
దుబాయ్: చర్చల ఆశలు అడుగంటుతుండగా గల్ఫ్ యుద్ధం శనివారం మరింత రాజుకుంది. సౌదీ అరేబియా, కువైట్‌లపై ఇరాన్ తమ శక్తివంతమైన దేశీయ బాలిస్టిక్ మిస్సైల్స్‌తో దాడులకు దిగింది. వేయి కిలోమీటర్ల వరకూ దూసుకువెళ్లే సామర్థం ఉన్న ఖ్వాద్ 380 క్రూయిజ్ మిస్సైల్స్‌తో దాడులు సాగాయి. అమెరికా సైనిక స్థావరాలకు పొరుగుదేశాలు ఆశ్రయం ఇస్తున్నందున వాటిపై దాడులు తీవ్రతరం చేస్తామని ఇరాన్ అధ్యక్షులు హెచ్చరించారు.ఈ క్రమంలోనే ఇరాన్ రెవెల్యూషన్ గార్డ్ కార్ప్ ఈ నిర్ణీత పోరుకు దిగాయి. ఈ క్రమంలో దుబాయ్‌లోని అత్యంత కీలకమైన రెండు అమెరికా సైనిక స్థావరాలను గురి చూసి దెబ్బతీశారు. ఈ రెండు కేంద్రాలలో 500 మందికి పైగా అమెరికా సైనికులు ఉంటున్నారు. ఇక్కడ జరిపిన దాడులలో పది మందికి పైగా అమెరికా సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. అంతర్జాతీయ వాణిజ్య , ప్రయాణ కేంద్రీకృత నగరం దుబాయ్‌లో శనివారం అంతటా అంబులెన్స్‌ల కదలికలు, సైరన్ల మోతల నడుమ భయానక వాతావరణం నెలకొంది.
ఇరాన్ దాడులలో కొందరు అమెరికా సైనికులు మృతి చెందినట్లు, ఎక్కువ మంది గాయపడ్డట్లు ప్రాధమిక సమాచారంతో వెల్లడైంది. ఇప్పటి దాడులతో ట్రంప్, అమెరికా సైనిక కమాండర్లు పరిస్థితిని గ్రహించి తీరాలి. ఈ ప్రాంతం అమెరికా సైనిక స్థావరాలకు సురక్షితం కాదని గుర్తుపెట్టుకోవాలని ఇరాన్ సైన్యం అధికార ప్రతినిధి ఒకరు టెహరాన్‌లో తెలిపారు. ఇప్పుడు అమెరికా సైనికులకు ఈ ప్రాంతం ఖననవాటిక అవుతుందని హెచ్చరించారు. ఇప్పుడు వారికి ముందున్న మార్గం ఒక్కటే వీరోచిత ఇరానీయన్లకు, ఇస్లామ్ యోధులకు సరెండర్ అయ్యి తీరాలి అని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే సౌదీకి, ఇతర గల్ఫ్ దేశాలకు ఇరాన్ అధ్యక్షులు మసౌద్ పెజెష్‌కియన్ తమ హెచ్చరికలు వెలువరించారు. ఖతార్‌లోని కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇరాన్ డ్రోన్ల దాడి క్రమంలో అక్కడి రాడార్ వ్యవస్థ దెబ్బతింది. ఇరాన్ జరిపిన ఈ దాడిలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. దుబాయ్‌లోని ఓ హోటల్‌పై కూడా ఇరాన్ తన కమికాజే డ్రోన్లతో దాడులకు దిగింది.
