
నక్సలిజం ముగిస్తే.. విప్లవ భావన కూడా సమాధి అవుతుందా? లేక అది మరింత లోతుల్లోకి వెళ్లి మరో రూపంలో మళ్లీ పుట్టుకొస్తుందా? ఒక వర్గానికి ఇది శోషితుల స్వరంగా, అణగారిన వర్గాల ఆశగా కనిపిస్తే.. మరొక వర్గానికి రక్తపాతం, హింసగా అనిపిస్తుంది. దశాబ్దాలుగా దేశాన్ని వేధిస్తున్న ఈ సమస్యకు మార్చి 31, 2026 లోపు నక్సల్-ముక్త భారత్ అనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా లక్ష్యం నిజంగా ముగింపు రేఖనా? లేక ఒక దశ ముగిసిన సంకేతమా? ఈ ప్రశ్నలకు సమాధానం కేవలం తుపాకుల శబ్దాల్లో కాదు.. సమాజం గుండెల్లో దాగి ఉన్న అసమానతల్లో ఉంది. 1967లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని నక్సల్బరి గ్రామంలో మొదలైన ఈ తిరుగుబాటు ఉద్యమం భూమి, హక్కులు, విముక్తి అనే నినాదాలతో అణగారిన వర్గాలను ఒక్కటి చేసింది. భూస్వామ్య వ్యవస్థపై రైతులు, కూలీలు పిడికిలి బిగించారు. కొన్ని స్థానిక విజయాలు సాధించారు. కానీ కాలం మారినా, వారి పోరాట విధానం మారలేదు. మార్పుకు అనుగుణంగా తమ శైలిని మార్చుకోలేకపోయారు. ఎన్నో ఉద్యమాలు కాలక్రమేణా కనుమరుగయ్యాయి. కానీ విప్లవం? అది ప్రజల గుండెల్లోని అశాంతి, అన్యాయంపై తిరగబడే ఉక్కు పిడికిలి. అది ఎప్పటికీ పూర్తిగా చనిపోదు.
నక్సలిజం కేవలం తుపాకులు, గెరిల్లా యుద్ధం మాత్రమే కాదు. ఇది ఒక భావజాలం అణచివేత, శోషణకు వ్యతిరేకంగా పుట్టిన ఆకాంక్ష. ప్రభుత్వాలు దళాలను ఎన్‌కౌంటర్లు, ఆపరేషన్ల ద్వారా తుడిచిపెట్టవచ్చు. కానీ భావజాలాన్ని బుల్లెట్లతో చంపలేవు. అది ప్రజల మనసుల్లో, చర్చల్లో, సాహిత్యంలో, ఉద్యమాల్లో జీవించి ఉంటుంది. 2025 మేలో అబూజ్‌మడ్‌లో మావోయిస్టు పార్టీ జనరల్ సెక్రటరీ నంబాల కేశవరావు (బసవరాజు) 27 మంది సహచరులతో ఎన్‌కౌంటర్‌లో మరణించారు. 2025 అక్టోబర్‌లో మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ అబయ్, తక్కల్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న బృందం 208 మంది దళ సభ్యులతో భారీగా లొంగిపోయారు. ఫిబ్రవరి 2026లో దేవుజి అలియాస్ తిప్పిరి తిరుపతి, మల్లా రాజిరెడ్డి, నూనె నరసింహారెడ్డి, బడే చొక్కారావు వంటి టాప్ నాయకులు సరెండర్ అయ్యారు. మార్చి 24న పాపారావు 17మంది జట్టుతో లొంగిపోయారు. చత్తీస్‌గఢ్‌లో గత రెండేళ్లలో వేలాది సరెండర్లు, అబూజ్‌మడ్‌లో భద్రతా దళాల ఆధిపత్యం. కానీ భగత్ సింగ్, అంబేద్కర్ భావజాలాలు ఎలా ఇప్పటికీ జీవించి ఉన్నాయో, నక్సలిజం భావజాలం కూడా అసమానతలు, అన్యాయాలు ఉన్నంతవరకు మరో రూపంలో కొనసాగుతుంది. హింసను అణచడం తాత్కాలికం. అసమానతలను తొలగించడమే శాశ్వత మార్గం.
