
IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇచ్చిన మాటను ఈ రోజు ( మార్చి 28న) నిలబెట్టుకుంది. 2025, జూన్ 4వ తేదీన ఆర్సీబీ విజయోత్సవ వేడుకల్లో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 11 మంది ఫ్యాన్స్ కి కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA) ఘనంగా నివాళులు ఆలర్పించింది. వారి జ్ఞాపకార్థం చిన్నస్వామి మైదానం ప్రవేశ మార్గం దగ్గర ప్రత్యేకంగా ఒక ‘మెమోరియల్’ను ఏర్పాటు చేసింది. ఈ విషాద ఘటనను గుర్తు చేసుకుంటూ ఈరోజు జరుగుతున్న మ్యాచులో ఆర్సీబీ ప్లేయర్స్ అందరూ తమ చేతికి నల్ల బ్యాండ్లు ధరించి బరిలోకి దిగారు.
ఆర్సీబీ జట్టుపై ప్రాణాలు వదిలేంత అభిమానాన్ని చూపించిన ఆ 11 మంది ఫ్యాన్స్ ని స్మరించుకుంటూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అంతేకాదు, ఈ సీజన్లో ఆర్సీబీ ఆడే ప్రతి మ్యాచులోనూ చనిపోయిన 11 మంది అభిమానుల కోసం స్టేడియంలో 11 సీట్లను ఖాళీగా ఉంచాలని జట్టు మేనేజ్మెంట్ నిర్ణయించింది. తాజాగా జరిగిన ప్రాక్టీస్ సెషన్లలో కూడా ప్లేయర్స్ అందరూ 11వ నంబర్ జెర్సీలను ధరించి తమ సానుభూతిని ప్రకటించారు.
►ALSO READ | IPL 2026: టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న ఆర్సీబీ.. బ్యాటింగ్లో దుమ్మురేపేందుకు సిద్ధమైన ఎస్ఆర్హెచ్
కాగా మైదానంలోని ప్లేయర్స్ మాత్రమే కాదు, యావత్ అభిమాన లోకం కూడా ఆ 11 మంది మృతులకు నివాళులర్పిస్తూ స్టేడియం దగ్గర ఏర్పాటు చేసిన మెమోరియల్ సందర్శించారు. ఈ చర్య ద్వారా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన అభిమానుల పట్ల ఉన్న గౌరవాన్ని, బాధ్యతను చాటి చెప్పుకుంది. కాగా 2026 సీజన్ మొదటి మ్యాచ్ బెంగళూరు వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో ఆర్సీబీ జట్టు తలపడుతుంది.