
ఏపీ ప్రజలకు రైల్వేశాఖ తీపికబురు అందించింది. రాష్ట్రంలో కొత్త రైల్వే లైన్ నిర్మించనున్నట్లు ప్రకటించింది. పీఎం గతిశక్తి పథకం ద్వారా కొత్త రైల్వే లైన్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త లైన్ రామాయపట్నం పోర్ట్ నుంచి తెట్టు రైల్వే స్టేషన్ వరకు ఉండనుంది. 5.5 కిలోమీటర్ల దీని వల్ల పోర్ట్‌కు అనుసంధానం పెరుగుతుంది. ఈ కొత్త రైల్వే లైన్ పనులను వేగవంతం చేయనున్నట్లు పార్లమెంట్‌లో కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. రాయామపట్నం పోర్ట్ అభివృద్దిలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఆ పథకం కింద నిర్మాణం
నెల్లూరు జిల్లాలోని రామాయట్నం పోర్ట్ నుంచి తెట్టు రైల్వే స్టేషన్ మధ్య ఈ కొత్త రైల్వే లైన్ ఉంటుందని స్పష్టం చేశారు. పీఎం గతిశక్తి మల్టీ మోడల్ కార్గో టెర్మినల్ పథకం కింద ఈ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు వివరించారు. రామాయపట్నం పోర్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఈ పనులను చేపట్టనుందని తెలిపారు. విజయవాడ-గూడూరు ప్రధాన లైన్ పైన ఉన్న తెట్టు రైల్వే స్టేషన్ ద్వారా రామాయపట్నం పోర్ట్‌కు కనెక్టివిటీ రానుంది. దీని వల్ల సరుకు రవాణాలో మరింత వేగం పెరగనుంది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ బీద మస్తాన్ రావు కొత్త రైల్వే లైన్‌పై ప్రశ్నించారు. ఈ సందర్భంగా రైల్వేమంత్రి అశ్వని వైష్ణవ్ సమాధానమిచ్చారు.