నక్సల్స్ చర్చలకు సిద్ధమని పలుమార్లు ప్రకటించినా, ప్రభుత్వం మార్చి 31, 2026 లోపు పూర్తి నిర్మూలన లక్ష్యంతో లా అండ్ ఆర్డర్ విధానాన్ని కఠినంగా అమలు చేస్తోంది. గత నాలుగు నెలల్లో సుక్మా, బీజాపూర్, నారాయణపూర్‌లో ఎన్‌కౌంటర్లు, సరెండర్లు పెరిగాయి. అబూజ్‌మడ్‌లో ఒకప్పటి రెడ్ కారిడార్ ఇప్పుడు భద్రతా దళాల చేతుల్లోకి వచ్చింది. మావోయిస్టు నాయకత్వం దాదాపు కుప్పకూలింది. కానీ ఇది నిజమైన శాంతి కాదు కదా? చర్చలు, మానవ హక్కులు, అభివృద్ధి మార్గాలు విస్మరించబడ్డాయని మేధావులు, పౌర హక్కుల సంఘాలు వాదిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ఉంది. అన్యాయాలపై స్పందించే బాధ్యత ప్రభుత్వానిది.
తుపాకీ మాత్రమే కాకుండా, ప్రజల గుండెల్లో మార్పు తీసుకురాగల అభివృద్ధి, న్యాయం అందించడమే నిజమైన శాంతి మార్గం. కేంద్ర ప్రభుత్వం నక్సలిజాన్ని దేశ అంతర్గత భద్రతా సమస్యగా చూసి, పోలీసు- సైనిక చర్యలతో ఎదుర్కొంటోంది. గత నాలుగు నెలల్లో ఈ వ్యూహం ఫలితాలు ఇస్తోంది. లీడర్‌షిప్ దెబ్బతిన్నది, సరెండర్లు పెరిగాయి. కానీ జస్టిస్ జీవన్ రెడ్డి కమిషన్ (2008) చెప్పినట్లు, చర్చలే స్థిరమైన పరిష్కారం. హింసకు హింసతో స్పందించడం తాత్కాలిక విజయం మాత్రమే. సమస్య మూలం భూమి సమస్యలు, ఆదివాసీల హక్కుల దోపిడీ, అట్టడుగు వర్గాల వెనుకబాటుతనం – పరిష్కరించకపోతే, తిరుగుబాటు మరో రూపంలో బయటపడుతుంది. నక్సలిజం పుట్టుకకు కారణం దళితులపై అత్యాచారాలు, గిరిజనుల భూముల దోపిడీ, పేదలకు అవకాశాల లోపం. ఇవి ఇప్పటికీ పూర్తిగా తొలగలేదు. బలప్రయోగంతో ఒక రూపాన్ని అణచవచ్చు. కానీ అన్యాయం బతికి ఉంటే, ఆ భావన మళ్లీ మరో రూపంలో వస్తుంది. న్యాయం లేని సమాజంలో శాంతి కేవలం భ్రమ మాత్రమే.
ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదు అని చెబుతున్న ప్రభుత్వమే హింసాత్మక చర్యలు చేపట్టడం ఏమిటి? అణగారిన వర్గాల బాధలు, దోపిడీ, దమనం సహించలేక నక్సల్స్ ఉద్యమించారు. ప్రభుత్వం వారి హక్కులు, న్యాయం, అభివృద్ధి అందిస్తే నక్సలిజం ఎందుకు పుట్టాలి? ప్రజాస్వామ్యం అంటే చర్చ, సమన్వయం, పరిష్కారం. హింస అది ఎవరి నుంచైనా వచ్చినా – సమస్యను పెంచుతుంది తప్ప తగ్గించదు. మార్చి 31, 2026 తర్వాత ప్రభుత్వం విజయాన్ని ప్రకటించవచ్చు. గణాంకాలు మెరుగయ్యాయని చెప్పవచ్చు. కానీ నిజమైన ప్రశ్న అక్కడితో ముగియదు. తుపాకుల శబ్దం ఆగిపోవచ్చు.. కానీ అన్యాయం ఆగిపోయిందా? అసమానతలు చెరిగిపోయాయా? అణగారినవారికి న్యాయం అందిందా? ఇవే అసలు పరీక్షలు. విప్లవం అంటే కేవలం గన్ కాదు.. అది అన్యాయం చూసిన ప్రతి హృదయంలో మెదిలే ఆగ్రహం. ఆ ఆగ్రహానికి సమాధానం న్యాయం అయితేనే శాంతి శాశ్వతం అవుతుంది. లేకపోతే.. చరిత్ర మళ్లీ తనను తాను రిపీట్ చేసుకునే రోజు దూరంలో ఉండదు.
– కాలగిరి శ్రీనివాస్‌రెడ్డి