
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ తనదైన ముద్ర వేస్తోందని, రాష్ట్రంలో ప్రస్తుతం ట్రిపుల్ ఇంజిన్ ప్రభుత్వం విజయవంతంగా నడుస్తోందని బీజేపీ అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ స్పష్టం చేశారు. ఏపీలో రాజకీయ పరిణామాలు, కూటమి ప్రభుత్వం పనితీరుపై TV9 క్రాస్ ఫైర్‌లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీని గ్రామ స్థాయికి విస్తరించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఆయన వెల్లడించారు. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి విషయంలో బీజేపీ మెతక వైఖరి అవలంబిస్తోందన్న విమర్శలను మాధవ్ తీవ్రంగా ఖండించారు. జగన్ అరెస్ట్ కాకుండా బీజేపీ కాపాడుతోందన్న వాదనలో ఏమాత్రం నిజం లేదని.. ఆయన మోదీకి దత్తపుత్రుడు కాదని తేల్చి చెప్పారు. ‘‘జగన్‌ను ఎక్కడ పెట్టాలో అక్కడే పెడుతున్నాం.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై కేసులు నడుస్తున్నాయి. చట్టం తన పని తాను చేసుకుపోతుంది’’ అని ఆయన స్పష్టం చేశారు.
కూటమి ధర్మం – 15 ఏళ్ల ప్రయాణం
ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మరో 15 ఏళ్ల పాటు కొనసాగాలన్నదే తమ ఆకాంక్ష అని మాధవ్ తెలిపారు. కూటమి ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉన్నప్పటికీ, ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ భాగం పంచుకోలేమని, అయితే కీలక నిర్ణయాల సమయంలో ప్రభుత్వం తమతో సంప్రదింపులు జరుపుతోందని తెలిపారు. అక్కడక్కడా అసంతృప్తులు ఉన్నప్పటికీ, అవి విపక్షాలకు అస్త్రాలుగా మారకుండా జాగ్రత్త పడుతున్నామని వివరించారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో బీజేపీ కేంద్రం నుంచి పూర్తి సహకారం అందిస్తోందని మాధవ్ తెలిపారు. రాజధాని విషయంలో వాస్తవిక దృక్పథంతో ముందుకు వెళ్లాలని ప్రభుత్వానికి సూచించామని, దానికి తగ్గట్టే పనులు జరుగుతున్నాయని చెప్పారు.