
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ నుంచి బిఆర్‌ఎస్ శాసన సభ్యులను స్పీకర్ ప్రసాద్‌కుమార్ రెండు రోజుల పాటు లేదా బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యే వరకు సస్పెండ్ చేశారు. బడ్జెట్ పై చర్చకు పదే పదే అడ్డుపడుతున్నారన్న కారణం తో సస్పెండ్ చేశారు. సభ నుంచి సస్పెండ్ అయిన వారిలో కేటీఆర్, హరీశ్‌రావు, జగదీశెడ్డి, కౌశిక్ రెడ్డి, గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యా దవ్, మాధవరం కృష్ణారావు, లక్ష్మారెడ్డి, చింతా ప్రభాకర్, కొత్త ప్రభాకర్రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి, మహిపాల్ రెడ్డి, మాణిక్‌రావు, ప ద్మారావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కల్వకుంట్ల సంజ య్, కాలేరు వెంకటేశ్, విజయుడు, కె.పి.వివేకానంద్, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, అనిల్‌జాదవ్, కోవ లక్ష్మి ఉన్నారు.
శాసనసభలో రెండో రోజు ఆదివారం కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన మైనింగ్ అక్రమాలపై సభా కమిటీ వేయాలని డిమాండ్ చేస్తూ సభ ప్రారంభం నుంచి నిరసన వ్యక్తం చేశారు. దీంతో అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష ఎమ్మెల్యేల వైఖరితో తీవ్ర ఆటంకం ఏర్పడింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ బీఆర్‌ఎస్ సభ్యులు తీరు మార్చుకొని బిల్లులపై చర్చకు సహకరించాలని లేదంటే సస్పెన్షన్ ఎదుర్కొవాలని సూచించారు. అయినప్పటికి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టేందుకు వెళ్లేందుఎకు ప్రయత్నించి గందరగోళం సృష్టించారు. అప్రమత్తమైన మార్షల్స్ బీఆర్‌ఎస్ సభ్యులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో సభలో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి నెలకొంది. దాదాపు అర్ధగంట ఇదే పరిస్థితి కొనసాగగా బీఆర్‌ఎస్ సభ్యుల తీరుపై శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు బీఆర్‌ఎస్ సభ్యులను రెండు రోజుల పాటు సభ నుంచి సస్పెండ్ చేయాలని ప్రతిపాదించారు. అనంతరం స్పీకర్ బడ్జెట్ పై చర్చకు అడ్డు పడుతున్నందుకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేశారు.
ఆధారాలు ఉంటే సిబిసిఐడికి ఇవ్వండి
బిఆర్‌ఎస్ శాసనసభ్యులను సస్పెండ్ చేయకముందు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్ష బిఆర్‌ఎస్ సభ్యులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అక్రమ మైనింగ్ విషయంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయినా, రేవంత్ రెడ్డి కుటుంబమైనా ఇందులో ఎవరున్నా ఆధారాలు ఉంటే సిబిసిఐడి ముందుకు వచ్చి ఇవ్వండి విచారించి చర్యలు తీసుకుంటారని అన్నారు. ఆధారాలుంటే ఎవరిపైనైనా చర్యలు తీసుకుంటామని అన్నారు. మంత్రి పొంగులేటి రాజీనామా చేయాలని బిఆర్‌ఎస్ సభ్యులు పదే పదే డిమాండ్ చేయడంపై ముఖ్యమంత్రి మండిపడుతూ మీరు చెప్పింది వినకపోతే పొంగులేటి రాజీనామా చేయాలా? అంటూ ప్రశ్నించారు. మీ తాతలు దిగొచ్చినా అది జరగదని గట్టిగా తన అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకే పదేళ్ల నుంచి ఇప్పటి వరకు జరిగిన ఖనిజ సంపద దోపిడీ,
అక్రమ మైనింగ్‌పై సీబీసీఐడీ విచారణకు ఆదేశించామని, మీ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నా సీబీసీఐడీ అధికారులకు అందించాలని హరీష్ రావు, కేటీఆర్, ఇతర సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. రాఘవ కన్స్ట్రక్షన్ విషయంలో 2025లో వాస్తవ పరిస్థితులు తెలుసుకుని మైనింగ్ శాఖ పన్నులు రాబట్టుకుందని, ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. దీనిపై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తున్నారని సిఎం చెబుతూ హౌస్ కమిటీ వల్ల జరిగేది ఏముంటుందని అన్నారు. కమిటీ నివేదిక ఇస్తుందని, ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని మళ్లీ పోలీస్ శాఖనే ఆదేశించాల్సి ఉంటుందని అన్నారు. అదే పని ఇప్పుడు సిబిసిఐడికి ఇచ్చామని, అక్కడ మీ దగ్గర ఆధారాలు ఇవ్వాలని చెబుతున్పప్పుడు ఇక హౌస్ కమిటీ ఎందుకని సిఎం ప్రశ్నించారు.
మంత్రి పొంగులేటి రాజీనామా ప్రసక్తే లేదు
హౌస్ కమిటీ వేస్తే మంత్రిని బెదిరించి లొంగదీసుకుని తమ అక్రమాలను బయటపడకుండా చూడాలని ప్రయత్నించడం తప్ప మరేమీ లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో మూడు హౌస్ కమిటీలు వేసి బ్లాక్ మెయిల్ చేసి ఆస్తులు గుంజుకున్నారని, పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించి రాజకీయ లబ్ది పొందారని సిఎం గుర్తు చేశారు. అలా తాము హౌస్ కమిటీ వేసి రాజకీయ లబ్ది పొందాలని చూడడం లేదని అన్నారు. ఒకవేళ సీబీసీఐడీపై నమ్మకం లేకపోతే సీబీఐకి విచారణ అప్పగించాలా చెప్పాలని సిఎం తెలిపారు. బ్లాక్ మెయిల్ చేయడానికే హౌస్ కమిటీ కోరుతున్నారని, ఇక్కడ మీ పప్పులు ఉడకవని ఘాటుగా వ్యాఖ్యానించారు. మంత్రి పొంగులేటి రాజీనామా చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మీరు చెప్పింది వినకపోతే రాజీనామా చేయాలా? మీ తాతలు దిగొచ్చినా అది జరగదని సిఎం తేల్చి చెప్పారు.