Reading Time: 2 minutes

మన తెలంగాణ/హైదరాబాద్: సిఎం రేవంత్‌రెడ్డి కి బిఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు సవాల్ విసిరారు. అవినీతి ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమా? అని ప్రశ్నించారు. త న బావమరిది, తమ్ముడిపై సిఎం ఆరోపణలు చేశారని, అయితే, సిఎం తమ్ముడు, బావమరిదిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని గుర్తు చేశారు. తన బావమరిది, తమ్ముడిపై వచ్చిన ఆరోపణలపై వి చారణకు సిద్ధం అని ప్రకటించారు. సిఎం తమ్ము ళ్లు, బావమరిదిపై వచ్చిన ఆరోపణలపై విచారణకు సిద్ధమా..? అంటూ సవాల్ విసిరారు. హౌస్ కమిటీ కాదు, సిబిసిఐడి కాదు, నేరుగా హైకోర్టు సి ట్టింగ్ జడ్జితో విచారణకు తాను సిద్ధం అని, సిఎం సిద్ధమా..? అంటూ సూటిగా ప్రశ్నించారు. 20 అంశాలపై విచారణ చేయించాలని తాము స్పీకర్‌కు లేఖ ఇచ్చామని, వీటిపైన సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం బిఆర్‌ఎస్ నేతలతో కలి సి హరీశ్‌రావు మీడియా సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,

రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటిని కాపాడేందుకు వంద అబద్ధాలు ఆడి సిఎం రేవంత్ రెడ్డి దొరికిపోయారని పేర్కొన్నారు. ఏ పని కోసం తానెప్పుడూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఫోన్ చేయలేదని స్ప ష్టం చేశారు. పొంగులేటి కంపెనీ అవినీతికి పాల్పడిందని అందరికీ అర్థమైందని చెప్పారు. తప్పు జరిగిందని సిఎం, మైనింగ్ శాఖ మంత్రి అసెంబ్లీలోనే ఒప్పుకున్నారని తెలిపారు. ప్రభుత్వం డిఫెన్స్‌లో పడింది కాబట్టి ముఖ్యమంత్రి ఎదురు దాడి చేస్తున్నారని హరీష్‌రావు ఆరోపించారు. సమాధా నం లేదు కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారు. పొంగులేటి మంత్రిగా ఉంటే విచారణ సజావుగా సాగదు అని, అందుకే మంత్రికి డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు. మంత్రికి రూ.28 లక్షల జరిమానా వేశారని, ఆ జరిమానా కట్టలేదని, అయినా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. సభలో ఒక తప్పును కప్పి పుచ్చుకోవడానికి పది తప్పులు చేశారని విమర్శించారు. మీటర్లు లేకపోవడంతో డీజిల్ జనరేటర్లతో నడుపుకోమని అనుమతి ఇచ్చామని అన్నారని పేర్కొన్నారు.

ప్రశ్నిస్తున్నందుకే మాపై కక్షగట్టారు

హుజూరాబాద్ ఎంఎల్‌ఎ కౌశిక్‌రెడ్డిపై పగబట్టి సిఎం రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని హరీష్‌రావు ఆరోపించారు. ప్రభుత్వ అవినీతిపై ప్రశ్నిస్తున్నందుకే కౌశిక్‌రెడ్డిపై కక్ష గట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో నోటితో చెప్పలేని భాష మాట్లాడిన రేవంత్ రెడ్డిని ఎథిక్స్ కమిటీకి ముందు నిలబెట్టాలని ఘాటు విమర్శించారు. ప్రశ్నించే గొంతుకైన కౌశిక్ రెడ్డిని ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేస్తామని బెదిరించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారు. మొదటి నుంచే కౌశిక్ రెడ్డి ఈ ప్రభుత్వ వైఫల్యాలను నిగ్గు తేల్చుతూ ప్రశ్నిస్తున్నారని, గట్టిగా మాట్లాడుతున్నందుకే ఆయనపై కక్షతో వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను పెట్టి ఇంటిపై దాడులు చేయించారని, సిబిసిఐడి విచారణలు పెట్టారు, అనేక అక్రమ కేసులు నమోదు చేశారని అన్నారు. కానీ, కోర్టులే ఆ కేసుల్లో నిజం లేదని గుర్తించి పలుమార్లు బెయిల్ ఇచ్చాయని గుర్తు చేశారు. ఇది కౌశిక్ రెడ్డి మీద దాడి కాదు..ప్రశ్నించే గొంతుల మీద దాడి..ఇది ప్రజాస్వామ్యంపై దాడి అని పేర్కొన్నారు.