
ప్రస్తుత కాలంలో పెరుగుతున్న ఖర్చులు, అనిశ్చిత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో 30 ఏళ్ల వయసుకల్లా ఆర్థికంగా స్థిరపడడం అత్యంత కీలక లక్ష్యంగా మారింది. ఈ దశలో సరైన జీతం, క్రమబద్ధమైన సేవింగ్స్, సమతుల్య పెట్టుబడులు ఉండటం భవిష్యత్తు భద్రతకు బలమైన పునాది వేస్తాయని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. నిపుణుల అంచనాల ప్రకారం 30 ఏళ్ల వయసుకల్లా ఒక వ్యక్తి తన వార్షిక జీతానికి కనీసం 1 నుంచి 1.5 రెట్లు సేవింగ్స్‌గా కూడబెట్టుకోవాలి. ఉదాహరణకు వార్షిక ఆదాయం రూ.6 లక్షలు ఉంటే, కనీసం రూ.6–9 లక్షల వరకు సేవింగ్స్ ఉండటం మంచిది. ఇది అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక రక్షణగా పనిచేస్తుంది.
జీతం విషయంలో కచ్చితమైన సంఖ్య ఉండకపోయినా, జీవన వ్యయాలను దృష్టిలో ఉంచుకుని కనీసం నెలకు రూ.40,000 నుంచి రూ.1 లక్ష మధ్య ఆదాయం ఉండటం సాధారణంగా సరైన స్థాయి అని భావిస్తున్నారు. అయితే ఇది నగరం, జీవనశైలి ఆధారంగా మారవచ్చు. ముఖ్యంగా జీతం ఎంత ఉన్నా దానిలో కనీసం 20–30 శాతం సేవింగ్స్‌గా మిగిలేలా చూసుకోవడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. పెట్టుబడుల విషయంలో కేవలం సేవింగ్స్‌పై ఆధారపడకుండా, దీర్ఘకాలిక వృద్ధి కోసం విభిన్న పెట్టుబడి సాధనాలను ఉపయోగించడం అవసరం. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) వంటి సాధనాల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా కాంపౌండింగ్ ప్రయోజనాన్ని పొందవచ్చు. ముఖ్యంగా, యువ వయసులో రిస్క్ తీసుకునే సామర్థ్యం ఎక్కువగా ఉండటం వల్ల ఈక్విటీ పెట్టుబడులు దీర్ఘకాలంలో మెరుగైన ఫలితాలను ఇవ్వగలవు.
ఎమర్జెన్సీ ఫండ్ కూడా కీలకం. కనీసం 6 నెలల ఖర్చులకు సరిపడే నిధిని ప్రత్యేకంగా ఉంచుకోవడం అవసరం. ఇది ఉద్యోగ నష్టం లేదా అనుకోని ఖర్చుల సమయంలో ఆర్థిక ఒత్తిడిని తగ్గిస్తుంది. మొత్తానికి 30 ఏళ్ల వయసుకల్లా ఆర్థికంగా బలపడాలంటే క్రమశిక్షణతో సేవ్ చేయడం, సరైన పెట్టుబడులు పెట్టడం, ఖర్చులను నియంత్రించడం అత్యంత ముఖ్యమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి