
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా దళపతి విజయ్ కారు డ్రైవర్ కొడుకు పోటీ చేయబోతున్నాడు. కారు డ్రైవర్ కొడుకుకు విజయ్ ఎమ్మెల్యే టికెట్ ఖరారు చేయడంపై హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. రాజేంద్రన్ అనే వ్యక్తి కొన్నేళ్ల నుంచి.. ఒకమాటలో చెప్పాలంటే విజయ్ హీరోగా ఎదుగుతున్న క్రమం నుంచే విజయ్ వ్యక్తిగత కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. రాజేంద్రన్ గడచిన ముప్పై సంవత్సరాలుగా విజయ్ దగ్గర కారు డ్రైవర్గా పనిచేసి ఈ మధ్యనే విజయ్ పర్సనల్ అసిస్టెంట్ గా రాజేంద్రన్ పనిచేస్తున్నాడు.
Emotional Moment: @ActorVijay‘s Personal Driver ‘Rajendran’ & His Son #Sabrinathan! 🥹🫂#TVKVijay pic.twitter.com/3tTz7QeYFM
— Asif (@Asifpeer5) March 29, 2026
రాజేంద్రన్ కొడుకు కూడా విజయ్ వీరాభిమానిగా విరుగంబక్కంలో స్థానికులకు చేతనైన సాయం చేస్తూ చేదోడువాదోడుగా నిలుస్తున్నాడు. విజయ్ దగ్గర అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న రాజేంద్రన్ రుణం తీర్చుకోవాలని విజయ్ భావించారు. ఈ క్రమంలోనే రాజేంద్రన్ కొడుకు శబరినాథన్కు టీవీకే ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఖరారు చేశారు.
శబరినాథన్ను విరుగంబక్కం నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్న టీవీకే ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయ్ ప్రకటించారు. ఈ సమయంలో శబరినాథన్ భావోద్వేగానికి లోనయ్యాడు. విజయ్ కాళ్లు మొక్కిన శబరినాథన్ భావోద్వేగంతో కంట తడి పెట్టుకున్నాడు. రాజేంద్రన్ కూడా భావోద్వేగానికి లోనయ్యాడు. తండ్రీకొడుకు ఇద్దరినీ దగ్గరకు తీసుకుని విజయ్ గుండెలకు హత్తుకున్నాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సినీ నటుడు విజయ్ జోసెఫ్ తన పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ అభ్యర్థులను ఖరారు చేశారు. మొత్తం 234 స్థానాలకు టీవీకే పార్టీ అభ్యర్థులను ప్రకటించింది.
విజయ్ పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్.. ఈ రెండు స్థానాల నుంచి బరిలోకి దిగుతున్నాడు. టీవీకే ఒంటరిగా పోటీ చేస్తుందని ఇప్పటికే విజయ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. యువకుల్లో విజయ్ టీవీకే పార్టీకి మంచి క్రేజ్ ఉంది.18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్న యువ ఓటర్లలో మెజారిటీ ఓట్లు విజయ్ వైపు మళ్లే అవకాశం ఉంది. ముఖ్యంగా చెన్నై, మదురై, తిరుప్పూర్ వంటి నగరాల్లో టీవీకే బలంగా పుంజుకుంటోంది. చెన్నైలోని కొన్ని నియోజకవర్గాల్లో రెండో అతిపెద్ద పార్టీగా ఎదిగే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి.