Reading Time: < 1 minute
Samantha Comments On Women Safety And Rights In Film Industry 2026

టాలీవుడ్ క్వీన్ సమంత ప్రస్తుతం సినిమాలతో పాటు మహిళా సాధికారతపై తన గంభీరమైన గొంతుకను వినిపిస్తోంది. ఇటీవల హాలీవుడ్ రిపోర్టర్ నిర్వహించిన ‘ఉమెన్ ఇన్ ఎంటర్‌టైన్‌మెంట్ 2026’ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, సినీ రంగంలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడారు. గతంలో మలయాళ చిత్ర పరిశ్రమలో ‘హేమ కమిటీ’ రిపోర్ట్ సృష్టించిన కలకలం నేపథ్యంలో, తెలుగు ఇండస్ట్రీలోనూ మహిళా రక్షణ కోసం ప్రత్యేక కమిటీ ఉండాలని డిమాండ్ చేసిన సమంత, ఇప్పుడు మరోసారి తన అభిప్రాయాలను బలంగా చాటారు.

Also Read : NBK111: బాలయ్య సినిమాలో లక్ష్మీ రాయ్.. ఈసారి క్యారెక్టర్ మామూలుగా ఉండదట!

ఈ కార్యక్రమంలో సమంత మాట్లాడుతూ.. ‘సమాజంలో మహిళలు ఇతరుల కోసం తమ ఇష్టాలను, లక్ష్యాలను వదులుకుంటున్నారు. దురదృష్టవశాత్తూ ఇదొక త్యాగం అని గుర్తించలేనంతగా మనం దీనికి అలవాటు పడిపోయాం. ఏదైనా చిన్న విషయం జరిగితే పురుషుల కంటే మహిళలే పది రెట్లు ఎక్కువగా క్షమాపణలు చెబుతుంటారు. ఇకపై దేనికీ రాజీ పడొద్దు, క్షమాపణలు చెప్పడం మానుకోండి. ఇది మీరు కష్టపడి సంపాదించుకున్న గౌరవం’ అని పిలుపునిచ్చారు. మహిళలు తమ వ్యక్తిత్వాన్ని చాటుకోవాలే తప్ప, అనవసరంగా తలవంచకూడదని ఆమె స్పష్టం చేశారు.

అలాగే భారతదేశంలో సినీ రంగం మహిళలకు అంత సురక్షితం కాదని సమంత ఆవేదన వ్యక్తం చేశారు.. ‘ఉద్యోగ భద్రత, పనిగంటలు, రక్షణ వంటి ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ మహిళలు ఇండస్ట్రీలోకి వస్తున్నారంటే వారికి అపారమైన ధైర్యం ఉందని అర్థం. ఇక్కడ పురుషుల కంటే మహిళలే ఎక్కువ కష్టపడాల్సి వస్తోంది. అలాగే సినిమాలను మేల్ ఓరియెంటెడ్, లేడీ ఓరియెంటెడ్ అని విడదీసి చూడటం ఆపాలి. హీరోయిన్ అంటే కేవలం గ్లామర్ కోసమో, హీరో చుట్టూ తిరగడానికో కాదు.. కథానాయకుడిలో ధైర్యాన్ని నింపే పవర్‌ఫుల్ పాత్రలు ఉండాలి. అన్నింటికంటే ముఖ్యంగా షూటింగ్ సెట్‌లో మహిళలకు సురక్షితమైన వాతావరణం కల్పించాలి” అని సమంత కోరారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో పాటు, చిత్ర పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీశాయి.