Reading Time: < 1 minute

సంగారెడ్డి: భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో బాధను బరించలేక తల్లి తన బిడ్డలను గొంతు నులిమి చంపి అనంతరం తాను ఉరేసుకొని చనిపోయిన సంఘటన సంగారెడ్డి జిల్లా కంది మండలం జుల్కల్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మక్త అల్లూర్ గ్రామంలో మమత(28), ప్రవీణ్(32) అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు మణికంఠ(5), ప్రళయశ్రీ(3) లు ఉన్నారు. దంపతులు కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. రెండు నెలల క్రితం భర్త ప్రవీణ్ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. దీంతో మమత మనోవేదనతో భర్త లేని జీవితం వృధా అని పలుమార్లు వాపోయింది. మమత తల్లిదండ్రులు, ఆమె మేనత్త ఆమెకు దైర్య చెబుతూ చేదోడువాదోడుగా ఉండేవారు. తల్లిదండ్రులు పని నిమిత్తం బయటకు వెళ్లగా మేనత్త పెన్షన్ తీసుకోవడానికి సొంతూళ్లకు వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంతో ఇద్దరు పిల్లల గొంతు నులిమి అనంతరం మమత ఉరేసుకొని చనిపోయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.