Reading Time: < 1 minute

కల్తీ బేకరీ ఉత్పత్తులు తయారు చేసి విక్రయిస్తున్న వ్యక్తిని గోల్కొండ టాస్క్‌ఫోర్స్, గుడిమల్కాపూర్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ. 12,54,280 విలువైన మైదాపిండి, చెక్కెర బస్తాలు, సొత్తు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్, కేడి కాలనీకి చెందిన అహ్మద్ రజా బేకరీ ఉత్పత్తులను తయారు చేసే వ్యాపారం చేస్తున్నాడు. నిందితుడు అహ్మద్ రజా ఎటువంటి లైసెన్స్ లేకుండా, అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో తక్కువ నాణ్యత గల ముడి పదార్థాలను ఉపయోగించి ఉస్మానియా బిస్కెట్లు, రస్కులు,బటర్ బన్ వంటి ఉత్పత్తులను తయారు చేస్తున్నాడు.

వీటిని నగరంలోని వివిధ కిరాణా దుకాణాలు, హోటళ్లు, కేఫ్‌లకు సరఫరా చేస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతూ అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నాడు. ఈ సమాచారం తెలియడంతో పోలీసులు తయారీ కేంద్రంపై దాడి చేశారు. నిందితుడిని అరెస్టు చేసి కేసు దర్యాప్తు కోసం గుడిమల్కాపూర్ పోలీసులకు అప్పగించారు. గోల్కొండ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్‌స్పెక్టర్ ఆర్. వెంకటేష్, గుడిమల్కాపూర్ ఇన్స్‌స్పెక్టర్ రామయ్య, ఎస్సైలు కె. వెంకటరమణ, సురేష్, సిబ్బంది దాడులు చేశారు.