
సభలు.. ఆడియో ఫంక్షన్స్.. శుభ కార్యక్రమాలు..ఇలా ఏ కార్యక్రమం జరిగినా ముందుగా దీప ప్రజ్వలనంతో ప్రారంభిస్తారు. అంటే ముందుగా దీపారాధన చేసి తరువాత మిగతా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. దీపానికి అంత ప్రాముఖ్యత ఎందుకు ఇస్తారు. దీపం వెలిగించకపోతే నష్టం ఉంటుందా.. తలపెట్టిన కార్యక్రమం సక్సెస్ అవడానికి దీపారాధనకు సంబంధం ఏమిటి.. మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . . !
ఏదైనా కార్యక్రమం తలపెట్టినా , ప్రారంభోత్సవమైనా.. ఏదైనా శుభ కార్యాన్ని దీపం వెలిగించడం ద్వారా జరుగుతుంది. ప్రాచీన కాలం నుంచి మన కార్యక్రమాలన్నీ దీపాలను వెలిగించడంతో ప్రారంభమయ్యాయి. ఇంట్లో ఉదయం ప్రార్థనలు ప్రారంభించే ముందు దీపాలు వెలిగించి, ఆపై పూజ చేయడం ఆచారం. దీపారాధాన శుభానికి ప్రతీక అని పండితులు చెబుతున్నారు.
సాధారణంగా ఏదైనా కార్యక్రమం ప్రారంభించే ముందు దీపారాధన చేస్తారు. అంతెందకు.. చాలామంది.. సనాతన ధర్మంలో హిందువులు కాలకృత్యాల అనంతరం దీపారాధన చేసుకొని అతికొద్ది సేపు ధ్యానం చేసి తరువాత దైనందిక జీవితాన్ని ప్రారంభిస్తారు. అలాగే వ్యాపార స్థలాల్లో.. షాపుల్లో కూడా దీపారాధన చేస్తుంటారు. అయితే ఇదంతా నమ్మకంపై ఆధారపడి ఉంటుంది.
భారతీయ సంప్రదాయంలో దీపం వెలిగించే సంప్రదాయం చాలా పురాతనమైనది. ఏదైనా కార్యక్రమం, ప్రారంభోత్సవం లేదా ఏదైనా శుభ కార్యం దీపం వెలిగించడం ద్వారా జరుగుతుంది. ప్రతి కార్యక్రమాన్ని దీపారాధనతో ప్రారంభిస్తారు. దీపం వెలిగిస్తూ “దీపజ్యోతి: పరబ్రహ్మ దీపజ్యోతి జనార్థన్ః, దీపో హరతు మే పాపం దీపజ్యోతిర్నమోస్తుతే” అనే శ్లోకాన్ని పఠిస్తారు.
పురాణాల్లో దీపారాధన …దీపం ప్రాముఖ్యత.. దీపారాధన మంత్రం గురించి రుషులు వివరించారు. దీపం వెలుగు పరమ బ్రహ్మ.. విష్ణువు (జనార్ధన).. ఇది మన పాపాలను.. అజ్ఞానాన్ని తొలగిస్తుంది, నేను అలాంటి వెలుగుకు నమస్కరిస్తున్నానని అర్దం.
దేవునికి అర్పించే ఏ ఆహారం అయినా అగ్ని ద్వారా జరుగుతుంది. అందుకే ఇప్పటికి కూడా కొంతమంది ఇళ్లలో ఆచారాలు పాటించేవారు అన్నం వండిన తరువాత దానిలో నెయ్యి చుక్క వేసి.. స్వాహా అంటూ ముందు అగ్ని దేవునికి సమర్పించి.. దీపం ద్వారా దేవునికి ప్రార్థనలు అర్పిస్తారు. దీపాన్ని దేవుని రూపంగా భావిస్తారు. దీపం జ్వాలా ఎప్పుడూ పైకి మండుతుంది. ఈ కదలిక పెరుగుదల, పురోగతి, శ్రేయస్సును సూచిస్తుందని పండితులు చెబుతున్నారు.
దీపం ప్రతికూల శక్తిని తొలగించి మనల్ని శక్తివంతం చేసి, మన చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులను తరిమికొడుతుంది. దీపం నుంచి వెలువడే కాంతి మన అజ్ఞానాన్ని తొలగిస్తుంది. మనకు జ్ఞాన కాంతిని అందిస్తుంది. సమావేశాలు, వేడుకలలో, దీపం వెలిగించి అగ్నిదేవుడికి ప్రార్థన చేస్తారు .. నేను ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను… నేను మీ ఆశీర్వాదాలను కోరుకుంటున్నాను అని ప్రార్థిస్తారు.
పురాణాల ప్రకారం అగ్నిదేవుడు పంచ భూతాలలో (ఆకాశం, భూమి, అగ్ని, నీరు, గాలి) ఒకటి. అగ్ని సూర్యుడిని సూచిస్తుంది. ఈ ఐదు అంశాలను నిలబెట్టే శక్తిని అగ్నిదేవుడికి ఉంటుందని పండితులు చెబుతున్నారు. అందుకే ప్రతి రోజు చేసే పనుల్లో విజయం కలిగేలా ఆశీర్వదించమని దీపారాధన చేసి నమస్కరిస్తూ తెలియకుండానే అగ్నిదేవుడిని ప్రార్థిస్తారు.
దీపం ఎందుకు వెలిగించాలి..
చిన్న వ్యాపారమైనా, పెద్ద వ్యాపారమైనా, వీధి వ్యాపారి అయినా, వ్యాపారం చేయడానికి ప్రతిరోజూ దీపం వెలిగించి ప్రారంభిస్తే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అవకాశం ఉంటే దీపం వెలిగించినప్పుడు, ఎనిమిది దిశలలో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన ప్రతికూల శక్తులు తొలగిపోయి.. సానుకూల శక్తులు ఆకర్షించబడతాయి. అందుకే అగర్బత్తీలు వెలిగించి దేవుడి మందిరం చుట్టూ తిప్పి తరువాత దేవుడికి చూపిస్తారు. ఇక రైతుల విషయానికొస్తే విత్తనాలు విత్తే ముందు భూమిలో రెండు దీపాలను వెలిగించి మంచి పంట కోసం ప్రార్థించాలని పండితులు చెబుతున్నారు.