
దెయ్యం పట్టిందంటూ ఓ ప్రయాణికుడు విమానంలో ఎమర్జెన్సీ డోర్ తెరవడానికి ప్రయత్నించిన ఘటన కలకలం రేపింది. బెంగుళూరు నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానం కొద్దిసేపట్లో ల్యాండ్ అవుతుందన్న సమయంలో ఎమర్జెన్సీ డోర్ తెరవడానికి ప్రయత్నించడంతో విమానంలోని వారంతా భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..
బెంగళూరు నుండి వారణాసికి వెళ్తున్న ఇండిగో విమానం 6E-185 శనివారం ( మార్చి 28 ) రాత్రి 8:15 గంటలకు బెంగళూరు నుండి బయలుదేరింది. అందులోని ప్రయాణికులలో ఉత్తర ప్రదేశ్‌లోని మౌ జిల్లాకు చెందిన మహమ్మద్ అద్నాన్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. విమానం బయలుదేరిన కేవలం 15 నిమిషాలకే, అద్నాన్ ఎమర్జెన్సీ డోర్ తెరవడానికి ప్రయత్నించాడని అధికారులు తెలిపారు. దీనిని గుర్తించిన క్యాబిన్ సిబ్బంది మళ్లీ అలాంటి పని చేయవద్దని అద్నాన్ ను హెచ్చరించినట్లు తెలిపారు.
వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ కావడానికి కొద్ది క్షణాల ముందు, రాత్రి సుమారు 10.20 గంటల సమయంలో.. విమానం 500 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు, అద్నాన్ మరోసారి ఎమర్జెన్సీ డోర్ తెరవడానికి ప్రయత్నించాడని… సిబ్బంది అప్రమత్తం చేయడంతో, పైలట్ ల్యాండింగ్ ను ఆపేశాడని అధికారులు తెలిపారు.
►ALSO READ | అందిన కాడికి అప్పులు.. తిరిగి కట్టలేక తల్లిని, అక్కను చంపేశాడు.. అక్క కొడుకు పరిస్థితి విషమం !
కొద్దిసేపు గో అరౌండ్ ప్రక్రియ నిర్వహించిన తర్వాత రాత్రి 10:35 గంటల సమయంలో విమానం ల్యాండ్ అయినట్లు అధికారులు తెలిపారు. అద్నాన్ ను అదుపులోకి తీసుకొని CISF అధికారులకు అప్పగించామని తెలిపారు సిబ్బంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు అధికారులు.
తాను అలా ఎందుకు ప్రవర్తించానో తెలియలేదని.. దెయ్యం పట్టడం వల్ల అలా చేశానని అద్నాన్ విచారణలో వెల్లడించినట్లు తెలిపారు పోలీసులు. తాను గోవా ట్రిప్ ముగించుకుని తిరిగి వస్తున్నానని, తాను లాగుతున్న హ్యాండిల్ ఎమర్జెన్సీ డోర్ కి సంబంధించినదని తనకు తెలియదని అద్నాన్ చెప్పినట్లు తెలిపారు పోలీసులు.