ఆరు అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ దాడులు
ఇరాన్ అమెరికాకు చెందిన పలు నౌకా స్థావరాలపై శనివారం దాడులకు దిగింది. కువైట్‌లోని షువైక్‌పోర్టుకు అనుబంధంగా ఉన్న అమెరికా ల్యాండింగ్ సౌకర్యాలపై ఇరాన్ గార్డ్ విరుచుకుపడ్డారు.ఈ క్రమంలో పలువురు అమెరికా సైనికులు మృతి చెందినట్లు ఇరాన్ సైనిక వర్గాలు తెలిపాయి. అయితే దీనిని స్థానిక వార్తాసంస్థలు ధృవీకరించలేదు. ఇరాన్‌లోని పలు ప్రాంతాలలో ఇజ్రాయెల్ సేనలు దాడులకు దిగాయి. ఈ క్రమంలోనే తొలిసారిగా ఇరాన్ మద్దతుగల హౌతి రెబెల్స్ ఇజ్రాయెల్ పై క్షిపణులతో దాడులకు దిగింది. ఈ రెబెల్ బృందం సైనిక అధికార ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ యాహ్యా సారీ ఓ ప్రకటన వెలువరించారు. తాము ఈ ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడుల్లో భాగంగా ఇరాన్‌కు మద్దతుగా రంగంలోకి దిగామని తెలిపారు. ఇజ్రాయెల్‌కు చెందిన అత్యంత కీలకమైన సైనిక స్థావరాలను ఎంచుకుని పలుసార్లు క్షిపణులను పంపించినట్లు తెలిపారు. ఈ క్షిపణులను దెబ్బతీశామని శనివారం ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఈ క్రమంలో ఇప్పుడు క్రమేపీ ఇజ్రాయెల్ ఆత్మరక్షణ స్థాయికి చేరుకుంటున్న విషయం స్పష్టం అయిందని విశ్లేషకులు తెలిపారు.
నేడు ఇస్లామాబాద్‌లో దౌత్య బృందాల చర్చ
దౌత్యవర్గాల ద్వారా గల్ఫ్ యుద్ధ నివారణకు ఓ వైపు ప్రయత్నాలు సాగుతున్నాయి. చర్చలు సజావుగా సాగుతున్నాయని అమెరికా అధ్యక్షులు ట్రంప్ శనివారం కూడా ప్రకటించారు. అయితే ఈ క్రమంలోనే గల్ఫ్ ప్రాంతంపై దాడులకు సిద్ధంగా ఉండేందుకు అత్యధిక సంఖ్యలో సైనిక బలగాలను అమెరికా తరలించింది. ఇస్లామాబాద్‌లో పాకిస్థాన్ అధికారిక ప్రకటన వెలువరించింది. సౌదీ అరేబియా, టర్కీ, ఈజిప్టు దేశాల దౌత్య ప్రతినిధి బృందాలు ఇస్లామాబాద్‌కు వస్తాయని, యుద్ధం నివారణకు ఈ చర్చలు ఇక జోరందుకుంటాయని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ డార్ తెలిపారు. సౌదీ విదేశాంగ మంత్రి ఫైసల్ బిన్, . టర్కీ విదేశాంగ మంత్రి హకన్ ఫిదన్, ఈజిప్టు విదేశాంగ మంత్రి బద్ అబ్దెలాతీ ఆదివారం పాకిస్థాన్‌కు వస్తున్నారని డార్ వివరించారు. రెండు రోజుల పాటు విస్తృత స్థాయి చర్చలు జరుగుతాయని తెలిపారు. ప్రధాని షెహబాజ్ షరీఫ్ శనివారం స్పందించారు. ఇరాన్ అధ్యక్షులు మసౌద్‌తో తాను మాట్లాడినట్లు , యుద్ధం ముగింపు విషయాన్ని ప్రస్తావించినట్లు చెప్పారు.
ఇరాన్‌లో పెరిగిన మృతులసంఖ్య
నెలరోజుల పోరు క్రమంలో ఇరాన్‌లో ఇప్పటివరకూ చనిపోయిన వారి సంఖ్య 1900 దాటింది. ఇజ్రాయెల్‌లో 20 మంది వరకూ మృతి చెందారు. పౌర ప్రాంతాలపై జరుగుతున్న దాడుల దశలో సంభవిస్తున్న మరణాలపై ఇరాన్ వార్తాసంస్థ ఎప్పటికప్పుడు సంఖ్యలతో వివరాలు వెల్లడిస్తోంది. లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులతో ఇప్పటివరకూ 1100 మందికి పైగా మృతి చెందారు. దాడులలో 13 మంది వరకూ అమెరికా సైనికులు ప్రాణాలు వదిలారు. ఇరాక్‌లో ఇరాన్ మద్దతుగల మిలిటెంట్లు జరిపిన దాడులలో భద్రతాబలగాలకు చెందిన 80 మంది మృతి చెందినట్లు నిర్థారణ అయింది. దుబాయ్, గల్ఫ్‌లోని పలు ప్రాంతాల్లో జరిగిన దాడులలో బారతీయ పౌరులు ముగ్గురు, కొందరు పాకిస్థానీయులు మృతి చెందారు.