
- ఏప్రిల్ 1 నుంచి పాన్‌తో క్రెడిట్ కార్డ్ లింక్ తప్పనిసరి
- పెద్ద ట్రాన్సాక్షన్లపై పెరగనున్న నిఘా
- ఆఫీస్ కార్డ్‌తో చేసే పర్సనల్ ఖర్చులు ట్యాక్స్ పరిధిలోకి
న్యూఢిల్లీ: ఇక నుంచి క్రెడిట్ కార్డును ఎడాపెడా వాడకపోవడం బెటర్. ఏప్రిల్ 1 నుంచి పాన్‌తో క్రెడిట్ కార్డును లింక్ చేయడం తప్పనిసరి. దీంతో యూజర్ జరిపే ప్రతీ ట్రాన్సాక్షన్ వివరాలు ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ (ఐటీడీ) కి వెళతాయి. ముఖ్యంగా పెద్ద ట్రాన్సాక్షన్లపై ఆధికారులు ఓ కన్నేసి ఉంచుతారు. ప్రస్తుతం బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు అనుమానాస్పద, రూ.10 లక్షలకు మంచిన క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్ వివరాలను ఐటీడీకి పంపుతున్నాయి. వచ్చే నెల నుంచి అన్ని ట్రాన్సాక్షన్లు ఐటీ రేడార్‌లో ఉంటాయి. ఫైనాన్షియల్ సంస్థలు పాన్ లేకుండా కొత్త కార్డులను ఇవ్వడానికి కుదరదు.
ఆఫీస్ కార్డ్‌తో అధికారిక ఖర్చులే
ఆఫీస్ క్రెడిట్ కార్డ్‌తో పర్సనల్ ఖర్చులు చేస్తే అవి పన్ను పరిధిలోకి వస్తాయి. కంపెనీ ఇచ్చిన కార్డ్‌ను వ్యక్తిగత షాపింగ్, డైనింగ్, గ్రాసరీలకు వాడితే దానిని ‘‘పన్ను చెల్లించాల్సిన ప్రయోజనం’’గా పరిగణిస్తారు. ఈ ఖర్చులను ఆదాయానికి జోడించి పన్ను లెక్కిస్తారు. ఉదాహరణకు, ఏడాదికి రూ.13లక్షలు శాలరీ ఆదాయం పొందే ఉద్యోగి, ఆఫీస్ కార్డుతో రూ.5 లక్షలు ఖర్చు చేస్తే, యజమాని ఈ ఖర్చును ఫారం 130లో చూపిస్తారు. దీంతో రూ.18 లక్షలపై ట్యాక్స్ లెక్కిస్తారు. అయితే అధికారిక ప్రయాణాలు, బిజినెస్ మీటింగ్స్ సంబంధిత ఖర్చులకు పన్ను నుంచి మినహాయింపు ఉంటుంది. ఇలాంటి ఖర్చులకు బిల్లులు, రికార్డులు జాగ్రత్తగా ఉంచాలి. ఆఫీస్ కార్డ్‌తో చేసే ఖర్చు ఎక్కువగా ఉంటే, పర్సనల్ కార్డుతో ఖర్చులు జరిపి ఆఫీస్ నుంచి రియింబర్స్‌మెంట్ పొందడం బెటర్. పర్సనల్ క్రెడిట్ కార్డుతో చేసే ఖర్చులు పన్ను పరిధిలోకి రావు. వాటిని ఆదాయంగా పరిగణించరు.
క్రెడిట్ కార్డ్‌తో పన్ను చెల్లింపు
ఇన్‌కమ్ ట్యాక్స్ బకాయిలను క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లించుకోవచ్చు. కానీ బిల్లు సకాలంలో చెల్లించకపోతే భారీ వడ్డీ, పెనాల్టీలు పడతాయి.
ఈ జాగ్రత్తలు పాటించండి..
1) క్రెడిట్ కార్డులను పాన్‌తో లింక్ చేయండి. ఏడాది పొడవునా జరిపే పెద్ద ఖర్చులను జాగ్రత్తగా గమనించండి. మీ ఆదాయానికి అనుగుణంగా ఖర్చులు లేకపోతే పన్ను శాఖ నుంచి నోటీసులు వస్తాయి.
