Reading Time: 2 minutes

పర్యాటక శాఖలో అక్రమాలు!… ఒకవైపు నకిలీ టికెట్ల దందా.. మరోవైపు ఇంధనం చోరీ

Caption of Image.
  •     సాగర్‌‌లో నకిలీ ఎంఆర్ బుక్ 
  •     టికెట్లు లేకుండానే బోటింగ్, డీజిల్, రిపేర్ల పేరిట దోపిడీ
  •     2024లో బోటింగ్ ద్వారా రూ.14.60 కోట్ల ఆదాయం 
  •     2025లో  రూ.13.12 కోట్లకు పడిపోయిన ఇన్​కం.. 
  •     గతేడాదితో పోలిస్తే రూ.1.48 కోట్లకు గండి
  •     పర్యాటకులు పెరిగినా.. తగ్గిన కలెక్షన్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే.. కిందిస్థాయి అధికారులు, సిబ్బంది మాత్రం ఆ శాఖ ఆదాయానికి గండి కొడుతున్నారు. పర్యాటక ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పిస్తూ ఏకో టూరిజం, కేంద్ర నిధులపై సర్కార్ దృష్టిసారిస్తుంటే.. క్షేత్రస్థాయిలో చేతివాటం ప్రదర్శిస్తూ ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేస్తున్నారు. కాగా, ఇటీవల బోటింగ్ విభాగంలో నకిలీ ఎంఆర్ బుక్​ కలకలం సృష్టిస్తోంది. కొంతకాలంగా బోటింగ్​లో ఈ దందా కొనసాగుతుండటం చర్చానీయాంశంగా మారింది. 

రాష్ట్రవ్యాప్తంగా 27 పర్యాటక ప్రాంతాల్లో మొత్తం 99 బోట్లను టూరిజం శాఖ నడుపుతోంది. హుస్సేన్ సాగర్, దుర్గం చెరువు, నాగార్జున సాగర్, లక్నవరం వంటి ప్రాంతాల్లో పర్యాటకుల రద్దీ రోజురోజుకూ పెరుగుతున్నది. కానీ, టూరిజం శాఖ లెక్కలు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయి. 2024లో బోటింగ్ ద్వారా రూ.14.60 కోట్ల ఆదాయం రాగా.. 2025లో  రూ.13.12 కోట్లకు పడిపోయింది. అంటే ఏడాది కాలంలోనే రూ.1.48 కోట్ల ఆదాయం తగ్గింది. పర్యాటకులు పెరుగుతున్నా.. ఆదాయం ఎందుకు తగ్గుతోందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

టికెట్ లేదు.. లెక్కా పత్రం లేదు..

బోటింగ్ కేంద్రాల్లో ఇన్ చార్జులు, మేనేజర్లు సిబ్బందితో కుమ్మక్కై పర్యాటక శాఖకు రావాల్సిన ఆదాయాన్ని కాజేస్తున్నారనే ఆరోపణలొస్తున్నాయి. స్పీడ్ బోటులో ఒక్కరికి రూ. 500, ఇతర బోట్లలో రూ. 200 పైగా చార్జ్ తీసుకుంటున్నారు. ప్రతి వంద మందిలో సుమారు 20 నుంచి 30 మందికి టికెట్లు ఇవ్వకుండానే డబ్బులు తీసుకుని బోట్లలోకి అనుమతిస్తున్నారని సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హుస్సేన్ సాగర్, దుర్గం చెరువు, సరూర్ నగర్ చెరువుల వద్ద ఏండ్లుగా తిష్టవేసిన సిబ్బంది ఈ అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. 

నిబంధనల ప్రకారం మూడేళ్లకోసారి బదిలీ చేయాల్సి ఉన్నా.. ఉన్నతాధికారుల అండ దండలతో వీరు అక్కడే కొనసాగుతుండటం విశేషం. మరోవైపు.. బోట్ల నిర్వహణలోనూ అక్రమాలు సాగుతున్నాయి. ఒక ట్రిప్పుకు 2 నుంచి 3 లీటర్ల డీజిల్ అవసరమైతే.. బిల్లుల్లో మాత్రం అదనంగా మరో 2 లీటర్లు రాస్తున్నట్లు సమాచారం. రోజుకు 10 ట్రిప్పులు తిరిగితే..  కేవలం 8 ట్రిప్పులనే రికార్డుల్లో చూపిస్తూ.. మిగిలిన 2 ట్రిప్పుల ఆదాయాన్ని నొక్కేస్తున్నారు. చిన్నపాటి రిపేర్లు వచ్చినా రూ.లక్షల్లో బిల్లులు పెడుతూ ప్రభుత్వ ధనాన్ని కాజేస్తున్నారనే ఆరోపణలున్నాయి.

నకిలీ టికెట్ బుకింగ్​ కలకలం

నాగార్జున సాగర్‌‌లో  బోటింగ్ ఇన్​చార్జ్ సొంతంగా నకిలీ ఎంఆర్ బుక్​ను ప్రింట్​చేసి వసూళ్లకు పాల్పడినట్లు ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్ తనిఖీల్లో తేలడం కలకలం సృష్టిస్తోంది. ప్రభుత్వ రశీదులకు బదులు ఈ నకిలీ రశీదులు ఇచ్చి రూ.లక్షలు కాజేశారని గుర్తించారు. దీంతో ఆయనను బాధ్యతల నుంచి తొలగించి వేరొకరికి తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు. అయితే, శాఖలో జరుగుతున్న అక్రమాలను అరికట్టాల్సిన ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్ విభాగం నామ మాత్రంగా పనిచేస్తుందని విమర్శలున్నాయి.

మరోవైపు శాఖకు ఈడీ లేకపోవడంతో పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయనే చర్చ జరుగుతున్నది. ఇప్పటికైనా మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ వ్యవహారంపై దృష్టిసారించి ఏళ్ల తరబడి ఒకేచోట పనిచేస్తున్నవారిని బదిలీ చేయాలని, టిక్కెట్లలో అక్రమాలు జరగకుండా ఆన్​లైన్ విధానం అమలు చేయాలని పర్యాటకులు కోరుతున్నారు.

©️ VIL Media Pvt Ltd.