పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు కేవలం మనుషులనే కాదు, వన్యప్రాణులను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో వేలాది స్టెప్పీ గద్దలు తమ సహజ వలస మార్గాన్ని మార్చుకుని భారతదేశానికి చేరుకుంటున్నాయి. ప్రస్తుతం జోర్బీర్ సంరక్షణ రిజర్వ్ ప్రాంతం ఈ పక్షులతో నిండిపోవడం విశేషం.
పక్షి శాస్త్రవేత్తల ప్రకారం, సాధారణంగా ఈ స్టెప్పీ ఈగల్స్ రష్యా, మంగోలియా, సెంట్రల్ ఏషియా ప్రాంతాల నుంచి గల్ఫ్ దేశాలకు వలస వెళ్తాయి. అక్కడి నుంచి తిరిగి ప్రయాణిస్తూ కొన్ని ప్రాంతాల్లో తాత్కాలికంగా ఆగుతాయి. అయితే ఈసారి యుద్ధ వాతావరణం కారణంగా ఇరాన్, ఇరాక్ ప్రాంతాల్లో సహజ ఆవాసాలు దెబ్బతినడంతో, ఇవి ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
ఇప్పటికే జోర్బీర్ ప్రాంతంలో సుమారు 4,000కు పైగా గద్దలు ఒకేసారి దర్శనమిచ్చినట్లు, మొత్తం సంఖ్య 5,000 దాటినట్లు అంచనా. ఇది గత ఏడాదితో పోలిస్తే రెట్టింపు. ముఖ్యంగా, ఈసారి వచ్చిన పక్షుల్లో ఎక్కువ భాగం చిన్న వయస్సు గలవి కావడం కూడా శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షిస్తోంది.
ఈ పక్షులు వేల కిలోమీటర్లు ప్రయాణించి సుమారు 20–25 రోజుల్లో భారతదేశానికి చేరుకుంటాయి. సాధారణంగా కజకిస్తాన్, ఇరాన్ మీదుగా యొమన్ వరకు వెళ్లే మార్గాన్ని అనుసరిస్తాయి. అయితే ప్రస్తుత యుద్ధ పరిస్థితుల వల్ల ఈ మార్గం భంగం చెంది, రాజస్థాన్ వైపు మళ్లినట్లు తెలుస్తోంది.
అయితే ఈ భారీ వలసపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో పక్షులు చేరుకోవడం వల్ల పక్షుల వ్యాధులు, ముఖ్యంగా బర్డ్ ఫ్లూ వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అదనంగా, స్థానిక పర్యావరణ సమతౌల్యంపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని చెబుతున్నారు.




