూడా ఇదే విధమైన ప్రయోజనం చేకూరుతోంది.

రష్యా తన చమురును ఎవరికైనా విక్రయించుకునేలా వెసులుబాటు లభించడంతో రష్యా అధ్యక్షుడు పుతిన్ లాభాల పంటను పండించుకుంటున్నారు. దీంతో ఉక్రెయిన్‌తో మరింత పోరు సాగించడానికి ఆర్థిక ఊతం మరింత లభించినట్టయింది. ఇరాన్ భూభాగంలో కానీ, ఇరాన్ అధీనంలో ఉండే ఖర్గ్ ద్వీపంలో కానీ అమెరికా దురాక్రమణకు పాల్పడితే ప్రపంచ దేశాలు మరింత సంక్షోభానికి గురవుతాయి. హోతీ వర్గాలకు స్థావరంగా తయారైన ఎర్రసముద్రం మార్గాన్ని కూడా అష్టదిగ్బంధనం చేస్తామని అమెరికా ఇజ్రాయెల్ దేశాలను ఇరాన్ హెచ్చరిస్తోంది. ఈ పరిస్థితుల్లో సుదీర్ఘమైన ‘ఎండ్‌గేమ్’ ప్రణాళికను ట్రంప్ రూపొందించడం కంటే శాశ్వత యుద్ధ స్థితి అనే ఊబిలోనుంచి బయటపడడానికి దౌత్యమార్గాల ద్వారా ప్రయత్నాలు సాగించడం శ్రేయస్కరం. ఇదే విధంగా ఇరాన్ కూడా స్థిరమైన నిరంకుశ రాజకీయాలు, యుద్ధ వ్యూహాలతో తమ ప్రతిఘటన సామర్ధం నిరూపించుకోవడం కంటే అణుబాంబుల తయారీ అనేది తెలివి తక్కువ నిర్ణయమని, తాము ఆ దిశంగా వెళ్లడం లేదని ప్రపంచానికి చాటిచెప్పేలా స్పష్టమైన హామీ ఇవ్వడం ప్రపంచ క్షేమానికి దారి చూపుతుంది.