
- మంత్రి పొన్నం ప్రభాకర్
- త్వరలో మహిళలందరికీ చిప్ ఆధారిత ‘స్మార్ట్ కార్డులు’
హైదరాబాద్, వెలుగు: బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించడానికి ఉద్దేశించిన ‘మహాలక్ష్మి’ స్కీమ్ ద్వారా ఆదివారం నాటికి వారు ఏకంగా రూ.10వేల కోట్లను ఆదా చేసుకున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన హైదరాబాద్‌లో ఒక ప్రకటన విడుదల చేశారు. మహిళా సాధికారత దిశగా ఇది పెద్ద అడుగు అని కొనియాడారు. పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు మహిళలు సుమారు 290 కోట్ల సార్లు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారని మంత్రి చెప్పారు. ఇది కేవలం ఉచిత ప్రయాణం మాత్రమే కాదు, రాష్ట్ర ప్రగతిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచే ఒకwww మహా యజ్ఞమని ఆయన అభివర్ణించారు.
మహాలక్ష్మి స్కీమ్ రాకముందు ఆర్టీసీ బస్సుల్లో మహిళల వాటా 40 శాతంగా ఉండగా, ప్రస్తుతం అది 67 శాతానికి పైగా పెరిగిందని పేర్కొన్నారు. ప్రతిరోజూ సగటున 35 లక్షల మంది మహిళలు ఈ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారని వివరించారు. మహాలక్ష్మి పథకాన్ని మరింత పారదర్శకంగా, సరళంగా అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నదని వెల్లడించారు.
కచ్చితమైన గణాంకాల కోసం త్వరలోనే మహిళలకు చిప్ ఆధారిత స్మార్ట్ కార్డులను పంపిణీ చేయనున్నట్టు స్పష్టం చేశారు. పెరిగిన రద్దీకి అనుగుణంగా ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా మరిన్ని కొత్త బస్సులను ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు. మహిళలు ఉచితంగా ప్రయాణించిన టికెట్ల విలువ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆర్టీసీకి చెల్లిస్తున్నదని.. దీనివల్ల సంస్థ ఆర్థికంగా బలోపేతం అవుతుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పథకాన్ని విజయవంతం చేస్తున్న తెలంగాణ మహిళలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.