Reading Time: 2 minutes
ఫోజులకు ఏమాత్రం తక్కువ లేదు.. అందమైన ముఖం వెనక అతి కిరాతకమా..! మూడేళ్లకు బయటపడ్డ నిజం!

చేసిన పాపం ఊరికే పోదు.. ఎప్పటికైనా వెంటాడుతుంది. ఈ కలియుగంలో మాత్రం కాస్త లేటు అవ్వచ్చేమో కానీ, శిక్ష మాత్రం పక్కా అని మరో ఘటనతో రుజువు అయ్యింది. మూడేళ్ల క్రితం ఒక సాధారణ మరణంగా ముగిసిపోయిన ఓ కేసు.. ఇప్పుడు ఊహించని మలుపు తిరిగి సంచలనం సృష్టిస్తోంది. కన్న తండ్రినే అతి కిరాతకంగా అంతమొందించిన ఒక పోలీస్ కుమార్తె ఉదంతం.. చట్టం ముందు ఎవరూ తప్పించుకోలేరనే నిజాన్ని చాటిచెప్పింది.

ఫోజులకు ఏమాత్రం తక్కువ లేదు…! అందమైన ఈ ముఖం వెనక అతి కిరాతకం దాగుంది..! ఎంతలా తన ప్రేమ కోసం కన్న తండ్రిని చంపేంత..! తండ్రి ఉద్యోగాన్ని ఎంజాయ్ చేస్తూ.. లవర్‌తో తిరిగేంతలా..! కానీ అబద్దానికి ఎక్స్‌పైరీ డేట్‌ ఉంటుందన్నట్టు.. మూడేళ్ల తర్వాత నిజం బయటకొచ్చింది. మొన్నటిదాకా లాఠీ పట్టిన ఈ లేడీ.. ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కబెడుతోంది.

2023 ఏప్రిల్ 25న మహారాష్ట్రకు చెందిన 45 ఏళ్ల పోలీస్ అధికారి జయంత్ బల్లవార్ విధులకు వెళ్తుండగా కుమార్తె మిల్క్‌ షేక్ ఇచ్చింది. అది తాగిన కొద్దిసేపటికే ఆయన చంద్రపూర్‌లోని జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ అకస్మాత్తుగా కళ్ళు తిరిగి పడిపోయి మరణించారు. అప్పట్లో దీనిని కేవలం అనారోగ్య కారణాలతో సంభవించిన సహజ మరణంగా భావించారు. ఎటువంటి పోస్ట్‌మార్టం నిర్వహించకుండానే కేసును ముగించారు. అయితే, ఈ మరణం వెనుక ఒక భయంకరమైన కుట్ర దాగి ఉందని మూడేళ్ల తర్వాత వెలుగులోకి వచ్చింది. కుమార్తె ఆర్య బల్లవార్, ఆమె భర్త ఆశిష్ షెడ్మేక్ కలిసి జయంత్ బల్లవార్‌ను చంపేసినట్లు తేలింది.

2022 నుండి ఆర్య బల్లవార్‌, ఆశిష్‌తో ప్రేమలో ఉంది. వీరి బంధాన్ని తండ్రి జయంత్ తీవ్రంగా వ్యతిరేకించాడు. దీంతో తమ ప్రేమకు అడ్డుగా ఉన్న తండ్రిని తొలగించుకోవాలని లవర్‌తో కలిసి ప్లాన్ చేసింది. ప్రియుడి తీసుకొచ్చిన విషాన్ని తండ్రి విధులకు వెళ్లే ముందు మిల్క్‌ షేక్‌లో కలిపి ఇచ్చి ఆయన ప్రాణాలు తీసింది. తండ్రి మరణం తర్వాత కారుణ్య నియామకం కింద హెడ్‌ కానిస్టేబుల్‌ గానూ జాబ్ కొట్టేసింది. ఆ తర్వాత ప్రియుడి ఆశిష్‌ను వివాహం చేసుకుంది.

ఇక పెళ్లయిన కొద్దికాలానికే వీరిద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. క్రమశిక్షణారాహిత్యం కారణంగా ఆశిష్ పోలీస్ శిక్షణ నుండి డిస్మిస్ అయ్యాడు. గొడవలు ముదరడంతో ఆర్య తన తల్లిగారి ఇంట్లోనే ఉండిపోయింది. గత వారం వీరి మధ్య జరిగిన గొడవ పతాక స్థాయికి చేరడంతో, ఆశిష్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి భార్యతో కలిసి చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. దీంతో ఆర్య బల్లవార్, ఆశిష్‌ను అదుపులోకి తీసుకున్నారు. వీళ్లకు సహకరించిన మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

మొత్తంగా… నిజం నిలకడ మీద తెలుస్తుందన్నట్లుగా, మూడు ఏళ్ల పాటు గుట్టుగా దాచిన ఈ హత్యోదంతం చివరకు నిందితుల మధ్య వచ్చిన గొడవల వల్ల బయటపడింది. ప్రియుడి కోసం కన్న తండ్రిని చంపిన ఉదంతం మ‌హారాష్ట్ర పోలీస్ శాఖను విస్మయానికి గురిచేసింది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..