Reading Time: 2 minutes
Abhinandan Singh : ఎవరీ అభినందన్ సింగ్? రంజీ మ్యాచ్ ఆడకుండానే ఆర్సీబీ టీమ్‌లోకి ఎలా వచ్చాడు?

Abhinandan Singh : ఐపీఎల్ 2026 సీజన్ గ్రాండ్ ఓపెనింగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో బెంగళూరు హైదరాబాద్ పై ఘన విజయం సాధించింది. అయితే, అందరి దృష్టి ఆర్సీబీ ప్లేయింగ్ 11లో ఉన్న ఒక కొత్త పేరుపై పడింది. ఆ పేరే అభినందన్ సింగ్. అసలు ఎవరీ అభినందన్? ఒక్క ఫస్ట్ క్లాస్ మ్యాచ్ కూడా ఆడకుండా నేరుగా ఐపీఎల్ బరిలోకి ఎలా వచ్చాడన్నది ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే అభినందన్ సింగ్ పేరు మారుమోగిపోయింది. ప్రాక్టీస్ సెషన్లలో కింగ్ కోహ్లీని రెండుసార్లు అవుట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. కోహ్లీ వంటి మేటి బ్యాటర్‌ను ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఇబ్బంది పెట్టడం చూసిన ఆర్సీబీ మేనేజ్‌మెంట్, అతనిపై నమ్మకం ఉంచి నేరుగా తొలి మ్యాచ్‌లోనే అవకాశం ఇచ్చింది. నెట్ బౌలర్‌గా వచ్చి ఇప్పుడు ప్రధాన బౌలర్‌గా ఎదగడం అభినందన్ ప్రతిభకు నిదర్శనం.

అభినందన్ సింగ్ ప్రయాణం చాలా విచిత్రంగా సాగింది. సాధారణంగా ఏ ఆటగాడైనా రంజీ ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ వంటి దేశవాళీ టోర్నీల్లో రాణించి ఐపీఎల్‌కు ఎంపికవుతారు. కానీ అభినందన్ ఇప్పటి వరకు ఒక్క రంజీ మ్యాచ్ కానీ, లిస్ట్-ఏ మ్యాచ్ కానీ ఆడలేదు. అతను కేవలం ఉత్తరప్రదేశ్ టి20 లీగ్ (UP T20 League) ద్వారా తన టాలెంట్ నిరూపించుకున్నాడు. 2024 యూపీ టి20 లీగ్‌లో లక్నో ఫాల్కన్స్ తరపున 10 ఇన్నింగ్స్‌ల్లో 15 వికెట్లు తీసి సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు.

2025లో జరిగిన మెగా వేలంలో అభినందన్ సింగ్‌ను ఆర్సీబీ కేవలం రూ.30 లక్షలకు దక్కించుకుంది. గత సీజన్‌లో అతనికి ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం కూడా రాలేదు. అయినప్పటికీ, అతని వేగం, బౌలింగ్ శైలిని గమనించిన ఆర్సీబీ మేనేజ్‌మెంట్ 2026 సీజన్ కోసం అతన్ని రిటైన్ చేసుకుంది. 28 ఏళ్ల ఈ ఫాస్ట్ బౌలర్, తన 29వ పుట్టినరోజుకు సరిగ్గా రెండు రోజుల ముందు ఐపీఎల్ డెబ్యూ చేయడం విశేషం. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈ కుర్రాడు తన వేగంతో ఐపీఎల్ ప్రపంచాన్ని శాసిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.

అభినందన్ సింగ్ కథ ప్రతీ యువ క్రికెటర్‌కు స్ఫూర్తిదాయకం. దేశవాళీ క్రికెట్ ఆడకపోయినా, దొరికిన చిన్న అవకాశాన్ని అందిపుచ్చుకుని ప్రపంచంలోనే అతిపెద్ద లీగ్‌లో అడుగుపెట్టాడు. సన్‌రైజర్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనే ఇషాన్ కిషన్ వంటి బ్యాటర్లకు చుక్కలు చూపించి తన సత్తా చాటాడు. భవిష్యత్తులో టీమిండియాలో కూడా అడుగుపెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..