2) ఆఫీసు కార్డ్‌ను కేవలం అధికారిక పనులకు మాత్రమే వాడండి. గ్రాసరీ, పర్సనల్ గ్యాడ్జెట్లు, షాపింగ్‌కు వాడొద్దు. ఈ కొత్త నియమాలతో ఆదాయపు పన్ను శాఖ పర్యవేక్షణ మరింత మెరుగవుతుంది.
మరికొన్ని కొత్త రూల్స్
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం 2026–27 మొదలుకానుంది. కిందటేడాది కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన రూ.12 లక్షల వరకు ‘నో ట్యాక్స్’ బెనిఫిట్స్‌ను ఏప్రిల్ 1 తర్వాత పొందొచ్చు. 2025–26 ఆర్థిక సంవత్సరం కోసం వచ్చే జులైలోపు ఐటీఆర్ ఫైలింగ్ ఉంటుంది. మరోవైపు క్రెడిట్ కార్డ్, పాన్ లింక్, ఫారం 16 మార్పు, ట్యాక్స్ ఇయర్ మార్పు వంటి కొత్త ఐటీ నియమాలు కూడా అమల్లోకి రానున్నాయి. అవి..
- వచ్చే నెల 1 నుంచి క్రెడిట్ కార్డ్ తీసుకోవడానికి పాన్ తప్పనిసరి. పాన్‌కార్డు తీసుకోవడానికి ఆధార్‌తో పాటు డేట్ ఆఫ్ బర్త్ (డీఓబీ) ప్రూఫ్ తప్పనిసరి. పాత పాన్ అప్లికేషన్లు చెల్లవు.
- రూ.10 లక్షలు పైబడిన ఖర్చులపై నిఘా మరింత పెరగనుంది.
- ఉద్యోగులకు యజమాని ఇచ్చే ఫారం 16లో ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ (టీడీఎస్) వివరాలు ఉండేవి. పార్ట్ ఏ, పార్ట్ బీ కింద రెండు ఫార్మాట్‌లలో వివరాలు ఉండేవి. కొత్త రూల్ ప్రకారం, ఇక నుంచి ఫారం 16 బదులు కొత్త ఫారం 130 ని యజమానులు ఇస్తారు. ఇది ఒకే ఫార్మాట్‌లో ఉంటుంది. ఉద్యోగి జీతం, ఇతర ఆదాయాలు, టీడీఎస్, ఇన్వెస్ట్‌మెంట్ డిడక్షన్లు, ట్యాక్స్ బకాయిలు వంటి వివరాలన్నీ ఒకే ఫారంలో స్పష్టంగా ఉంటాయి. ఫారం 130తో ట్యాక్స్ ఫైలింగ్ మరింత సులభం అవుతుంది. ఐటీ శాఖ ఇష్యూ చేసే యాన్యువల్ ఇన్‌ఫర్మేషన్ స్టేట్‌మెంట్ (ఏఐఎస్) లోని వివరాలతో మిస్‌మ్యాచ్ తగ్గుతుంది.
- ఇక నుంచి ఫైనాన్షియల్ ఇయర్ (ఎఫ్‌వై), అసెస్‌మెంట్ ఇయర్ (ఏవై) అనే పదాలు ఉండవు. ట్యాక్స్ ఫైలింగ్‌ను సులభం చేయడానికి ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి ‘ట్యాక్స్ ఇయర్’ అనే పదాన్ని మాత్రమే ఉపయోగించనుంది. ఉదాహరణకు, 2025–26 ఆర్థిక సంవత్సరం కోసం ట్యాక్స్ ఫైల్ చేస్తే 2025–26 ఎఫ్‌వై అవుతుంది. తర్వాతి ఆర్థిక సంవత్సరం 2026–27 ఏవై అవుతుంది. ఇక నుంచి ఇవన్నీ ఉండవు. 2025–26ను ట్యాక్స్ ఇయర్‌గా పిలుస్తారు. ఈ ట్యాక్స్ ఇయర్‌కు సంబంధించిన ఐటీఆర్‌లను 2026 జులైలోపు (సాధారణంగా ఐటీఆర్ డెడ్‌లైన్) ఫైల్ చేయాలి.