ప్రకృతి ఎప్పుడూ మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. మనం రోజూ చూసే జంతువులు, పక్షులు ఒక్కోసారి విభిన్నమైన రంగుల్లో కనిపిస్తూ విస్తుగొలుపుతుంటాయి. నల్లగా ఉండే కాకి తెల్లగా కనిపించినా.. గంభీరంగా ఉండే సింహం మంచులా మెరిసిపోతున్నా అది ప్రకృతి లీల అనుకుంటాం. కానీ ఈ అరుదైన రంగుల వెనుక బలమైన శాస్త్రీయ కారణాలు ఉన్నాయి.
తెల్ల కాకి: కాకి అనగానే మనకు నలుపు రంగే గుర్తొస్తుంది. కానీ ప్రపంచంలో తెల్ల కాకులు కూడా ఉన్నాయి. ఇది ఏదో కొత్త జాతి కాదు.. అల్బినిజం లేదా ల్యూసిజం అనే జన్యుపరమైన మార్పు వల్ల కాకులు తెల్లగా మారుతాయి. కరేబియన్ దీవుల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. మన దేశంలో ఇవి కనిపించడం చాలా అరుదు. అందుకే వీటిని చూడటం ఒక ప్రత్యేక అనుభవంగా భావిస్తారు.
తెల్ల నెమళ్లు: రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ వంటి ప్రాంతాల్లో కనిపించే తెల్ల నెమళ్లు పర్యాటకులను కట్టిపడేస్తాయి. ఇవి కూడా ల్యూసిజం వల్లే తెల్లగా మారుతాయి. మన దేశంలో వీటిని చూడటం శుభప్రదంగా భావిస్తారు.ప్రకృతిలో రంగుల వింతలు ఇక్కడితో ఆగవు. అస్సాం, భూటాన్ అడవుల్లో మెరిసిపోయే బంగారు రంగు కోతులు కనిపిస్తాయి. ఇవి అత్యంత అరుదైన జాతిగా గుర్తింపు పొందాయి.
తెల్ల సింహాలు: దక్షిణ ఆఫ్రికా అడవుల్లో, కొన్ని జంతు ప్రదర్శనశాలల్లో మాత్రమే కనిపించే ఈ తెల్ల సింహాలు అత్యంత అరుదైనవి. ఇవి నీలం లేదా లేత రంగు కళ్లతో ఎంతో గంభీరంగా ఉంటాయి. అమెజాన్ నదిలో కనిపించే గులాబీ రంగు డాల్ఫిన్లు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. వీటి చర్మంలోని రక్తనాళాల వల్లే వీటికి ఆ రంగు వస్తుంది.
తెల్ల ఏనుగు: థాయిలాండ్, మయన్మార్ దేశాల్లో తెల్ల ఏనుగులను పవిత్రంగా, రాజరికానికి చిహ్నంగా భావిస్తారు. ఇవి పూర్తిగా తెల్లగా కాకుండా లేత గులాబీ లేదా తెలుపు మచ్చలతో ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఈ అరుదైన జీవుల ఉనికి మన పర్యావరణ సమతుల్యతకు ఎంతో ముఖ్యం. వేగంగా పరిగెత్తే నల్ల జింకల నుండి శాంతంగా ఉండే శ్వేత ఏనుగుల వరకు.. ఈ జీవవైవిధ్యాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత.




