
- అవుట్ పేషెంట్, సర్జరీ, ఐసోలేషన్ వార్డులు
- హెచ్ఎండీఏకు నిర్మాణ బాధ్యతలు
హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఆధునిక గోశాల నిర్మాణానికి ప్రభుత్వం పూనుకుంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం యెంకపల్లి గ్రామంలో రూ.157 కోట్లతో గోశాలను నిర్మించనున్నారు. ఈ మేరకు మంచిరేవుల గ్రామంలోని మచిలేశ్వరస్వామి ఆలయంలో సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన చేశారు. పశుసంరక్షణ, పశుసంక్షేమం, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఆధునిక గోశాలను ప్రభుత్వం నిర్మించనుంది.
సంప్రదాయ విలువలను ఆధునిక శాస్త్రీయ విధానాలతో సమన్వయం చేస్తూ పశువుల ఆరోగ్యం, పర్యావరణ స్థిరత్వం, ప్రజల్లో గోసేవపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ)కు ప్రభుత్వం అప్పగించింది.
యెంకపల్లి గ్రామంలోని సర్వే నం.180లో ఉన్న సుమారు 99 ఎకరాల 14 గుంటల భూమిని ఈ ప్రాజెక్టు కోసం కేటాయించింది. ఈ గోశాలలో దాదాపు 1000 గోవులను సంరక్షించేందుకు ఆధునిక సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు. బీఐఎస్ ప్రమాణాల ప్రకారం నిర్మించే గోశాలలో షెడ్లు, క్వారంటైన్ సౌకర్యాలు, అత్యవసర చికిత్స విభాగం, మిల్కింగ్ పార్లర్, పాల ప్రాసెసింగ్ యూనిట్ వంటి మౌలిక వసతులు ఏర్పాటు చేయనున్నట్టు అధికారులు తెలిపారు. అవుట్ పేషెంట్ విభాగం, శస్త్రచికిత్స గది, ఐసోలేషన్ వార్డులు, ఫార్మసీ, ఎక్స్-రే గది, పాథాలజీ ల్యాబ్ తదితర సౌకర్యాలతో ఆధునిక పశువైద్య ఆస్పత్రిని కూడా నిర్మించనున్నారు.
పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత..
పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ పశువుల ఎరువుతో బయోగ్యాస్, సీఎన్‌జీ ఉత్పత్తి చేసే ప్లాంట్, నీటి పునర్వినియోగం కోసం సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్(ఎస్టీపీ), 3-4 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. మేత సాగు కోసం 54 ఎకరాలకు పైగా భూమిలో పచ్చి మేత పంటలు సాగు చేయనున్నారు.
ఇతర సౌకర్యాల్లో పరిపాలనా భవనం, అంతర్గత సీసీ రహదారులు, పార్కింగ్, సిబ్బంది నివాస గృహాలు, గోపూజ కోసం ఆలయ సముదాయం, శాస్త్రీయ వ్యర్థ నిర్వహణ కోసం ఇన్సినరేషన్ యూనిట్ ఏర్పాటు చేయనున్నారు. సందర్శకుల కోసం సమీపంలోని చెరువును అభివృద్ధి చేసి వాకింగ్ ట్రాక్స్, ఓపెన్ ఎయిర్ థియేటర్, పిల్లల ఆట స్థలాలు ఏర్పాటు చేయనున్నట్టు అధికారులు పేర్కొన్నారు.