Reading Time: < 1 minute

తెలంగాణలో గోదావరి పుష్కరాలు 2027 ఏర్పాట్లపై కేబినెట్ సబ్ కమిటీ, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సిఎం ప్రిన్సిపాల్ సెక్రటరీలు శేషాద్రి, శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, డీజీపీ శివధర్ రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. 2027 జూన్ లో గోదావరి పుష్కరాలు జరగనుండటంతో పూర్తి చేయాల్సిన పనులపై.. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరివాహక ప్రధాన ఆలయాలు, పుష్కర ఘాట్ల అభివృద్ధి ప్రణాళికలపై సమీక్షలో చర్చించారు.

ఈ సందర్భంగా పుష్కరాల నేపథ్యంలో చేపట్టాల్సిన పనులకు సంబంధించి రూపొందించిన ప్రణాళికలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఈ క్రమంలో అధికారులకు సిఎం రేవంత్ పలు సూచనలు చేశారు. పుష్కరాల నిర్వహణకు అనువైన ప్రదేశాలను గుర్తించేందుకు టెక్నికల్ ఇంజనీర్ల కమిటీని నియమించాలని సిఎం అధికారులను ఆదేశించారు. ఈ కమిటీ క్షేత్ర స్థాయిలో పర్యటించి 15 లేదా 20 రోజుల్లోగా నివేదికను అధికారుల కమిటీకి అందజేయాలని చెప్పారు. ఇంజనీర్ల కమిటీ నివేదికను అధికారుల కమిటీ పరిశీలించి, పూర్తి అంచనాలతో నివేదికను కేబినెట్ సబ్ కమిటీకి పంపాలని సూచించారు.కేబినెట్ సబ్ కమిటీ ఆమోదం తరువాత ప్రణాళికలకు సంబంధించిన నివేదికపై కేబినెట్ తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. శాశ్వత, తాత్కాలిక పనులను ప్రాధాన్యతల వారీగా పూర్తి చేసేలా ప్రణాళికలు ఉండాలని సూచించారు. వివిధ విభాగాల మధ్య సమన్వయ లోపం తలెత్తకుండా ప్రజా భవన్ లో ప్రత్యేకంగా వార్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. పుష్కరాల ఏర్పాట్లలో భాగంగా ప్రధాన దేవాలయాలు, పర్యాటక ప్రదేశాల్లో ఘాట్ల విస్తరణ చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్న సిఎం చెప్పారు. రోడ్లు, వివిధ ప్రాంతాల మధ్య కనెక్టివిటీ విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సిఎం రేవంత్ సూచించారు.