
నేపాల్‌లో దేశ మాజీ ప్రధాని కెపి శర్మ ఓలిని శనివారం అరెస్టు చేశారు. కొత్తగా ఏర్పడ్డ బాలేంద్ర షా ప్రభుత్వం ఈ తీవ్ర చర్యకు దిగింది. 2025 జన్ జడ్ నిరసనల అణచివేతల అంశంపై దర్యాప్తు కమిటీ నివేదిక సమర్పించింది. దీని ఆధారంగా మాజీ ప్రధాని, సిపిఎన్‌యుఎంఎల్ ఛైర్మన్ కూడా అయిన ఓలిని అదుపులోకి తీసుకున్నారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఆయననుఖాట్మాండుకు సమీపంలోని భక్త్‌పూర్ జిల్లాలోని గుండూ ప్రాంతంలో అరెస్టు చేసినట్లు పోలీసు వర్గాలు ప్రకటించాయి. కటుంజెలోని ఆయన నివాసం నుంచి మాజీ హోం మంత్రి , నేపాలీ కాంగ్రెస్ నేత రమేష్ లేఖక్‌కు నూడా పోలీసులు అరెస్టు చేశారు. గత ఏడాది సెప్టెంబర్‌లో యువతరం నుంచి అధికార పక్షానికి నిరసనలు వ్యక్తం అయ్యాయి.
ఇది జన్‌జడ్ ఉద్యమంగా మార్మోగింది. అప్పుడు అధికారంలో ఉన్న ఓలి , లేఖక్‌ల ప్రోద్బలంతో ఉద్యమం అణచివేతకు దమననీతిని ప్రదర్శించారనే అభియోగాలపై దర్యాప్తు జరిగింది. కమిటీ నివేదిక వెలువరించింది. వీరిపైనా ఇతరులపైనా నేరపూరిత చర్యల కేసులు దాఖలు అయ్యాయి. ఇటీవలే పగ్గాలు చేపట్టిన బాలేంద్ర షా ఆధ్వర్యంలో శుక్రవారమే నూతన మంత్రి మండలి సమావేశం జరిగింది. దర్యాప్తు కమిటీ నివేదికను తక్షణం అమలు చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పుడు పోలీసు చర్యకుదిగారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని ఇప్పటి అరెస్టులపై నూతన హోం మంత్రి సుధాన్ గురుంగ్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు.